logo

పంట తడవాలంటే.. నీరు తోడాల్సిందే

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేస్తున్నారు.

Published : 02 Dec 2022 02:54 IST

గార్గేయపురం-నందికొట్కూరు రహదారిలో హంద్రీనీవా కాలువలో ట్రాక్టర్‌ ఇంజిన్ల

సాయంతో పంటలకు నీరు అందిస్తున్న రైతులు

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవాకు నీటిని విడుదల చేస్తున్నారు. కొన్ని రోజులుగా మాల్యాల నుంచి ఆరు పంపుల ద్వారా రోజుకు 1422 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సంగమేశ్వర శిఖరం బయటపడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. హంద్రీనీవా ద్వారా నీటి విడుదల ఆపేస్తారేమోనన్న సందేహంతో పంటలను రక్షించుకునేందుకు హంద్రీనీవా కాలువ గట్లపై వరసగా ట్రాక్టర్లతో నీటిని తోడుతున్నారు. ఇందుకోసం 40 నుంచి 50 లీటర్ల మేర డీజిల్‌ ఖర్చువుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్‌ ఇంజిన్‌తో అయితే ఎకరం కూడా తడవదని, ట్రాక్టర్‌ ఇంజిన్‌ అయితే దూరంగా ఉన్న పొలానికి సైతం నీటిని అందించవచ్చని అంటున్నారు. కిలోమీటర్ల పరిధిలో పైపులు వేసి పంటలకు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు మండలం దిగువపాడుకు చెందిన రైతు బలరామ్‌ హంద్రీ కాలువ పరిధిలో 12 ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంటకు రెండురోజుల నుంచి ట్రాక్టర్‌ ద్వారా నీటిని పంటలకు అందిస్తున్నట్లు తెలిపారు. రోజుకు డీజిల్‌ 30 నుంచి 40 లీటర్లు అవుతోందని, డీజిల్‌కే రూ.5 వేలు ఖర్చు అవుతోందని వివరించారు. దీనికి కూలీల ఖర్చు అదనంగా ఉంటుందని తెలిపారు. ఇంత ఖర్చుపెడుతున్నా పూర్తిస్థాయిలో పంటలకు నీరందించలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. రైతులు కాలువ గట్లపై కాపలా ఉండి మరీ పంటలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

- ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని