logo

జనసేనకు బలం వీర మహిళలే

వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని.. కరవు ప్రాంతంగా మార్చేసిందని.

Published : 22 Jan 2023 01:24 IST

అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తాం

జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు

మాట్లాడుతున్న నాగబాబు

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని.. కరవు ప్రాంతంగా మార్చేసిందని.. ప్రస్తుతం అడుక్కునే స్థితికి పాలకులు తెచ్చారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. కర్నూలు నగరంలోని మౌర్యఇన్‌ హోటల్‌లో జిల్లా వీర మహిళలు, జన సైనికులకు దిశానిర్దేశం చేసేందుకు శనివారం సభ ఏర్పాటు చేశారు. ఉదయం వీర మహిళల సమస్యలు, అభిప్రాయాలు సేకరించారు. మధ్యాహ్నం జన సైనికులతో చర్చించారు. వైకాపా ప్రభుత్వం ఏవిధంగా వేధిస్తోందో పలువురు చెప్పారు. తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరించారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీకి బలం వీర మహిళలేనన్నారు. వారికి పార్టీ తోడుగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు జనసేనాని మంచి ఆలోచనతో ఉందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయాలన్న ఆలోచన రాకుండా చూస్తామన్నారు. సుగాలి ప్రీతి కేసును ఇంతవరకు పరిష్కరించలేదన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలొద్దని హితవు పలికారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. నిజాయతీపరుడైన నాయకుడు మనకు ఉన్నాడని తెలిపారు. ప్రశ్నించే హక్కును నాయకులకు, కార్యకర్తలకు జనసేన పార్టీ ఇచ్చిందన్నారు.  పీఏసీ సభ్యుడు చిలకం మధుసూదన్‌రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, వరుణ్‌, పాణ్యం నియోజకవర్గ ఇన్‌ఛార్జి సురేష్‌బాబు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రేఖా గౌడ్‌, రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు హసీనాబేగం, నాయకులు షేక్‌ అర్షద్‌, వరుణ్‌, మల్లయ్య, వెంకప్ప పాల్గొన్నారు.

* జనసేన నుంచే వీర మహిళగా తమకు పేరు వచ్చిందని కర్నూలు 52వ వార్డుకు చెందిన అనిత అన్నారు. తమ వార్డులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటోందన్నారు.  పాణ్యం నియోజకవర్గానికి చెందిన రేణుక మాట్లాడుతూ జనసేనలో ఉన్నందుకు మెప్మా ఆర్పీ ఉద్యోగం నుంచి తొలగించారన్నారు.  సి.బెళగల్‌కు చెందిన విజయలక్ష్మి మాట్లాడుతూ తాము జనసేన పోస్టర్లు వేసినందుకు గుడిసె తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

బైరెడ్డిపై సెటైర్లు

బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై జనసేన నాయకులు విరుచుకుపడ్డారు. 175 నియోజకవర్గాల పేర్లను జనసేనాని చెప్పాలని సిద్ధార్థరెడ్డి అన్నారని.. ముందుగా ఆయన నందికొట్కూరు నియోజకవర్గంలోని గ్రామాల పేర్లు చెప్పాలని ఎద్దేవా చేశారు. ఉమ్మడి జిల్లాలోని మండలాల పేర్లు చెప్పాలన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమన్నారు. గడప గడపకు కూడా వెళ్లలేని పరిస్థితి సిదార్థరెడ్డికి ఏర్పడిందన్నారు. నందికొట్కూరులో రహదారి విస్తరణ కింద బాధితులకు ఇంత వరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.

సదస్సుకు హాజరైన జనసేన వీర మహిళలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని