logo

జగనన్న.. ఇసుకలేదన్న

ఇసుక లేక జగనన్న కాలనీ లబ్ధిదారులకు నెల రోజులుగా ఇసుక అందడం లేదు. ఆయా మండలాల్లోని గ్రామాల పరిధిలో లబ్ధిదారులకు సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు కూపన్లు ఇస్తున్నారు.

Updated : 29 Nov 2022 06:22 IST

లబ్ధిదారులకు చుక్కలు
గుత్తేదారుకు కాసులు
కూపన్లు స్కానింగ్‌ కావడం లేదు

ఇసుక లేక జగనన్న కాలనీ లబ్ధిదారులకు నెల రోజులుగా ఇసుక అందడం లేదు. ఆయా మండలాల్లోని గ్రామాల పరిధిలో లబ్ధిదారులకు సచివాలయ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు కూపన్లు ఇస్తున్నారు. వీటిని తీసుకొని ఇసుక నిల్వ కేంద్రాల వద్దకు వెళ్తే చుక్కెదురవుతోంది. నెల రోజులుగా కూపన్లపై ఉండే లోగో నిల్వ కేంద్రం వద్ద స్కానింగ్‌ కావడం లేదు. దీంతో లబ్ధిదారులకు ఇసుక పంపిణీ

ఈనాడు - కర్నూలు, న్యూస్‌టుడే కర్నూలు సచివాలయం:  ఇసుక డిపోల్లో నిల్వలు నిండుకున్నాయి. జగనన్న కాలనీ లబ్ధిదారులు, వినియోగదారులకు అరకొర అందిస్తున్నారు. సింహభాగం గుత్తేదారు సరిహద్దులు దాటించి జేబులు నింపుకొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక రీచ్‌ల బాధ్యతలు ఉపగుత్తేదారుగా అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. పల్‌దొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె, కె.సింగవరం, కౌతాళం పరిధిలో నదిచాగి, గుడికంబాల పరిధిలో డ్రెడ్జింగ్‌ విధానంలో ఇసుక తీసి రీచ్‌ల వద్దకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి నిల్వ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో నిత్యం 3-4 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక అవసరం అవుతుందని అంచనా. డిపోల వద్ద జగనన్న కాలనీ లబ్ధిదారులతోపాటు ప్రభుత్వ పథకాలు, నాడు-నేడు పనులు, వినియోగదారులకు అందుబాటులో ఉంచాల్సి ఉంది.

బయటకే ఎక్కువ

ప్రభుత్వ పనులు, జగనన్న కాలనీల లబ్ధిదారులకు ఉచితంగా అందించాల్సి ఉంటుంది. ప్రతి నెలా గుత్తేదారు రూ.9 కోట్లు మేర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సదరు గుత్తేదారుడు ప్రభుత్వ పనులు, జగనన్న లబ్ధిదారులకు తక్కువగా ఇస్తూ, బయట మార్కెట్‌లో ఎక్కువగా అమ్మేస్తున్నారు.  కేంద్రాల వద్ద వేబ్రిడ్జి లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం.. సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో దందాకు మార్గం సుగమమం అవుతోంది. జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఐదు యూనిట్లు అందించాలి చాలా చోట్ల తక్కువ లోడింగ్‌ చేస్తున్నారు.


కొనాలంటే భయంగా ఉంది

-పెద్ద మునెయ్య, బనగానపల్లి

పేదలు ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక ధర చూసి భయపడాల్సి వస్తోంది. ఇటీవల ట్రాక్టర్‌ ఇసుక కొనుగోలు చేశా. రూ.7500 పడింది. పల్లెలకైతే రూ.8వేలు చెబుతున్నారు. నామమాత్రం ధరకు ఇస్తున్నామని ప్రభుత్వం చెపుతోంది. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.


స్థలం మార్చారు.. సమాచారం మరిచారు

గుత్తి పెట్రోలు బంకు వద్ద కార్బైడ్‌ కర్మాగారం సమీపంలో ఇసుక నిల్వ కేంద్రం

కర్నూలు జిల్లా కేంద్రంలో గుత్తి పెట్రోలు బంకు సమీపంలోని కార్బైడ్‌ కర్మాగారం ప్రాంతంలో నిల్వ కేంద్రం ఏర్పాటు చేశారు. పలుమార్లు స్థలం మార్చడంతో చాలా మందికి తెలియడం లేదు.  ఓర్వకల్లు, కర్నూలు, కల్లూరు, గూడూరు, కోడుమూరు మండలాలకు సరఫరా చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు.  సి.బెళగల్‌ మండలంలోని రీచ్‌ల నుంచి సరఫరా అవుతోంది. ఒక టన్ను (ఇసుక) ధర రూ.895గా ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. రీచ్‌ల వద్ద టన్ను ధర రూ.475. కర్నూలు నిల్వ కేంద్రానికి తీసుకొచ్చినందుకు రవాణా ఛార్జీలతో కలిపి ట్రాక్టర్‌ ఇసుక రూ.4,030కు విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి వినియోగదారులు తీసుకెళ్లాలంటే రవాణా భారం భరించాల్సిందే. కేంద్రం వద్ద అనధికారిక గుత్తేదారులు వాలిపోతున్నారు. ఒక ట్రాక్టర్‌ ఇసుకను కర్నూలు నగరంలోని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ట్రాక్టర్‌ అద్దె రూ.1,500 అదనం. అదే ఓర్వకల్లుకు అయితే రూ.7 వేలకు సరఫరా చేస్తున్నారు.  సీసీ కెమెరాలు  వేబ్రిడ్జి లేదు. ఒక పొక్లెయిన్‌ నింపుతోంది.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం


జోరుగా ప్రైవేటు వ్యాపారం

 

విక్రయానికి ఉంచిన ట్రాక్టర్లు

నందికొట్కూరు పట్టణంలోని డంపింగ్‌ యార్డులో ఇసుక నిల్వలు తగ్గిపోయాయి. ప్రస్తుతం 4 వేలకు టన్నులు మిగిలుంది. ప్రైవేటు వారికి ఆధార్‌ ఆధారంగా ఒక ట్రాక్టర్‌ ఇసుక ఇస్తున్నారు. వారంతా అధిక ధరకు ఇతరులకు విక్రయిస్తున్నారు. నిల్వ కేంద్రం వద్ద ఒక టన్ను రూ.1075కు ఇస్తున్నారు. ఈ లెక్కన ఒక ట్రాక్టర్‌ ఇసుకను రూ.4,840తో కొనుగోలు చేసి అవసరమైన వారికి రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు అమ్ముకుంటున్నారు.

న్యూస్‌టుడే, నందికొట్కూరు


130 టన్నుల నిల్వ

ఆత్మకూరు పట్టణం కరివేనలోని ఇసుక నిల్వ కేంద్రంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు ట్రాక్టర్లలో ఇసుక నింపే క్రమంలో తూకం వేయడం లేదు. ఓ అంచనా ప్రకారం జేసీబీతో ట్రాక్టర్లలో నింపి పంపిస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు అర టన్ను మేర తక్కువ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతం 130 టన్నుల మేర నిల్వలు ఉన్నాయి.

న్యూస్‌టుడే ఆత్మకూరు పట్టణం


తూకం తప్పుతోంది

డోన్‌ పట్టణంలోని కేంద్రంలో అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు

ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెళ్లలోని కేంద్రాల్లో వెయ్యి మెట్రిక్‌ టన్నుల చొప్పున నిల్వలు ఉన్నాయి. ప్రతి మంగళ, శుక్రవారాల్లో గృహ లబ్ధిదారులకు ఐదు టన్నుల చొప్పున అందిస్తున్నారు. తూకం వేయకుండానే ట్రాక్టర్లలో నింపుతున్నారు.

వారు వేసిందే ...

ఇసుక నిల్వ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, కాటాలు ఉండాలి. ఎక్కడా కనిపించడం లేదు. డోన్‌ పట్టణంలోని నిల్వకేంద్రంలో మూడు చోట్ల సీసీ కెమెరాలున్నాయి. ఏపీడీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అవి పనిచేయటం లేదు. కాటా లేకపోవటంతో వారి వేసిందే తూకం అన్నట్లు ఉంది.

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ


బాడుగ బాదేస్తున్నారు

డోన్‌లోని ఇసుక నిల్వ కేంద్రానికి వచ్చే వారికి బాడుగ భారంగా మారింది. టన్ను ధర రూ.850 చొప్పున విక్రయిస్తున్నారు. 4.5 టన్నులకు రూ.3825 అవుతోంది. ఇక్కడి నుంచి డోన్‌ పట్టణంతో పాటు దొరపల్లె గుట్ట వద్దకు వెళ్లాలంటే ట్రాక్టరు బాడుగ రూ.800 చొప్పున తీసుకుంటున్నారు. ఈ లెక్కన టన్ను ధర రూ.4625 చొప్పున పడుతోంది. ఉడుములపాడు, చిన్నమల్కాపురం, కొచ్చెర్వు తదితర ప్రాంతాలకు ట్రాక్టరు బాడుగలు రూ.1000 నుంచి రూ.1500 వరకు తీసుకుంటున్నారు. ఈ లెక్కన ట్రాక్టరు ఇసుకు రూ.5 వేలకు పైగానే పడుతోందని పేర్కొన్నారు.  

న్యూస్‌టుడే, డోన్‌


రూ.7 వేలు చెల్లిస్తే ట్రాక్టర్‌ ఇసుక

విక్రయానికి ఉన్న ఇసుక ట్రాక్టర్లు

బనగానపల్లిలో మార్కెట్‌ యార్డులోని ఇసుక నిల్వ కేంద్రాల్లో ప్రస్తుతం మూడు ట్రాక్టర్లకు మించి సరకు లేదు. ఉన్న కొంచెం కేవలం జగనన్న లబ్ధిదారులకు ఇస్తున్నారు. ‘‘ ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుంటే ఇంటికే ఇసుక వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.. కానీ ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు కావడం లేదు.. చేసేది లేక ప్రైవేటులో కొనుగోలు చేస్తున్నట్లు వినియోగదారులు వాపోతున్నారు. కేంద్రంలో నిల్వలు లేకపోవడంతో వ్యాపారులు జమ్మలమడుగు, తాడిపత్రి ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తున్నారు. ప్రభుత్వం టన్ను ఇసుకకు రూ.1050 ధర నిర్ణయించింది. ఇక్కడ రూ.7 వేలు చెల్లిస్తేగానీ ఒక ట్రాక్టర్‌ దొరకడం లేదు. బనగానపల్లి, కోవెలకుంట్ల, అవుకు ప్రాంతాల్లో నిత్యం 40 నుంచి 50 ట్రాక్టర్ల వరకు విక్రయిస్తున్నారు.

న్యూస్‌టుడే, బనగానపల్లి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని