logo

సున్నా వడ్డీకి ఈ-పంట ముడి

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం అర్హులను ప్రభుత్వం ఏటేటా కుదిస్తోంది. 2019 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1.92 లక్షల మందికి రూ.33.53 కోట్ల వడ్డీ రాయితీ వర్తింపజేశారు. 2020 ఖరీఫ్‌లో 70 వేల మందికి కుదించారు.

Published : 28 Nov 2022 03:08 IST

రాయితీ వర్తింపులో చిక్కుముళ్లు
వేలాది మందికి మొండిచేయి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం అర్హులను ప్రభుత్వం ఏటేటా కుదిస్తోంది. 2019 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 1.92 లక్షల మందికి రూ.33.53 కోట్ల వడ్డీ రాయితీ వర్తింపజేశారు. 2020 ఖరీఫ్‌లో 70 వేల మందికి కుదించారు. 2021 ఖరీఫ్‌లో ఉమ్మడి జిల్లాలో 75 వేల మంది మాత్రమే లబ్ధి పొందడం గమనార్హం. 2020-21 (రబీ), 2021 (ఖరీఫ్‌), 2019 నుంచి 2020 వరకు వడ్డీ రాయితీ జమకాని 1,82,387 మంది అన్నదాతలకు రూ.38.68 కోట్ల సున్నా వడ్డీ రాయితీని ఈనెల 28న జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.లక్ష పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించినప్పటికీ రుణం తీసుకున్న పంటకు, ఈ-క్రాప్‌ నమోదుకు తేడా ఉండటంతో ఉమ్మడి జిల్లాలో 15 వేల మందిని పథకానికి దూరం చేశారు.

అభ్యంతరాల స్వీకరణేదీ..

* వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన అర్హులైన రైతుల జాబితాను రెండు వారాల కిందట రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్‌ నుంచి విడుదలైంది. నిబంధనల ప్రకారం జాబితాలు ఆర్బీకేల్లో ప్రదర్శించాలి.. అన్నదాతలకు సమాచారం ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాలో 877 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. చాలాచోట్ల జాబితాను అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం.

* అర్హులైన రైతుల పేర్లు జాబితాలో లేకపోతే అర్జీలు స్వీకరించాలని కమిషనరేట్‌ నుంచి ఆదేశాలు ఉన్నాయి. గ్రీవెన్స్‌ ఆప్షన్‌ రాలేదని ఉమ్మడి జిల్లాలో అర్జీలు స్వీకరించలేదు. అర్హత ఉన్నా జాబితాలో పేర్లు లేకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు.

కొరవడిన అవగాహన

* సున్నా వడ్డీ లబ్ధి పొందాలంటే ఈ-పంట నమోదై ఉండాలి. ఈ-పంట నమోదు, రుణం తీసుకునే సమయంలో ఒకే పంట నమోదై ఉండాలి. చాలా మంది రైతులకు అవగాహన లేక ఏదో ఓ పంట నమోదు చేయిస్తున్నారు. వేర్వేరుగా ఉండటంతో ఈ-పంటలో ఉన్న వారికే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రాయితీ ఇస్తున్నారు.

* రుణాలు పునరుద్ధరించే సమయంలో ఏ పంట కోసమనేది బ్యాంకర్లు అడగడం లేదు. 1బి, అడంగళ్‌ ప్రతులు తెప్పించుకుని దరఖాస్తు నమూనా నింపి పక్కన పెడుతున్నారు. తర్వాత ఆన్‌లైన్‌ చేసే క్రమంలో ఏదో ఓ పంటను నింపేస్తున్నారు. కొందరు రైతులు వాణిజ్య పంటలకు బ్యాంకులో రుణం తీసుకుని ఈ-పంట నమోదులో ఇతర పంటలను సాగు చేసినట్లు నమోదు చేయించుకుంటున్నారు. ఫలితంగా సమస్యలు ఎదురవుతున్నాయి.


రెండేళ్ల తర్వాత..

2019 నుంచి 2020 వరకు ఖరీఫ్‌, రబీ సీజన్లలో రూ.లక్ష పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులు 80,969 మంది వరకు ఉన్నారు. వీరంతా రెండేళ్ల నుంచి సున్నా వడ్డీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం సదించి వీరికి ఇచ్చేందుకు సుముఖత చూపింది. కర్నూలు జిల్లా పరిధిలో 44,416 మంది రైతులకు రూ.9 కోట్లు, నంద్యాల జిల్లాలో 36,553 మందికి రూ.8.12 కోట్లు   జమ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని