logo

బంకుల్లో ప్రీమియం దందా

అసలే పెట్రోలు ధరలు మండుతున్నాయి. పక్క రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో లీటర్‌పై రూ.10 అదనపు భారం వాహనదారులపై పడుతోంది.

Published : 07 Dec 2022 03:26 IST

లీటర్‌ పవర్‌ పెట్రోలు ధర రూ.118

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: అసలే పెట్రోలు ధరలు మండుతున్నాయి. పక్క రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో లీటర్‌పై రూ.10 అదనపు భారం వాహనదారులపై పడుతోంది. ఇది చాలదన్నట్లు ఉమ్మడి జిల్లాలో పలు బంకుల్లో ప్రీమియం, పవర్‌ పెట్రోలు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణమైనది అందుబాటులో ఉంచుకుండా ‘ప్రీమియం’ పోస్తూ లీటర్‌కు రూ.5 నుంచి రూ.8 వరకు బాదేస్తున్నారు. ప్రీమియం పెట్రోలు పేరిట దందా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఏమిటీ కొత్త రకం

పెట్రోలు నాణ్యతను అందులోని ఆక్టేన్‌ విలువను బట్టి లెక్కిస్తారు. రెగ్యులర్‌ పెట్రోలులో ఆక్టేన్‌ రేటింగ్‌ 87 ఉంటుంది. ప్రీమియం పెట్రోలులో ఆక్టేన్‌ రేటింగ్‌ 91 వరకు ఉంటుంది. ఆక్టేన్‌ ఎక్కువగా ఉన్న పెట్రోలు.. ఇంజిన్‌పై అధిక భారం పడకుండా చేయడంతోపాటు ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాహనాలకు అధిక ఆక్టేన్‌ ఉన్న పెట్రోలు మంచిదే, అయితే ఐదేళ్లపైబడిన వాహనాలకు సాధారణ ఇంధనమే ఉత్తమమని మెకానిక్‌లు చెబుతున్నారు.

సామాన్యులకు చుక్కలు

చాలా చోట్ల ఖరీదైన పెట్రోలును మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఆళ్లగడ్డలోని ఓ చోట లీటర్‌ పవర్‌ పెట్రోలు రూ.118.53కు విక్రయిస్తున్నారు. సాధారణం కావాలని అడిగినా అందుబాటులో లేదని చెబుతున్నారు. ఆళ్లగడ్డలో ఓ బంకులో ప్రీమియం పెట్రోలు రూ.100 కొనుగోలు చేస్తే 0.84 లీటర్లు వచ్చింది. వేరే బంకులో సాధారణ (రెగ్యులర్‌) రకం అదే ధరకు కొనుగోలు చేస్తే 0.90 లీటర్లు వచ్చింది. ఈ రెండు రకాల పెట్రోలు ధరల మధ్య తేడా దాదాపు రూ.7 నుంచి రూ.8 వరకు ఉంది. ‘‘ తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని’’ ఆళ్లగడ్డ ఉప తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.


రద్దీ చూసి అంటగడుతున్నారు

లీటర్‌ సాధారణ పెట్రోలు ధర రూ.111

ఉమ్మడి జిల్లాలో 365 పెట్రోలు బంకులు ఉన్నాయి. నిత్యం 80 లక్షల లీటర్ల పెట్రోలు, 2 కోట్ల లీటర్ల  డీజిల్‌ వినియోగం అవుతోంది. పెట్రోలు రెండు రకాలుగా విక్రయిస్తుంటారు. ఒకటి రెగ్యులర్‌, రెండోది ప్రీమియం. జిల్లాలో సాధారణం (రెగ్యులర్‌) ధర రూ.111 కొద్దిగా అటూఇటూ ఉంటోంది. ప్రీమియం, పవర్‌ పెట్రోలు పేర్లతో లీటర్‌ రూ.118.50కుపైగా విక్రయిస్తున్నారు.

* ఉదయం, సాయంత్ర వేళ వాహనదారుల రద్దీ ఉంటుంది. దీన్ని వ్యాపారులు అవకాశంగా మల్చుకుంటున్నారు. రద్దీ సమయంలో రెగ్యులర్‌ రకం లేదు.. ప్రీమియమే ఉందంటూ చెప్పుకొస్తున్నారు. నిర్వాహణదారులంతా ఒక్కటై ఉదయం గంటసేపు, సాయంత్రం మరో గంట దోపిడీకి పాల్పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని