logo

కరవు కాటేసింది

బుద్ధిగా ఉంటే చెవి దుద్దులు తెస్తానంటూ ఆనందంగా వెళ్లిన అమ్మకు.. విషాదమే మిగిలింది. చెప్పిన మాట వింటే గుప్పెడు చాక్లెట్లు ఇస్తానన్న నాన్నకు చేదు మాట చెవికి చేరింది.

Published : 02 Dec 2022 02:54 IST

సౌజన్య

బుద్ధిగా ఉంటే చెవి దుద్దులు తెస్తానంటూ ఆనందంగా వెళ్లిన అమ్మకు.. విషాదమే మిగిలింది. చెప్పిన మాట వింటే గుప్పెడు చాక్లెట్లు ఇస్తానన్న నాన్నకు చేదు మాట చెవికి చేరింది. పూట గడవక పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రానికి వలస వెళ్లిన వారికి కడుపు కోతే మిగిలింది. కరవు మాటేసి వారిని ఊరు నుంచి తరిమేసింది..   విషపురుగు కాటేసి చిన్నారిని దూరం చేసింది. ఊరికి దూరంగా.. మనసు భారంగా.. ఉన్నవారు అష్టకష్టాలు పడుతూ స్వగ్రామం చేరుకున్నారు. పాముకాటుతో మృతి చెందిన చిన్నారిని హత్తుకుని గుండెలవిసేలా విలపించారు.

దేవనకొండ మండలం కరివేములకు చెందిన వీరేశ్‌, భారతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో కూలీ పనులకు వెళ్లి జీవించేవారు. పనులు లేకపోవడంతో ఉపాధి కోసం దంపతులు అక్టోబరులో తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లారు. వారి ఇద్దరు పిల్లలను ఇంటి వద్దే అవ్వాతాత, పిన్ని, బాబాయి వద్ద వదిలి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం చిన్నారి సౌజన్య (6) గుడిసెలో మంచంపై కూర్చొని చరవాణి చూస్తూ అన్నం తింటుండగా విషపురుగు కాటేసింది. చిన్నారి ఏదో ఎలుక కొరికిందని తాత, బాబాయికి చెప్పింది. కుటుంబ సభ్యులు చిన్నారి కాలుపై పాము కాట్లు గుర్తించడంతో వెంటనే కోడుమూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

-న్యూస్‌టుడే, దేవనకొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని