logo

ప్రశ్నలు సంధించిన అధికార పార్టీ సభ్యులు

 సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు ప్రశ్నలు సంధించారు.. వాటికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిఉండగా 11.45 గంటలకు ప్రారంభమైంది.

Published : 07 Dec 2022 03:26 IST

ప్రజా సమస్యలు ప్రస్తావించిన జడ్పీటీసీలు, ఎంపీపీలు

జడ్పీ బడ్జెట్‌పై సీఈవో నాసరరెడ్డితో చర్చిస్తున్న మంత్రి బుగ్గన...

న్యూస్‌టుడే, కర్నూలు జడ్పీ:  సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు ప్రశ్నలు సంధించారు.. వాటికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిఉండగా 11.45 గంటలకు ప్రారంభమైంది. మంత్రి బుగ్గన కోసం వేచిచూసి సభ ప్రారంభించారు. ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, ఆలూరు ఎంపీపీ సుభాషిణి మృతి పట్ల సభ రెండు నిమిషాలు మౌనం వహించి సంతాపం వ్యక్తం చేసింది.జడ్పీ, మండల పరిషత్‌ ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు సలహాలు ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి కోరారు. జడ్పీ ఆదాయం మరింత పెరగాల్సి ఉందని, ప్రభుత్వ నిధులతోపాటు సొంతంగా సమకూర్చుకోవాలన్నారు. మండల పరిషత్‌ పరిధిలోనూ దుకాణ సముదాయం, ఇతరత్రా చేసుకోవాలన్నారు.

భూముల్లేని రైతులకు రుణాలు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నాగంపల్లి సొసైటీలో భూముల్లేని రైతులకు రూ.9 కోట్లు రుణాలు ఇచ్చారు.. విచారణ చేయాలని గత సమావేశంలో కోరా.. ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు నివేదిక ఇచ్చారని జడ్పీటీసీ సభ్యుడు సుధాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని నంద్యాల కలెక్టర్‌ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

హాజరైన సభ్యులు


దారిలేని జగనన్న కాలనీ

జగనన్న కాలనీలకు కనీసం అప్రోచ్‌ రహదారులు వేయడం లేదు.. కాలనీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని వెల్దుర్తి జడ్పీటీసీ సభ్యుడు సుంకన్న వాపోయారు. మేజర్‌ పంచాయతీ వెల్దుర్తికి 3 కి.మీ దూరంలో కొండప్రాంతంలో 400 మందికి పట్టాలు ఇచ్చారు.. ఇప్పటి వరకు ఒక్కరూ ఇల్లు నిర్మించలేదన్నారు. కాలనీకి రహదారి వేసేందుకు వారంలోగా సిద్ధం చేస్తామని పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.


ఉల్చాలకు రోడ్డు ఎప్పుడు

కర్నూలు నుంచి ఉల్చాలకు రోడ్డు వేయాలని మూడు సమావేశాల్లో చెప్పినా ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని ఎంపీపీ వెంకటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు కనీసం ప్రతిపాదనలూ సిద్ధం చేయలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి జోక్యం చేసుకుని సభ్యులు అడిగిన ప్రశ్నలకు కనీసం నెలరోజుల్లోనైనా సమాధానం చెప్పకపోతే ఎలా అని ర.భ శాఖ అధికారులను మందలించారు.


ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలకు మంత్రి మందలింపు

ఉభయ జిల్లాలో సీపీడబ్ల్యూఎస్‌లకు సంబంధించి వివరాల నివేదిక ఇచ్చి చర్చించాలని ఆదేశించినా ఇంతవరకు ఎస్‌ఈల నుంచి ఎటువంటి స్పందన లేదని మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మంచినీటి సమస్య తీర్చేందుకు రూపొందించిన ప్రణాళిక అమలు చేయడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మందలించారు. తనకు ఈ అంశం గుర్తుకురాకపోతే ఇక సమస్యను పట్టించుకోరా అని ప్రశ్నించారు. సీపీడబ్ల్యూఎస్‌ పథకాలకు ఎంత బడ్జెట్‌ కావాలి, ఏం చేయాలనే అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధం కావాలని ఆదేశించారు.


జడ్పీ పద్దుకు ఆమోదం

* బడ్జెట్‌ వివరాలను జడ్పీ ఉప సీఈవో వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. 2022-23 వార్షిక ఆదాయం రూ.649.59 కోట్లు, వ్యయం రూ.649.42 కోట్లుగా పొందుపరిచారు. జిల్లా పరిషత్‌కు 2022-23 సవరించిన ఆదాయం రూ.12.215 కోట్లు, వ్యయం రూ.12.108 కోట్లు, 2023-24 అంచనా బడ్జెట్‌ రూ.12.850 కోట్లు, వ్యయం రూ.12.738 కోట్ల నిదులు అవుతాయని చూపించారు.

* జడ్పీ, మండల పరిషత్‌లకు వచ్చే ఆదాయ వనరులు, ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల వివరాలను సుబ్బారెడ్డి తెలిపారు.

* జడ్పీ అనుబంధ శాఖలకు సంబంధించి 2022-23లో ఆదాయం రూ.634.384 కోట్లు, వ్యయం రూ.637.312 కోట్లు, 2023-24లో  రూ.911.893 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. వ్యయం రూ.911.869 కోట్లుగా చూపించారు.


కోడిగుడ్లు కుళ్లిపోతున్నాయి

* అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు మూడుసార్లు కోడిగుడ్లు సరఫరా చేయాల్సిఉండగా, నెలకోసారి ఇవ్వడంతో అధికశాతం చెడిపోయి, దుర్వాసన వస్తున్నా వాటినే పంపిణీ చేస్తున్నారని జడ్పీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో థర్డ్‌పార్టీతో తనిఖీలు చేయించాలని, ఆరోపణలు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయలో ఐసీడీఎస్‌ అధికారులు ‘వకాలత్‌’ తీసుకోవద్దని హెచ్చరించారు.

* కర్నూలు నగరశివారులోని ప్రజానగరు కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో 300 మంది మహిళలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 15 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీకి కనీసం కేంద్రం లేకపోవడం ఏమిటని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ ప్రశ్నించారు. ఈ అంశంపై విచారణ చేసి కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని