logo

మోగిన పెళ్లి బాజా

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం నుంచి మంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. కల్యాణ మండపాలన్నీ కళకళలాడుతున్నాయి.

Published : 04 Dec 2022 01:13 IST

మహానంది, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం నుంచి మంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. కల్యాణ మండపాలన్నీ కళకళలాడుతున్నాయి. ఊరూరా బాజాభజంత్రీలు మోగుతున్నాయి. ఈనెలలో ఉమ్మడి జిల్లాలో వేల జంటలు ఒక్కటి కాబోతున్నాయి.సాధారణంగా కార్తిక మాసంలో వివాహాలు ఎక్కువ జరుగుతాయి. ఈసారి మూఢాలు (మౌఢ్యమి) రావడంతో నిలిచిపోయాయి. డిసెంబరులో మార్గశిర మాసం ప్రారంభం కావడంతో కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వివాహాలు జోరందుకున్నాయి. డిసెంబరు 2, 3, 4, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18వ తేదీలు కల్యాణాలకు మంచి ముహూర్తాలని పండితులు చెబుతున్నారు. వీటిలో 4, 8, 14, 17, 18వ తేదీల్లో దివ్యమైన లగ్గాలు ఉన్నట్లు వివరిస్తున్నారు.

జోరందుకున్న వ్యాపారాలు

* శ్రావణ మాసంలో వివాహాలు జరిగాయి. భాద్రపద, ఆశ్వీయుజ, కార్తిక మాసాల్లో మూఢాలు రావడంతో ముహూర్తాలు లేవు. తిరిగి మార్గశిర మాసంలో పెళ్లిళ్లకు అనుకూలమైన ఘడియలు వచ్చాయి. పెళ్లి సందడి మొదలవడంతో వివిధ వ్యాపారాలు జోరందుకున్నాయి.

* వస్త్ర, బంగారు వ్యాపారాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. కల్యాణ మండపాలు మూడు నెలల ముందుగానే బుక్‌ అయ్యాయి. ఒక్కో మందిరంలో రోజుకు రెండు నుంచి మూడు పెళ్లిళ్లు జరుగనున్నాయి.

* ఈనెల 18న దివ్యమైన ముహూర్తం ఉండటంతో ఆ ఒక్కరోజే వేలాది పెళ్లిళ్లు జరుగనున్నాయి. దీంతో కల్యాణ మండపాలు లభించక చాలామంది ఆలయాల్లో వేడుకలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

* అలంకరణ నిపుణులు, ట్రావెల్స్‌, బాజాభజంత్రీలు, వంట వారు, ఆర్కెస్ట్రా, శుభలేఖల ముద్రణ సంస్థలు, పూల వ్యాపారులు, పాన్‌ దుకాణదారులు, సప్లయర్స్‌, టెంట్‌హౌస్‌లు, క్యాటరింగ్‌, ఫొటో, వీడియోగ్రాఫర్లకు గిరాకీ పెరిగింది.


చేతినిండా పని: లక్ష్మణ్‌, మహానంది

నేను సప్లయర్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాను. రెండేళ్లుగా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. ఆర్థికంగా నష్టపోయాం. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. వివాహ ముహూర్తాలు అధికంగా ఉండటంతో ఆర్డర్లు ఎక్కువగానే వచ్చాయి. చేతినిండా పని దొరికింది. ఒక్కోరోజు రెండుమూడు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి సామగ్రిని తీసుకొస్తున్నాం.


మార్చి 19 వరకు
- రవిశంకర అవధాని, వేదపండితుడు, మహానంది

ఈనెల 2 నుంచి 18వ తేదీ వరకు, 2023 జనవరి 25 నుంచి మార్చి 19 వరకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి. మూడు నెలల అనంతరం మంచి ముహూర్తాలు రావడంతో వేల సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. వివాహాలతో పాటు నిశ్ఛయ తాంబూలాలు, గృహ ప్రవేశాలు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని