logo

పశ్చిమాన.. గెలుపు కిరణాలు

‘‘మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. మ్యాచ్‌లు ఆడుతుంటే స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే క్రికెట్‌ ఆడుతామంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల్లో ఉమెన్‌ క్రికెటర్‌ ఉందని తెలుసు. నేనూ వెనుకబడిన పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయినే.

Updated : 04 Dec 2022 12:14 IST

బాల్య వివాహాలతో అమ్మాయిలను బందీ చేయొద్దు

ఈనాడు - కర్నూలు

‘‘మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. మ్యాచ్‌లు ఆడుతుంటే స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే క్రికెట్‌ ఆడుతామంటే తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల్లో ఉమెన్‌ క్రికెట్‌ర్‌ ఉందని తెలుసు. నేనూ వెనుకబడిన పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చిన అమ్మాయినే. ఎక్కడి నుంచి వచ్చామని కాదు.. కష్టపడితే ఫలితం ఉంటుందనే దానికి నేనే ఉదాహరణ.’ అంటున్నారు అంజలి శర్వాణి.

పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు పశ్చిమాన బాల్యానికి మూడు ముళ్ల బంధం వేస్తున్నారు. ఆచారాలు, మూఢ నమ్మకాల ముసుగులో అమ్మాయిల భవిష్యత్తును బందీ చేస్తున్నారు. ఆడ పిల్లలకు 13-15 ఏళ్లలోపే పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

* ప్రధానంగా కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాలతోపాటు కోడుమూరు, పత్తికొండ, ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఐసీడీఎస్‌ అధికారులు గత రెండేళ్లలో అడ్డుకున్న బాల్య వివాహాలు అక్షరాలా 80 ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో 52 వివాహాలు జరిగినట్లు అంచనా.

* కౌన్సిలింగ్‌ ఇస్తున్నా తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం నిరక్షరాస్యత. కోసిగిలో 33 శాతం అక్షరాస్యతతో రాష్ట్రంలోనే వెనుకంజలో ఉంది. చిన్న వయసులోనే వివాహాలు చేయడంతో రక్తహీనత బారిన పడుతూ ప్రమాద వలయంలో చిక్కుకుంటున్నారు.  

* స్వేచ్ఛనిచ్చి చదివించగా... ఒకడుగు ముందుకేసి ఆదర్శంగా రాణించొచ్చని నిరూపిస్తున్నారు పశ్చిమాన పుట్టి పెరిగిన కొందరు అమ్మాయిలు.వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సినవసరం ఉంది.


అంజలి.. ఆదర్శం

పశ్చిమ ప్రాంతం ఆదోనిలో పుట్టి పెరిగిన కేశవరాజు అంజలి శర్వాణి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండటంతో తల్లిదండ్రులు కేవీ రమణారావు, అనూరాధ ప్రోత్సహించారు. ఆడపిల్లకు ఆటలెందుకని అనుకోలేదు. అథ్లెటిక్స్‌లో రాణిస్తూ.. క్రికెట్‌ వైపు మళ్లిన ఆమె అనతి కాలంలోనే ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఆంధ్ర జట్టుకు సారథిగా వ్యవహరించారు. రైల్వే జట్టుకు ఎంపిక కొలువుతోపాటు ఆ జట్టు తరఫున రాణించారు. ఎడమ చేతి వాటం మీడియం ఫేసర్‌గా రెండు నెలల వ్యవధిలో 20 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు తీసుకుని ఆలిండియా స్థాయిలో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా నిలిచారు. నిలకడగా రాణిస్తున్న అంజలికి తాజాగా భారతదేశంలో పర్యటించనున్న ఆస్ట్రేలియా జట్టుతో టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు సీనియర్‌ ఉమెన్‌ ఇండియా జట్టులో స్థానం దక్కింది.


శరణ్య సాధించింది

ముగ్గురు ఆడపిల్లలున్నారు. అమ్మాయిలకు క్రికెట్‌ అవసరమా? చదివించే స్థోమత లేకపోతే పెళ్లిళ్లు చెయ్‌’ అంటూ బంధువులు, స్నేహితులు ఇచ్చిన సలహాలను ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు. బయట ఎవరేమనుకున్నా ఫర్వాలేదు. మీరు ఆడండి అంటూ.. ఇచ్చిన భరోసా నేడు ఇద్దరి కుమార్తెల భవిష్యత్తుకు బాటలైంది. కోడుమూరుకు చెందిన కృష్ణ, మనోహరమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురు కుమార్తెలకు క్రికెట్‌ శిక్షణ ఇప్పించారు. మొదటి అమ్మాయి క్రికెట్‌పై ఆసక్తి లేక ఆగిపోగా, చంద్రలేఖ, శరణ్య గద్వాల్‌ ఆటను కొనసాగించారు. చంద్రలేఖ క్రీడా కోటాలో కొలువు సాధించి ముంబయిలో స్థిరపడగా, శరణ్య యువ లెగ్‌ స్పిన్నర్‌గా రాణిస్తున్నారు. ఛాలెంజర్స్‌ ట్రోఫీలో ఝార్ఖండ్‌పై  76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అండర్‌-19 ఆంధ్ర జట్టుకు సారథిగా వ్యవహరించారు. తాజాగా ఇండియా-సి జట్టులో ఈ ఏడాది నవంబరు 20న రాయ్‌పూర్‌లో జరిగిన మహిళల టీ20 ఛాలెంజర్‌ ట్రోఫీలో పాల్గొని మెరుగైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. సీనియర్‌ ఇండియా మహిళా జట్టులో స్థానానికి ప్రయత్నిస్తున్నారు.


సాగు బాటలో శ్రీదేవి విజయ బావుటా

పెళ్లి చేశారు.. ఇద్దరు పిల్లలు పుట్టారు. నేనెందుకు ఖాళీగా ఉండాలి? ఏదైనా లక్ష్యం పెట్టుకుని సాధించాలి? ఇవీ.. ఆమె మదిలో మెదిలిన ఆలోచనలు. వెంటనే తనకిష్టమైన వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తన ఆలోచనకు భర్త, తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించారు. ఆరోగ్య విజయంలో కీలకమైన సిరిధాన్యాలు, రాగులు పండిస్తున్నారు. అలాగే వాటితో వివిధ వంట ఉత్పత్తులు తయారు చేసి ‘సిరి ధాన్య ఫుడ్స్‌’ పేరుతో మార్కెటింగ్‌ చేస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన జి.శ్రీదేవి.

బత్తాయి తోటల మధ్య అంతర పంటగా కొర్రలు, జొన్నలు, రాగులు, అండుకొర్రలు, సజ్జలు వంటివి సాగు చేసి దిగుబడులు సాధిస్తున్నారు. పంట ఉత్పత్తులతో ఆదాయం పొందుతూనే, అవే ధాన్యాలతో వంటకాలు చేయడానికి ప్రణాళిక చేశారు. 2019లో ‘సిరి ధాన్య ఫుడ్స్‌’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. బిస్కెట్లు, మిల్లెట్స్‌ కేక్స్‌, పిజ్జాలు, రాగి.. కొర్ర... జొన్న..సజ్జలతో చేసిన లడ్డూలు, అండుకొర్రలతో గవ్వలు, అవిసగింజలు, వెర్రినువ్వులు, అరికలు, సామలు, కరివేపాకు, మునగాకులతో పొడులు తయారు చేసి అమ్ముతున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. అమెరికా, నెదర్లాండ్‌కు ఎగుమతి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


ఆటలో అనూష ప్రత్యేక ముద్ర

వెంకటేశ్‌ కోడుమూరులో ఓ టీ స్టాల్‌ నిర్వహిస్తూ ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని చదివించారు. తనకిష్టమైన క్రికెట్‌లో తన ఇద్దరి కూతుళ్లలో ఎవరిని పంపాలా? అనుకున్నప్పుడు ముందుకొచ్చారు అనూష. చిన్ననాటి నుంచి ఆటలంటే ఇష్టమైన ఆమె, తన తండ్రి క్రికెట్‌ కలను నెరవేర్చాలని అడుగులు వేశారు. సున్నితంగా ఉండే ఆడపిల్లలు క్రికెట్‌ అసలే ఆడలేరన్నారు అంతా. అయినా పట్టుదలతో క్రికెట్‌ ప్రారంభించారు. నిత్యం 5-6 గంటలు సాధన చేశారు. కిట్టు, షూ అన్నీ కోచ్‌ సమకూర్చగా మొదలైన అనూష క్రీడా పయనం 2009లో రాష్ట్ర స్థాయి జట్టుకు చేరింది. అక్కడి నుంచి కష్టాలను అధిగమించి ఒక్కో మెట్టు విజయాన్ని అందుకుంటూ ఇండియా రెడ్‌, గ్రీన్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించి రాణిస్తున్నారు. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌గా మహిళా జట్టుకు మంచి స్కోర్‌ అందిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు అనూష.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని