logo

రెప్పపాటులో ముప్పు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 44వ నంబరు జాతీయ రహదారి 84 కి.మీ. మేర వెళ్తుంది. కర్నూలు నుంచి ప్యాపిలి మండలం పోతులదొడ్డి వరకు ఇది ఉంది.

Published : 28 Nov 2022 03:08 IST

కానరాని అండర్‌ పాస్‌లు 
బ్లాక్‌ స్పాట్లు గుర్తించినా నియంత్రణ కరవు


ప్రమాదకరంగా రహదారి దాటుతూ...

డోన్‌, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 44వ నంబరు జాతీయ రహదారి 84 కి.మీ. మేర వెళ్తుంది. కర్నూలు నుంచి ప్యాపిలి మండలం పోతులదొడ్డి వరకు ఇది ఉంది. ఈ మార్గంలో పలు ప్రాంతాల్లో అండర్‌ పాస్‌లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు దాటాల్సి రావడం.. ప్రమాదాలు నిత్యకృత్యమవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అండర్‌ పాస్‌లు ఏర్పాటుచేయాలంటూ గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకునేవారే కరవయ్యారని పలువురు పేర్కొన్నారు.

పకడ్బందీ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం

ఉమ్మడి జిల్లా మీదుగా వెళ్లే జాతీయ రహదారిపై పలుచోట్ల ప్రమాదకరమైన ప్రాంతాలున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు బ్లాక్‌ స్పాట్లు సైతం గుర్తించారు. నిత్యం ప్రమాదాలు జరిగే ప్రధాన ప్రాంతాల్లో డ్రమ్ములు అడ్డంగా ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపట్టినా అవి మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. పెట్టిన కోద్దిరోజులకే వాహనాలు డ్రమ్ములను ఢీకొడుతుండటంతో పక్కన పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి ఉంది.


ప్రమాదకరమైన ప్రాంతాలివే..

* కర్నూలు నుంచి డోన్‌ వెళ్లే ప్రాంతంలో లక్ష్మీపురం సమీపంలో ఉన్న క్రాస్‌ వద్ద ఎక్కువగా వాహనాలు అటు.. ఇటు వెళ్తుంటాయి. ఇక్కడ మూడేళ్ల కాలంలో పదుల సంఖ్యలో జనం గాయపడగా.. ఇద్దరు మృతి చెందారు.

* దూపాడు వద్ద ప్రధానంగా అవతలి వైపున కళాశాలలు ఉండటంతో విద్యార్థులు జాతీయ రహదారిని దాటుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పలుమార్లు ప్రమాదాలబారిన పడ్డారు.

* వెల్దుర్తి ప్రాంతంలో మలుపు వద్ద నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడినుంచి ప్రధానంగా అవతలి వైపునకు వెళ్లేందుకు కోడుమూరు రహదారి ఉండటం, కొద్ది దూరం వెళ్తే చెరుకులపాడు రహదారి ఉండటంతో జాతీయ రహదారి దాటాల్సిన పరిస్థితి. ఇక్కడ మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో 17 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

* డోన్‌ నుంచి దొరపల్లె.. మల్లెంపల్లె మీదుగా కృష్ణగిరి మండలంలోని పలు గ్రామాలకు వెళ్లేందుకు దొరపల్లె వంతెన సమీపంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రహదారి దాటాలి. ఇక్కడ ఈ మూడేళ్ల కాలంలో 8 మంది వరకు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఏడాది ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇక్కడ రైల్వే వంతెన వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు విన్నవిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

* డోన్‌ మండలంలోని ఓబులాపురం వద్ద జాతీయ రహదారి దాటి ఓబులాపురం, యాపదిన్నె తదితర గ్రామాల మీదుగా పదుల సంఖ్యలో డోన్‌ మండలంలోని గ్రామాలతోపాటు అటు కృష్ణగిరి మండలం, తుగ్గలి మండలాలకు వెళ్లేందుకు ఈ రహదారి ప్రధానమైనది. ఇక్కడా జాతీయ రహదారిని దాటి వెళాల్సిన పరిస్థితి. ఈ మూడేళ్ల కాలంలో ఇక్కడ 10 మంది వరకు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

వాహనాల వేగ నియంత్రణకు ఏర్పాటు చేసిన డ్రమ్ములు ఇలా..


త్వరలో ఆరు వరుసల రహదారి నిర్మాణం
- శ్రావణ్‌, ఎన్‌హెచ్‌ఏఐ మేనేజర్‌

జాతీయ రహదారిని త్వరలో ఆరు వరుసలుగా మార్చేందుకు సర్వే చేపడుతున్నాం.  ఎక్కడెక్కడ ప్రమాదకరంగా మలుపులున్నాయో అక్కడ అండర్‌ పాస్‌లు, సర్వీసు రహదారులు ఏర్పాటు చేయనున్నాం. మరో మూడు నెలల్లో ఆరు వరుసల రహదారి పనులు చేపట్టే అవకాశం ఉంది.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని