logo

సీఎం ఇంటి ఎదుట గర్జన చేపట్టాలి

కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజక వర్గాల్లో చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారనే భయంతోనే కర్నూలులో రాయలసీమ గర్జన పెట్టారని కోడుమూరు తెదేపా బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు.

Published : 06 Dec 2022 02:26 IST

మాట్లాడుతున్న ఆకెపోగు ప్రభాకర్‌

గూడూరు, న్యూస్‌టుడే: కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజక వర్గాల్లో చంద్రబాబునాయుడుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారనే భయంతోనే కర్నూలులో రాయలసీమ గర్జన పెట్టారని కోడుమూరు తెదేపా బాధ్యుడు ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు. మూడు జిల్లాల నుంచి వైకాపా నాయకులు విద్యార్థులు, పొదుపు మహిళలను తరలించారన్నారు. సమావేశానికి హాజరు కాకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని, మహిళలకు రుణాలు, విద్యార్థులకు అమ్మ ఒడి ఆపుతామని బెదిరించారన్నారు. ఆర్టీఏ అధికారులతో తనిఖీలు జరిపించి మరీ పాఠశాల బస్సులను పార్టీ కార్యక్రమాలకు వినియోగించారన్నారు. రాయలసీమకు ద్రోహం చేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి ఎదుట గర్జన చేయాలన్నారు.

ఆత్మవంచన  సభ

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాయలసీమ మేధావుల ముసుగులో వైకాపా నిర్వహించిన రాయలసీమ గర్జన సభ వైకాపా ఆత్మవంచన సభ అని తెదేపా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆత్మస్తుతి, పరనిందగా ఆ సభ ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ రాయలసీమకు న్యాయం చేయలేదని ప్రసంగించిన వక్తలు, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా సమీకు ద్రోహం చేశాడని ఒప్పుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ ముందు శభాష్‌ అనిపించుకోవడానికి రాజశేఖరరెడ్డిని కూడా అసమర్థుని కింద జమ చేశారంటే, వారి తెంపరితనానికి ప్రజలు నోరెళ్లబెడుతున్నారని భూమిరెడ్డి పేర్కొన్నారు.

ప్రాంతాల మధ్య చిచ్చు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: రాయలసీమ గర్జన పేరుతో వైకాపా మరోసారి మోసానికి తెగబడుతుందని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి డా.పార్థసారథి వాల్మీకి అన్నారు. రాయలసీమను అభివృద్ధి చేయలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కొత్త నాటకానికి తెరలేపిందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మొదట మద్దతు తెలిపినింది భాజపా అని అన్నారు. వైకాపాకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే సీమలోని పెండింగ్‌ ప్రాజెక్ట్‌లు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

బీసీలకు అన్యాయం  

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని తెదేపా బీసీ నేతలు తెలిపారు. సోమవారం కల్లూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట బీసీ నేతల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. వైకాపా ప్రభుత్వంలో బీసీలు ఆర్థిక, రాజకీయంగా వెనుకబడ్డారని తెలిపారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కార్పొరేషన్‌, సబ్‌ప్లాన్‌ నిధులను మళ్లించి బీసీలకు అన్యాయం చేశారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని