logo

ప్రజా సమస్యలపై గళం విప్పుతారా

జిల్లా పరిషత్‌ పాలకవర్గం కొలువుదీరిన తర్వాత నాలుగో సర్వసభ్య సమావేశం మంగళవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు జడ్పీ సమావేశం మందిరంలో ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ఆర్థిక, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు, సీఈవోతోపాటు శాఖల అధికారులు, సభ్యులు హాజరుకానున్నారు.

Updated : 06 Dec 2022 04:26 IST

నేడు జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం

కర్నూలు నగరం , న్యూస్‌టుడే: జిల్లా పరిషత్‌ పాలకవర్గం కొలువుదీరిన తర్వాత నాలుగో సర్వసభ్య సమావేశం మంగళవారం జరగనుంది. ఉదయం 11 గంటలకు జడ్పీ సమావేశం మందిరంలో ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి ఆర్థిక, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, రెండు జిల్లాల కలెక్టర్లు, సీఈవోతోపాటు శాఖల అధికారులు, సభ్యులు హాజరుకానున్నారు. గ్రామీణాభివృద్ధి(డీఆర్‌డీఏ), మహిళా శిశుసంక్షేమం, పౌరసరఫరాలు, శాఖలను అజెండాలో చేర్చారు. 2022-23 సవరణ బడ్జెట్‌, 2023-24 అంచనా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశం ఉంది.

నిధులతో సంబంధం లేని శాఖలపై చర్చ

నిధులతో సంబంధం లేని, ఆర్థిక అవసరాలు లేని శాఖలను చర్చించేందుకు మూడు శాఖలను అజెండాలో చేర్చారు. మూడు నెలలకోసారి జరిగే జడ్పీ సమావేశంలో జిల్లా అభివృద్ధి, పేదల ఆకలి తీర్చడం, తాగు, సాగునీటి సమస్య పరిష్కారం, కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు సమగ్రంగా చర్చించి, ప్రభుత్వానికి నివేదికలు పంపుతారని జిల్లా ప్రజలు ఏడాదికాలంగా ఆశిస్తున్నారు. వారి ఆశ నిరాశే అవుతోంది. పాలకవర్గంలో సభ్యులు, ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీకి చెందినవారు కావడంతో సభలో ఏమీ అడగకలేక, నిధుల సమస్య గట్టిగా చెప్పుకోలేక సభ్యులు లోలోన మధనపడుతున్నారు. రెండు జిల్లాల్లో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇరువురు ఎమ్మెల్సీలున్నారు. వీరిలో అధికశాతం సమావేశాలకు హాజరు కావడం లేదు. ఎంపీల జాడే లేదు.

ఆదాయ వనరుల పెంపు ఆలోచనేదీ

ఈ ఏడాది జనవరి 20, మే 6వ తేదీ, ఆగస్టు 16వ తేదీల్లో ఛైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జడ్పీ సమావేశాలు జరిగాయి. అవుకు, కొత్తపల్లి మండలాలను ‘కుడా’ పరిధిలోకి తీసుకురావాలని, జల్‌జీవన్‌ మిషన్‌ ప్రాజెక్టు పనుల పురోగతికి వ్యక్తిగతంగా పనులు కేటాయించాలని రెండు తీర్మానాలు చేశారు. జడ్పీ, మండల పరిషత్‌లకు ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు గత మూడు సమావేశాల్లో ఏనాడూ చర్చించలేదు. 15వ ఆర్థికసంఘం నుంచి నామమాత్రంగా వచ్చే రూ.26 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

పేరు గొప్ప..ఊరు దిబ్బగా గృహనిర్మాణం

ఉమ్మడి జిల్లాలో 600 జగనన్న కాలనీల్లో 98 వేల గృహాలు నిర్మించాలని రెండేళ్ల క్రితం లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఇంతవరకు అమలు కావడం లేదు. రెండు జిల్లాలో 16 వేల ఇళ్లు పూర్తికాని పరిస్థితి నెలకొంది. లబ్ధిదారులకు అనువుకాని ప్రదేశంలో స్థలాలు కేటాయించడం, వాగులు, వంకల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇతర జిల్లాలో సొమ్ము వెచ్చించి స్థలాలు కొనుగోలు చేస్తుండగా ఈ జిల్లాలో ఒక్క రూపాయి వెచ్చించి ఎక్కడా సెంటు స్థలం కొనుగోలు చేయలేదు. గతంలో జరిగిన జడ్పీ సమావేశంలో సభ్యులు, ఎమ్మెల్యేలు ఈ సమస్యను సభ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం చేకూరలేదు.

అన్నదాత గోడు పట్టించుకునేదెవరు

అన్నదాత అవస్థలు ఎవరికీ పట్టడం లేదు. సాగునీటిపై శ్రద్ధ వహించకుండా, నకిలీ పత్తివిత్తనాలతో రైతులు మోసపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద పంటలు సాగుచేసుకున్న రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. ఎల్లెల్సీ ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సిఉండగా 47 వేల ఎకరాలకు కుదించారు. గాజులదిన్నె ప్రాజెక్టు 3 టీఎంసీలు హంద్రీనీవా ప్రధాన కాల్వ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉండగా, కర్నూలు సర్కిల్‌ అధికారులు ఇంతవరకు ఇండెంట్‌ పంపించని పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని