logo

పశువుల ముంగిటకే వైద్యసేవలు

‘పశు సంవర్ధక శాఖ పరిధిలో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రాయితీపై పలు యంత్రాలు అందిస్తున్నాం. వారంలో ఒకరోజు ప్రతి రైతు భరోసా కేంద్రంలో పశు విజ్ఞాన బడి కార్యక్రమం ద్వారా నిపుణులైన వైద్యుడి పర్యవేక్షణలో పశువులకు చికిత్సలు చేయిస్తున్నాం’.

Published : 28 Nov 2022 03:17 IST

ఆర్‌బీకేలలో పశు విజ్ఞాన బడి
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.రామచంద్రయ్య
న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

‘పశు సంవర్ధక శాఖ పరిధిలో పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. రాయితీపై పలు యంత్రాలు అందిస్తున్నాం. వారంలో ఒకరోజు ప్రతి రైతు భరోసా కేంద్రంలో పశు విజ్ఞాన బడి కార్యక్రమం ద్వారా నిపుణులైన వైద్యుడి పర్యవేక్షణలో పశువులకు చికిత్సలు చేయిస్తున్నాం’ అని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.రామచంద్రయ్య తెలిపారు. పశువులకు వివిధ వ్యాధులు సోకకుండా ఉండేందుకు టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పలు వివరాలు ‘న్యూస్‌టుడే’కు వెల్లడించారు..

* 20 టన్నుల మొక్కజొన్న, 25.3 టన్నుల జొన్న విత్తనాలు జిల్లాకు కేటాయించారు. జొన్న విత్తనాలు 5 కేజీల కిట్టు.. రాయితీపోనూ రైతులు రూ.115 చెల్లించాలి. 5 కేజీల మొక్కజొన్న విత్తనాల కిట్టు రూ.340 కాగా.. రాయితీపోనూ రైతులు రూ.85 చెల్లిస్తే విత్తనాలు సరఫరా చేస్తాం. ఇప్పటి వరకు రెండూ కలిసి 20 టన్నులు అందించాం.

* నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల ఆడ దూడలకు బ్రూసెల్లా వ్యాధి రాకుండా ఉండేలా టీకాలు వేస్తున్నాం. జిల్లాకు 4,513 డోసుల వ్యాక్సిన్లు వచ్చాయి ఇప్పటివరకు 1,022 టీకాలు వేయించాం.  

* జిల్లాకు వెయ్యి మెట్రిక్‌ టన్నుల దాణామృతం కేటాయించారు. కిలో రూ.15.80 కాగా.. రాయితీపోనూ రైతులు రూ.6.50 చెల్లించాలి. ఒక లోడ్‌ 25-30 టన్నులకు ఆర్‌బీకేలలో రైతులు నాన్‌ సబ్సిడీ మొత్తం చెల్లిస్తే పంపిణీ చేస్తాం. ఇప్పటివరకు 662 మెట్రిక్‌ టన్నుల దాణామృతం పంపిణీ చేశాం.

* పశువుల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గానికి ఒక డా.వైఎస్‌ఆర్‌ సంచార పశు వైద్య ఆరోగ్య వాహనాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో వాహనంలో వైద్యుడితోపాటు పారా సిబ్బంది, అటెండరు కమ్‌ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తారు. పశువులకు ఏదైనా అత్యవసర వైద్యం అవసరమైతే టోల్‌ఫ్రీ నంబరు 1962కు సమాచారం అందజేస్తే అర్ధ గంటలో సంఘటనా స్థలానికి చేరుకొని సేవలు అందిస్తారు. జిల్లాకు త్వరలో కొత్తగా మరో ఏడు వాహనాలు రానున్నాయి.

* 2019-2022 ఏడాది అక్టోబరు వరకు మృత్యువాత పడ్డ పశువులకు సంబంధించి రూ.97 లక్షల బడ్జెట్‌ కేటాయించారు. బిల్లులు పెట్టాం. మొత్తం 1,882 పశువులకు రూ.3.65 కోట్ల వరకు నష్టపరిహారం పంపిణీ చేయాల్సి ఉంది. పశు నష్టపరిహారానికి సంబంధించి ఈనెలాఖరు వరకు ఆడిట్‌ జరుగుతుంది. ఆ తర్వాత డిసెంబరులో బాధిత రైతులకు పరిహారం అందనుంది.

* కర్నూలు జిల్లాలో 2.35 లక్షల తెల్ల పశువులు ఉన్నాయి. ముద్ద చర్మ వ్యాధి నివారణకు సంబంధించి ఇప్పటివరకు 2.0 లక్షల డోసుల వ్యాక్సిన్లు రాగా 1.40 లక్షల వ్యాక్సిన్లు వేయించాం. మరో 60 వేల పశువులకు ఈనెలలోపు టీకాలు వేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఇప్పటివరకు 23 పశువులు చనిపోయాయి. పాలిచ్చే వాటికి పరిహారం వస్తుంది.

* ప్రతి పథకానికి సంబంధించిన రాయితీ గురించి పాడి రైతులకు వివరిస్తున్నాం. రాష్ట్రీయ కిసాన్‌ వికాస్‌ యోజనలో భాగంగా 2022-23 ఏడాదికి గడ్డి కోసే (కత్తిరించే) యంత్రాలు రాయితీపై అందిస్తున్నాం. జిల్లాకు 40 యూనిట్లు మంజూరయ్యాయి. ఈ యంత్రం 2 హెచ్‌పీ, 3 బ్లేడ్‌ మోడల్‌తో  రూ.33,970 అవుతుంది. 40 శాతం రాయితీ లభిస్తుంది. రైతులు రూ.20,380 చెల్లిస్తే ఛాప్‌ కట్టర్స్‌ (గడ్డి కత్తిరించే) యంత్రాలు అందజేస్తాం.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని