logo

బడి బంద్‌.. పరీక్ష రద్దు

పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఒత్తిడి చేశారు. బడి బస్సులను అధీనంలోకి తీసుకున్నారు. పరీక్షలు వాయిదా వేయించారు. ఉదయం 6 నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలంటూ పోలీసులు ప్రకటించారు.

Updated : 05 Dec 2022 04:57 IST

నేడు సీమ గర్జన
నగరంలో ఆంక్షలు

కళాశాలలో కొనసాగుతున్న ఏర్పాట్లుఈనాడు - కర్నూలు

న్యూస్‌టుడే కర్నూలు నగరం, బి.క్యాంప్‌ : పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఒత్తిడి చేశారు. బడి బస్సులను అధీనంలోకి తీసుకున్నారు. పరీక్షలు వాయిదా వేయించారు. ఉదయం 6 నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలంటూ పోలీసులు ప్రకటించారు. దుకాణాలు మూసి వేసి సభకు రావాలని వ్యాపారులకు సూచించారు. సోమవారం జరిగే స్పందన రద్దు అంటూ అధికారులు ప్రకటించారు. ప్రతి సంఘానికి ఇద్దరు చొప్పున సభకు రావాలని డ్వాక్రా సంఘాల లీడర్లకు ఆదేశాలు. నగరంలో ఎస్టీబీసీ మైదానంలో సోమవారం నిర్వహించే సీమ గర్జన నేపథ్యంలో ‘అధికార’ ఒత్తిళ్లు జనాలను అవస్థల పాలు చేసేలా ఉన్నాయి.

విద్యార్థులు.. మహిళా సంఘాలు

* కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో సోమవారం జరిగే సీమ గర్జనకు వైకాపా నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. 50 ప్రజా రవాణా(ఆర్టీసీ) బస్సులు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నుంచి 770 పాఠశాలల బస్సులను రవాణా శాఖ అధీనంలోకి తీసుకుంది. విద్యార్థులు, మహిళా సంఘాలను తరలించాలని చూస్తున్నారు.  విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 

ఉదయం ఆరు గంటల నుంచే

* సీమ గర్జన నేపథ్యంలో నగరంలో వాహనాల దారి మళ్లిస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థకౌశల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పలు మార్గాల్లో రాకపోకలకు నిషేధం విధించామన్నారు. ఐదు రోడ్ల కూడలి నుంచి శ్రీరామ్‌ థియేటర్‌, మౌర్యాఇన్‌ సర్కిల్‌, జడ్పీ కార్యాలయం, రైల్వేస్టేషన్‌ వైపు మార్గాలతోపాటు కోట్ల సర్కిల్‌-ఎస్‌బీఐ సర్కిల్‌- ఐదు రోడ్ల కూడలి మార్గంలో నిషేధం ఉంటుందన్నారు.
* ఆనంద్‌ థియేటర్‌ ఎదురుగా ఉండే హంద్రీ వంతెనపై అసుపత్రికి వెళ్లే అత్యవసర వాహనాలు, ఆంబులెన్స్‌లకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.


ఏర్పాట్ల పరిశీలన

మెప్మా సిబ్బందికి అందిన సమాచారం

* సీమ గర్జన సభ ఏర్పాట్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య పరిశీలించారు. వీరి వెంట ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్‌, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, సమన్వయకర్త అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ ఉన్నారు. సభలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ, అంజాద్‌బాషా, ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడే అవకాశం ఉంది.


నేటి స్పందన రద్దు

కర్నూలు సచివాలయం: జిల్లాలో సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ పి. కోటేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

కర్నూలు నేరవిభాగం: నగరంలో సీమ గర్జన నేపథ్యంలో పోలీసు స్పందనను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ    సిద్దార్థకౌశల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని