logo

అమ్మా.. అనలేడు నాన్నతో ఆడలేడు

అమ్మా! అని ఆనందంతో పరుగెత్తుకు రాలేడు. నాన్నతో గెంతులేస్తూ ఆడలేడు. ఆకలేసినా చెప్పలేడు.. కావాల్సింది అడగలేడు. ఆ తల్లిదండ్రుల వేదన అంతాఇంత కాదు. కుమారుడికి మానసిక వైకల్యం ఉందని తెలిసి కుంగిపోయారు.

Published : 02 Dec 2022 02:54 IST

పింఛను కోసం ఎదురు చూపులు

కుమారుడితో తల్లిదండ్రులు

ఆలూరు, న్యూస్‌టుడే: అమ్మా! అని ఆనందంతో పరుగెత్తుకు రాలేడు. నాన్నతో గెంతులేస్తూ ఆడలేడు. ఆకలేసినా చెప్పలేడు.. కావాల్సింది అడగలేడు. ఆ తల్లిదండ్రుల వేదన అంతాఇంత కాదు. కుమారుడికి మానసిక వైకల్యం ఉందని తెలిసి కుంగిపోయారు. ఎలాగైనా బాగుచేయించాలని చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదు. కుమారుడిని ఇంట్లోనే పెట్టుకుని సపర్యలు చేస్తూ రోజూ మనోవేదనకు గురవుతున్నారు. దివ్యాంగుడైన తమ కుమారుడికి పింఛను రాకపోవడంతో తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఆలూరు పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న గంగప్ప, మహాలక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమారుడు శివకు 15 సంవత్సరాలు. మానసిక వైకల్యంతో జన్మిచాడు. పుట్టినప్పటి నుంచే కాళ్లు చేతులు పనిచేయడం లేదు.

ఎదుగుతున్నా.. మాటలు కూడా రాని పరిస్థితి నెలకొంది. గంగప్ప గ్రామ పంచాయతీలో ఒప్పంద పద్ధతిన చెత్త తరలించే ట్రాక్టరు చోదకుడిగా పనిచేస్తున్నారు. వచ్చే కాస్త వేతనం కుటుంబ పోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక వైకల్యంతో ఉన్న కుమారుడిని చూసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. బయట అప్పు చేసి మొదట్లో కుమారుడికి పలు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో వైద్యం అందించారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో అప్పటి నుంచి ఇంట్లోనే సపర్యలు చేస్తూ.. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. తండ్రి గంగప్ప పని నిమిత్తం బయట వెళ్తే తల్లి మహాలక్ష్మి ఇంట్లోనే ఉంటూ కుమారునికి స్నానం చేయించడం, భోజనం తినిపించడం ఇలా అన్ని పనులు చేస్తున్నారు.

కార్యాలయాల చుట్టూ తిరిగినా..

తమ కుమారుడికి పింఛను ఇప్పించాలని గంగప్ప కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదట్లో సదరం ధ్రువీకరణ పత్రం లేదని అధికారులు పింఛను మంజూరు చేయలేకపోయారు. రెండేళ్ల కిందట సదరం ధ్రువీకరణ పత్రం పొందారు. అప్పటి నుంచి పింఛను కోసం దరఖాస్తు చేస్తున్నా మంజూరు కావడం లేదని గంగప్ప తెలిపారు. మానసిక వైకల్యంతో ఉన్న కుమారుడితో పాటు మిగితా ముగ్గురిని పోషించడం ఇబ్బందిగా మారిందని.. తమ పరిస్థితి అర్థం చేసుకుని కుమారుడికి పింఛను మంజూరయ్యేలా చూడాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని