logo

పది విద్యార్థులపై బాదుడు

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష రుసుము భారంగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తున్నారు.

Published : 09 Dec 2022 03:44 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు పరీక్ష రుసుము భారంగా మారింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు కొన్ని పత్రాలు సమర్పిస్తే రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా వారి నుంచి వసూలు చేస్తుండటం గమనార్హం.

ఈనెల 10వ తేదీ వరకు గడువు

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 49,253 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరితోపాటు గతేడాది అనుత్తీర్ణులైన 21,600 మంది పరీక్షలు రాయనున్నారు. రెగ్యులర్‌ విద్యార్థులైతే రూ.125, మూడు అంతకన్నా తక్కువ సబ్జెక్టులు రాసే వారు రూ.110, మూడు కంటే ఎక్కువ రాసేవారు రూ.125 చొప్పున చెల్లించాలి. వృత్తివిద్యా విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 10వ తేదీ వరకు చెల్లించడానికి గడువు ఉంది. ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులు కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే పరీక్ష రుసుము చెల్లించాల్సినవసరం లేదు. చాలా పాఠశాలల్లో ఈ విషయాన్ని చెప్పడం లేదు.

రవాణా ఛార్జీల పేరుతో

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 612 ప్రభుత్వ, 920 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీరంతా పరీక్ష రుసుము చెల్లిస్తున్నారు. చాలా ప్రైవేటు పాఠశాలల్లో రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. కేంద్రానికి బస్సుల్లో తీసుకెళ్లాల్సి ఉంటుందని చెబుతూ ఆ భారం విద్యార్థులపై వేస్తున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లి తదితర పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని