logo

ఈ.. వైద్యమేంటో

అనంతపురం ప్రాంతానికి చెందిన లీలమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ కర్నూలు సర్వజన వైద్యశాలకు ఉదయం 9 గంటలకు వచ్చారు.

Published : 29 Nov 2022 02:29 IST

ఓపీ కోసం గంటల తరబడి నిరీక్షణ
సొమ్మసిల్లి పడిపోయిన రోగులు
కానరాని ముందస్తు చర్యలు
న్యూస్‌టుడే-కర్నూలు వైద్యాలయం

ఓపీ కేంద్రం వద్ద బారులు తీరిన రోగులు వారి కుటుంబసభ్యులు

అనంతపురం ప్రాంతానికి చెందిన లీలమ్మ తీవ్ర జ్వరంతో బాధపడుతూ కర్నూలు సర్వజన వైద్యశాలకు ఉదయం 9 గంటలకు వచ్చారు. ఓపీ కోసం క్యూలో నిల్చోలేక కుమారుడిని నిలబెట్టారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఓపీ చీటీ అందలేదు. చివరికి ఆమె సొమ్మసిల్లిపోయారు. ఓపీ తీసుకొని ఎప్పుడు వైద్యుడి వద్ద చూపించుకోవాలో తెలియని పరిస్థితి.

వెల్దుర్తికి చెందిన గర్భిణి స్నేహ ఉదయం 9 గంటలకు గైనిక్‌ ఓపీకి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా ఓపీ అందలేదు. క్యూలో నిల్చోలేక.. అల్లాడిపోయారు. నానా కష్టాలు పడి వైద్యుడి వద్దకు వెళ్లేలోగా మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. అక్కడ సీబీపీ పరీక్షలు చేయించుకురావాలంటూ రాసిచ్చారు.  ఉదయం నుంచి తిండి లేకపోవడతో కళ్లు తిరిగి పడిపోయారు.

ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ పేరుతో ఈ-ఆసుపత్రి పథకం కర్నూలు సర్వజన వైద్యశాలలో శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం ఓపీకి భారీగా రోగులు తరలిరావడం.. ఓపీ చీటీ కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి రావడంతో చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ నేపథ్యంలో మూడు కౌంటర్ల నుంచి ఏడుకు పెంచారు. అయినా ఇవి ఏమాత్రం సరిపోలేదు. చాలామంది మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి చూసినా ఓపీ చీటీ అందకపోవడం గమనార్హం.

వరుసలో నిల్చొన్న గర్భిణులు

గర్భిణులు.. చిన్న పిల్లలు

పీడియాట్రిక్‌, గైనిక్‌ విభాగాల్లో ఓపీ చీటీలు ఇచ్చే సిబ్బంది ఒక్కొక్కరే ఉన్నారు. ఇక్కడా అదే పరిస్థితి. సోమవారం ఎక్కువమంది రోగులు రావడంతో ఓపీ తీసుకొనేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలామంది గంటల తరబడి క్యూలో నిల్చోలేకపోయారు. గైనిక్‌, పీడియాట్రిక్‌, జనరల్‌ మెడిసిన్‌, ఈఎన్‌టీ, ఆర్థోపెడిక్‌ వంటి విభాగాలకు వచ్చినవారు పరీక్షలు చేయించుకుని వార్డులకు వెళ్లేలోగా మధ్యాహ్నం 2.30 దాటింది. అప్పటికే వైద్యులు వెళ్లిపోయారు.

సొమ్మసిల్లి పడిపోయిన చిన్నారులు

వెనక్కి వెళ్లిన రోగులు

ఓపీలో వైద్యులు రోగులను పరీక్షించి వివిధ పరీక్షలు చేయించుకు రావాలంటూ కొందరిని ల్యాబ్‌లకు పంపారు. అష్టకష్టాలు పడి వైద్య పరీక్షలు చేయించుకుని నివేదికలను తీసుకెళ్లేలోగా మధ్యాహ్నం దాటడం.. చాలామంది వైద్యులు వెళ్లిపోవడంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు. ఆస్పత్రిపై అవగాహన ఉన్న కొందరు మాత్రం అత్యవసర విభాగానికి వెళ్లి చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని