logo

ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో ఒకే ఒక్కడు

నంద్యాల  ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయ భవనాన్ని రూ.1.10 కోట్లతో నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంత మొత్తంలో నిధులు మంజూరు చేయలేని పరిస్థితి ఉండటంతో.. శాఖ పేరిట బ్యాంకుల్లో ఉన్న నగదుపై వచ్చే వడ్డీతో భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.

Published : 28 Nov 2022 03:08 IST

అన్ని పనులూ అస్మదీయుడికే..


నిర్మాణంలో ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ భవనం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నంద్యాల  ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కార్యాలయ భవనాన్ని రూ.1.10 కోట్లతో నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇంత మొత్తంలో నిధులు మంజూరు చేయలేని పరిస్థితి ఉండటంతో.. శాఖ పేరిట బ్యాంకుల్లో ఉన్న నగదుపై వచ్చే వడ్డీతో భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఒకేసారి అంత మొత్తం నిధులకు ప్రతిపాదనలు చేసినా ఉన్నతాధికారులు అంగీకరించరన్న కారణంతో.. పనులను నాలుగు భాగాలుగా విభజించారు. ఒక్కో దానికే టెండర్లు పిలుస్తున్నారు. ఇప్పటికే రూ.30 లక్షల వ్యయంతో పిలిచిన టెండరును అస్మదీయుడైన ఓ గుత్తేదారుకు అప్పగించారు. గోడల వరకు పనులు పూర్తయ్యాయి. తాజాగా పైకప్పు స్థాయి వరకు పనులు చేసేందుకు రూ.20 లక్షలతో రెండోసారి టెండరు పిలిచారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది.

గుట్టుగా టెండర్ల అప్పగింత

ఎస్‌ఈ గదితో పాటు సమావేశ మందిరం, అకౌంట్స్‌, డ్రాయింగ్‌, సిబ్బంది గదులు ఇతర సౌకర్యాలతో భవనం నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. పనుల విభజనలో భాగంగా ఇప్పటికే ఒక టెండరు పూర్తిచేశారు. ఆ మేరకు పనులు కూడా చేశారు. రెండో పనికి ప్రస్తుతం రూ.20 లక్షలతో టెండర్లు పిలిచారు. ఇక మిగిలి పనులకు రూ.60 లక్షలతో అంచనాలు తయారు చేశారు. ఈ మొత్తాన్ని కూడా విడతల వారీగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ప్రతిసారి టెండర్లు పిలిచినా పని మాత్రం ఒకే గుత్తేదారుకు దక్కేలా రూపకల్పన చేశారు. రెండో పనికి కొంతమంది గుత్తేదారులు ఆసక్తి చూపినా కొందరు షెడ్యూళ్లు దాఖలు చేయకుండా నిలువరించడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు పిలిచే ముందు ప్రకటన జారీ చేస్తారు. సంబంధిత కార్యాలయంలోని నోటీసు బోర్డులో కూడా అంచనా వివరాలు తెలుపుతూ ఆసక్తి గల గుత్తేదారుల నుంచి టెండర్లు కోరుతూ ప్రదర్శిస్తారు. ఎస్‌ఈ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా టెండరు పిలిచి ఒకరికే అప్పగిస్తున్నారు.

మొత్తం ఆయనకే..

జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరునిగా చెప్పుకొంటున్న ఓ వ్యక్తి గత కొన్నేళ్లుగా ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ పరిధిలో పలు సీపీడబ్ల్యూ పథకాలను నిర్వహిస్తున్నారు. సంజామల, కోవెలకుంట్ల, యాగంటిపల్లె, అనుపూరు పథకాలను ఒకరే నిర్వహిస్తున్నారు. అవుకు స్కీంను ఉప గుత్తేదారు హోదాలో చేస్తున్నారు. రూ.4 కోట్ల వ్యయం చేసే ఈ పనులు చేస్తున్న అతనికే ప్రస్తుతం ఎస్‌ఈ భవన నిర్మాణ టెండర్లు కట్టబెట్టారు.  వేరే గుత్తేదారులు ముందుకొచ్చినా ఓ నాయకుడు రంగప్రవేశం చేసి నిలువరిస్తున్నారు. ఇలా కొన్నేళ్లుగా ఈ శాఖ పరిధిలోని పనులన్నీ ఒక్కరికే కట్టబెడుతుండటం వివాదాస్పదంగా మారింది. కొంతమంది అధికారులపై వేటు కూడా పడింది. గతంలో పలు ఆరోపణలు    ఎదుర్కొన్న గుత్తేదారుకే వరుసగా పనులు దక్కుతుండటంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని