logo

కాలువ మట్టి ఖాళీ

హంద్రీ నీవా కాలువ తవ్విన సమయంలో ఇరువైపులా వేసిన మట్టి గుత్తేదారులు, నాయకులకు కాసులు కురిపిస్తోంది. కాలువ మల్యాల నుంచి మద్దికెర వరకు 160 కి.మీ మేర విస్తరించి ఉంది.

Published : 02 Dec 2022 02:54 IST

నాయకుల అండదండలతో దందా  
పట్టించుకోని హంద్రీనీవా అధికారులు

మద్దికెర మండల కేంద్రం సమీపంలో ..

 

పత్తికొండ, మద్దికెర, కృష్ణగిరి, చిప్పగిరి, న్యూస్‌టుడే: హంద్రీ నీవా కాలువ తవ్విన సమయంలో ఇరువైపులా వేసిన మట్టి గుత్తేదారులు, నాయకులకు కాసులు కురిపిస్తోంది. కాలువ మల్యాల నుంచి మద్దికెర వరకు 160 కి.మీ మేర విస్తరించి ఉంది. దాని పరిధిలోని ప్రతి గ్రామంలో స్థానిక నేతలు మట్టి దందా చేస్తున్నారు. ఎలాంటి రుసుము చెల్లించకుండానే గుత్తేదారులు తమ పనులకు వినియోగించి సొమ్ము చేసుకుంటున్నారు. రూ.కోట్ల విలువ చేసే మట్టిని కేవలం రవాణా ఖర్చుతో తరలించుకుపోతున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

రక్షణ తోడేస్తున్నారు

కాలువ తవ్విన సమయంలో వచ్చిన మట్టిని ఇరు వైపులా గోడగా ఏర్పాటు చేశారు. కాలువ లోతును బట్టి 30 మీటర్ల ఎత్తు వరకు అడ్డుకట్టగా వేశారు. ఇప్పటికే లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి ఖాళీ అయింది. మద్దికెర మండలంలోని బురుజులకు ప్రమాదం పొంచి ఉందనే ఉద్దేశంతో కాలువ నిర్మాణ సమయంలో అదనంగా మట్టి పోశారు. పత్తికొండ- బురుజుల గ్రామాల మధ్య జరిగిన రహదారి విస్తరణ పనులకు మట్టిని అక్రమంగా తరలించి గ్రామ రక్షణను విస్మరించారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మద్దికెర మండలం పెరవలి నుంచి మట్టిని తరలిస్తూ

సొమ్ము చేసుకుంటున్న గుత్తేదారులు

* హోసూరు నుంచి బురుజుల వరకు జరిగిన రహదారి విస్తరణ పనులకు వేలాది ట్రిప్పుల మట్టిని వినియోగించారు. ఇటీవలే హోసూరు- మొలగవల్లి రహదారి పనులకు అధికార పార్టీ వారి అండదండలతో వేలాది టిప్పర్ల ద్వారా తరలించి పనులు మమ అనిపించారు. కృష్ణగిరి మండలంలోని తొగర్చేడు, కంబాలపాడు, కృష్ణగిరి, చిట్యాల తదితర గ్రామాలతో పాటు, వెల్దుర్తి, డోన్‌ ప్రాంతంలో జరిగే పనులకు కాలువ మట్టితో పాటు, ఇందులో లభించే రాయిని కంకర తయారీ కోసం భారీగా తరలిస్తున్నారు.

* బురుజుల నుంచి పత్తికొండ వరకూ బీటీ రహదారి విస్తరణ పనులకు మొత్తం హంద్రీ నీవా కాలువ మట్టిని వినియోగించారు. ప్రస్తుతం జరుగుతున్న రైల్వే డబ్లింగ్‌ పనులకు పెరవలి, తుగ్గలి ప్రాంతాల వరకు పరిచారు. ఇటీవల పత్తికొండ మండలం హోసూరు- మొలగవల్లి గ్రామాల మధ్య బీటీ రహదారి నిర్మాణం కోసం వందల టిప్పర్లతో తరలించారు.

ఉచితానికి ధర కట్టి

మట్టి కొనాలంటే రైతుల నుంచి ఎకరానికి రూ.10 లక్షలకు పైగా చెల్లించాలి. దీంతో ఉచితంగా లభిస్తున్న కాలువ మట్టిని అక్రమంగా దోచేస్తున్నారు. వెల్దుర్తి, కృష్ణగిరి, పత్తికొండ, మద్దికెర, దేవనకొండ, చిప్పగిరి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో దందా ఎక్కువగా ఉంది. ఒక్కో ట్రాక్టరుకు దూరాన్ని బట్టి రవాణా ఖర్చు కింద రూ.1,000 నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. మట్టిని గుత్తేదారులు తరలించాలంటే స్థానిక నాయకులకు మామూళ్లు ఇవ్వాల్సిందే. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉచితంగా లభించే మట్టికి ధర నిర్ణయించి అక్రమార్కులు సొమ్ముచేసుకుంటున్నారు.

అడ్డుకుంటే మామూళ్లు

మద్దికెర ప్రాంతంలో ఇటీవల జరిగిన రహదారులు, రైల్వే స్టేషన్‌ భవనాలు, ఇతర అభివృద్ధి పనులకు కాలువ మట్టినే వినియోగించారు. ఓ గుత్తేదారు రైల్వే పనుల కోసం మట్టిని తరలిస్తుండగా స్థానిక నాయకులు అడ్డుకున్నారు. మట్టి తరలించాలంటే తాము అడిగినంత ముట్టజెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆ గుత్తేదారు వారికి మూముళ్లు సమర్పించుకున్న విషయం బహిరంగ రహస్యమే. ఆ గుత్తేదారు స్థానిక నాయకులు ఇంత మొత్తం చెల్లించామని ప్రచారం చేయడంతో స్థానిక నాయకులు కంగుతిన్నారు. రైల్వే డబ్లింగ్‌ పనులకూ ఇదే మట్టిని తరలించారు.

కేసులు నమోదు చేయిస్తాం
- సదాశివరెడ్డి, ఈఈ, హంద్రీ నీవా

హంద్రీ నీవా కాలువ మట్టిని ఎవరూ తరలించరాదు. అలా అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేయిస్తాం. మట్టి తరలింపు విషయం మా దృష్టికి వచ్చింది. మా సిబ్బందిని పురమాయించి కేసులు నమోదు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని