logo

కందిపప్పు ఉడుకుతుందా

రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా అరకొరగానే సరకులు పంపిణీ చేస్తున్నారు. పంచదార ఇస్తే.. కందిపప్పు ఇవ్వరు.. కందిపప్పు ఉంటే పంచదార నిండుకుంటుంది.

Published : 24 Jan 2023 02:25 IST

గోదాము నుంచి బియ్యం, పంచదారతో చౌకదుకాణాలకు వెళ్తున్న వాహనాలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రేషన్‌ కార్డుదారులకు ప్రతి నెలా అరకొరగానే సరకులు పంపిణీ చేస్తున్నారు. పంచదార ఇస్తే.. కందిపప్పు ఇవ్వరు.. కందిపప్పు ఉంటే పంచదార నిండుకుంటుంది. కొన్ని ప్రాంతాల్లో రెండూ ఇవ్వడం లేదు. గత నాలుగైదు నెలలుగా కార్డుదారులకు కందిపప్పు, పంచదార అంతంతమాత్రంగానే ఇస్తున్నారు. ఫిబ్రవరిలోనైనా మూడు రకాల నిత్యావసర వస్తువులు సరిగా ఇస్తారా? లేదా? అన్నది అనుమానంగానే ఉంది.

నిండుకున్న నిల్వలు

* ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11.59 లక్షల మంది కార్డుదారులు ఉన్నారు. వీరికి 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం, పంచదార 600 టన్నులు, కందిపప్పు 1,195 టన్నుల అవసరం ఉంది.

* ఫిబ్రవరి కోటాకు సంబంధించి కర్నూలు జిల్లాలోని పౌరసరఫరాల గోదాముల్లో సగం మంది కార్డుదారులకు పంపిణీ చేసేలా పంచదార నిల్వలు ఉన్నాయి. కందిపప్పు నిల్వలు లేవు. నంద్యాల జిల్లాలో సగం మంది కార్డుదారులకు సరిపడా కందిపప్పు ఉండగా.. పంచదార నిల్వలు నిండుకున్నాయి.

* ఈనెల 21 నుంచి జిల్లా కేంద్రంలో నిత్యావసర వస్తువుల సరకులను చౌక దుకాణాలకు చేరవేస్తున్నారు. మూడు రోజుల్లో కేవలం 50 దుకాణాలకు బియ్యం, పంచదార సరఫరా చేశారు. కందిపప్పు లేకపోవడంతో చౌక దుకాణాల డీలర్లు సరకులు తీసుకెళ్లేందుకు సుముఖత చూపడం లేదు.  

రుచి బాగుందన్నారు.. వెనక్కి పంపించారు

* నాణ్యత ప్రమాణాలు ఉన్న.. మంచి రుచికరమైన కందిపప్పును కార్డుదారులకు అందిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల గోదాములు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ప్రయోగాత్మకంగా కందిపప్పును ఉడికించి రుచి చూపించారు. రుచికరంగా ఉందని, నాణ్యత కలిగిన కందిపప్పును సరఫరా చేస్తున్నామని ఈనెల 13న బహిరంగంగా అధికారులు వెల్లడించారు.

హైదరాబాదు నుంచి కర్నూలు పౌరసరఫరాల గోదాముకు మూడు రోజుల కిందట 30 టన్నుల కందిపప్పు వచ్చింది. సరకు నాణ్యతగా లేదంటూ.. లోడు లారీని అధికారులు వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో కార్డుదారులకు నాణ్యమైన కందిపప్పు పంపిణీ చేస్తారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

రాగులు.. జొన్నలు కావాలి

రాగులు, జొన్నల పంపిణీపై లబ్ధిదారుల ఆసక్తిని తెలుసుకునేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్‌ దుకాణాల వారీగా అభిప్రాయ సేకరణ జరిగింది. కర్నూలులో 6,62,083, నంద్యాలలో 5,33,496 మంది రేషన్‌కార్డుదారుల నుంచి వివిధ కోణాల్లో అభిప్రాయాలు సేకరించారు. నంద్యాల జిల్లాలో ఎక్కువమంది రాగులు, జొన్నలు కావాలని కోరగా, కర్నూలు జిల్లాలో అధికశాతం మంది రాగుల పట్ల ఆసక్తి చూపారు. ఈ విషయమై కర్నూలు జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్‌ మాట్లాడుతూ జిల్లాల్లో కార్డుదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాం... 6.50 లక్షల మంది కార్డుదారులు రాగులు, జొన్నలు తీసుకొనేందుకు ముందుకొచ్చారు.. రెండు కిలోల బియ్యానికి రెండు కిలోల జొన్నలు లేదా రాగులు ఇచ్చే అవకాశం ఉంది.. ఈ మేరకు ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని