logo

జీఆర్‌పీ డివిజన్‌ తరలింపునకు ఒత్తిడి

‘గురు రాఘవేంద్ర ప్రాజెక్టు’ డివిజన్‌ కార్యాలయం తరలించాలని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ నేత పట్టుబడుతున్నారు. జీఆర్‌పీ పరిధిలో చిలకలడోణ, మూగలదొడ్డి, పులిచింతల, సోగనూరు, దుద్ది, మాధవరం, బసలదొడ్డి, పులికనుమ, పులకుర్తి పథకాల ద్వారా 50,900 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతోంది.

Published : 28 Nov 2022 03:08 IST

పట్టుబడుతున్న పశ్చిమ ప్రాంతానికి చెందిన నేత


గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలోని బసలదొడ్డి పథకం

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: ‘గురు రాఘవేంద్ర ప్రాజెక్టు’ డివిజన్‌ కార్యాలయం తరలించాలని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ నేత పట్టుబడుతున్నారు. జీఆర్‌పీ పరిధిలో చిలకలడోణ, మూగలదొడ్డి, పులిచింతల, సోగనూరు, దుద్ది, మాధవరం, బసలదొడ్డి, పులికనుమ, పులకుర్తి పథకాల ద్వారా 50,900 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతోంది. ప్రాజెక్టు ప్రారంభించి 10 ఏళ్లు దాటిందని, ఎప్పుడో.. ఎవరో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పటికీ ఎందుకు కొనసాగాలని ప్రశ్నిస్తున్న నేత.. డివిజన్‌ కార్యాలయాన్ని ఎమ్మిగనూరు నుంచి తిరిగి మదనపల్లికి తరలించాలని జలవనరులశాఖ ఇంజినీర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈనెల 17న నంద్యాలలో జరిగిన ఐఏబీ సమావేశంలో సదరు ఎమ్మెల్యే ఈ అంశాన్ని ప్రస్తావించారు. జీఆర్‌పీ డివిజన్‌ను ఇక్కడినుంచి తరలించి ఆ బాధ్యతలను ఎల్లెల్సీ ఇంజినీర్లకు అప్పగించాలని కోరారు. విద్యుత్తు, నిర్వహణ వ్యయం బిల్లులు రూ.134.70 కోట్ల వరకు బకాయిలున్నాయి. ఈ పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వంతో చర్చించి.. మంజూరు చేయించి ఆయకట్టు రైతులకు సాగు నీటి కష్టాలు తీర్చాల్సి ఉండగా.. డివిజన్‌ కార్యాలయం తరలింపుపై దృష్టి సారించడం విమర్శలకు తావిస్తోంది.

విద్యుత్తు బకాయిలు రూ.122 కోట్లు

జీఆర్‌పీకి సంబంధించి గత కొన్నేళ్లుగా రూ.122 కోట్ల వరకు విద్యుత్తు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో పలుమార్లు సరఫరా ఆపేశారు. ఫలితంగా పంటలకు నీరు అందక ఎండిపోయిన ఘటనలు ఉన్నాయి. దీనికితోడు గత మూడేళ్లుగా నిర్వహణ వ్యయం బకాయిలు రూ.12.70 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఆపరేటర్లకు జీతాలు, 13 పంపింగ్‌ స్టేషన్ల వద్ద నిర్వహణ, ప్రెషర్‌ మెయిన్‌ నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఈ బిల్లులు మంజూరు చేయించి సక్రమంగా సాగునీరు అందించేలా చూడాల్సి ఉండగా.. ప్రాజెక్టు తరలించేందుకు పట్టుబడటమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

తెదేపా హయాంలో ఏర్పాటు

తుంగభద్ర దిగువకాల్వ ఆయకట్టు రైతులు సాగు నీటికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అప్పటి మంత్రి బీవీ మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మంత్రాలయం రాఘవేంద్రస్వామి పేరుతో 9 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. ఎల్లెల్సీ ద్వారా సాగునీరు సరిగా అందని రైతులకు ఈ ప్రాజెక్టు ద్వారా పంటలు పండించుకునేలా చర్యలు చేపట్టారు. తెదేపా హయాంలో పథకాలు ఏర్పాటు చేశారని రైతులు చర్చించుకోవడంతో జీపీఆర్‌ను ఇక్కడి నుంచి తరలించాలని సదరు ఎమ్మెల్యే జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తుండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని