logo

హక్కులు కాలరాసి.. కాసులు కాజేసి

‘‘ కౌలు రైతుల పేరుతో ప్రభుత్వ పథకాలు కొల్లగొడుతున్నారు. కౌలుదారులకు అందాల్సిన ప్రయోజనం అక్రమార్కులకు వరంగా మారుతోంది. అధికార పార్టీ నాయకుల అనుచరగణం, కొందరు సచివాలయ సిబ్బంది కుమ్మక్కై పావులు కదుపుతున్నారు.

Published : 02 Dec 2022 02:54 IST

యజమానికి తెలియకుండానే కౌలు పత్రాలు

చనిపోయిన వ్యక్తులపైనా పుట్టించారు

ఒక్కోదానికి రూ.5-10 వేలు వసూళ్లు

‘‘ కౌలు రైతుల పేరుతో ప్రభుత్వ పథకాలు కొల్లగొడుతున్నారు. కౌలుదారులకు అందాల్సిన ప్రయోజనం అక్రమార్కులకు వరంగా మారుతోంది. అధికార పార్టీ నాయకుల అనుచరగణం, కొందరు సచివాలయ సిబ్బంది కుమ్మక్కై పావులు కదుపుతున్నారు. చనిపోయిన వ్యక్తుల భూమి, బీడు భూములు కౌలుకు తీసుకున్నట్లు గుర్తింపు కార్డులు పొందుతున్నారు. సదరు భూ యజమాని (రైతు)కి తెలియకుండా కౌలుకు తీసుకున్నట్లు నమోదు చేయించుకుని రైతు భరోసా, పంట నష్టపరిహారాలు బొక్కేశారు. రెవెన్యూ, వ్యవసాయాధికారుల ఉదాసీనతతో ఉమ్మడి జిల్లాలో హక్కు పత్రాల మంజూరులో అక్రమాలు చోటు చేసుకున్నాయి.’’

ఈనాడు - కర్నూలు, పాణ్యం - న్యూస్‌టుడే

మౌఖిక ఆదేశాలు ఆసరా చేసుకుని

* ఉమ్మడి కర్నూలు జిల్లాలో 60-70 వేల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. ఈ ఏడాది కర్నూలు జిల్లాలో 7,709 కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ) ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా 6,500 మంజూరు చేశారు. నంద్యాలలో 13,061 కార్డులు మంజూరు చేశారు.

* భూమి యజమాని కౌలుకు ఇచ్చినట్లు ఒప్పంద పత్రం రాసివ్వాలి. గ్రామ రెవెన్యూ అధికారులు విచారణ చేసి పంట హక్కు పత్రం మంజూరు చేయాలి.

* చాలా మంది భూమి యజమానులు ఒప్పంద పత్రాలు రాసిచ్చేందుకు అంగీకరించడం లేదు. దీంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఒప్పందపత్రాలు లేకున్నా హక్కుపత్రాలు ఇవ్వాలని అధికారుల మౌఖిక ఆదేశాలందాయి. దీన్ని ఆసరా చేసుకొని గ్రామరెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు.

గడిగరేవుల పరిధిలోని 574 సర్వే నంబరులో పెద్దిశెట్టి వెంకటరమణ, పెద్దిశెట్టి స్వామయ్యలకు భూమి ఉంది. వీరు గ్రామం విడిచి దుర్వేశిలో ఉంటున్నారు. అయితే ఈ పొలాన్ని కుమ్మరి లక్ష్మీపార్వతి, కుమ్మరి చిన్నమ్మలకు కౌలుకు ఇచ్చినట్లు హక్కు పత్రాలు మంజూరు అయ్యాయి. పైభోగుల గ్రామానికే చెందిన పెద్దిశెట్టి శ్రీలత పంటను సాగు చేస్తుండగా కుమ్మరి నాగేశ్‌కు పంటసాగు హక్కుపత్రం మంజూరు చేయడం గమనార్హం.

కరిమద్దెలలో ఏం జరిగింది

* ఐదో చిన్నడాలయ్య చనిపోయి పదేళ్లు అవుతోంది. ఆ భూమి కుమారులకు బదిలీ అయ్యింది. కానీ ఐదో చిన్నడాలయ్య తన పొలాన్ని చాకలి పుల్లయ్యకు కౌలుకు ఇచ్చినట్లు హక్కుపత్రం మంజూరు చేశారు.

* కరిమద్దెలకు చెందిన కళావతమ్మ, నాగనరేంద్రరెడ్డిలు తన పొలాన్ని దూదేకుల పెద్దమద్దిలేటి, మూడో మద్దిలేటికి కౌలుకు ఇచ్చారు. అసలు భూమే లేని మిట్టమీది డాలయ్య నుంచి కౌలుకు తీసుకున్నట్లు చాకలి లక్ష్మీదేవికి కౌలు పత్రం ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన గుజారి కొండయ్య తన పొలాన్ని తానే సాగు చేస్తున్నారు. చాకలి నడిపి లింగమయ్యకు కౌలుకు ఇచ్చినట్లు హక్కు పత్రం జారీ అయ్యింది.

 

* ఉదయగిరి విశ్వనాథశెట్టి తన భూమిని పిక్కిలి వెంకటాచలంకు కౌలుకు ఇచ్చినట్లు హక్కుపత్రం ఇచ్చారు. కౌలుదారుడు గ్రామంలోనే లేరు.. ఆరా తీస్తే తనది తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌ అని చెబుతున్నారు. గుండెపోగు సుంకన్న సాగులో ఉంటే సున్నం శ్రీనివాసులకు హక్కు పత్రం ఇచ్చారు. ఏరాసు రామకృష్ణారెడ్డి పొలాన్ని బెల్లం రమేశ్‌కు హక్కుపత్రం ఇచ్చారు.

వాలంటీర్లే ముందుండి నడిపించారు

* సాగులో లేకున్నా కొందరికి హక్కు పత్రాలు మంజూరు చేశారు. వారికి రైతు భరోసా నిధులతో పాటు పంటల బీమా కింద పరిహారం మంజూరవుతోంది.

* భూమి యజమానులు సాగులో ఉన్నా ఇతరులకు హక్కు పత్రాలు మంజూరు చేశారు. గ్రామాల్లో లేని వారికి, బీడు భూములకు కౌలు పత్రాలిచ్చారు. ఇందుకు రూ.5-10 వేల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇందులో గ్రామ వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు.

* హక్కు పత్రాలు మంజూరైన రైతులు సాగులో ఉన్నారో లేదో పరిశీలించి పంట నమోదు చేయాల్సిన బాధ్యత వ్యవసాయ సహాయకులు చేపట్టాలి. వారు అక్రమార్కులకు సహకారం అందించడంతో సులువుగా అడుగులు పడినట్లు తెలుస్తోంది. ఇలా ఒక్క గడివేముల మండలంలో సుమారు 2429 పంట సాగుహక్కు పత్రాలు మంజూరు చేశారు.

‘‘సర్వే నంబరు 148/2లోని 2.22 ఎకరాలు కౌలుకు తీసుకున్నట్లు చాబోలుకు చెందిన వాలంటీరు హరిప్రసాద్‌ హక్కు పత్రం పొందారని గ్రామానికి చెందిన బి.నారాయణరెడ్డి ఈ ఏడాది అక్టోబరు 20న నంద్యాల గ్రామీణ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్బీకేలో పేరు నమోదు చేయించుకుని 2020-21, 21-22 సంవత్సరాలకు రైతు భరోసా సొమ్ము రూ.27 వేలు కాజేశారు.. 2021-22 ఏడాదిలో అధిక వర్షాలకు మంజూరైన రూ.6,150 పంట నష్ట పరిహారం సొమ్మును తీసుకున్నట్లు  ఫిర్యాదులో పేర్కొన్నారు.’’

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు