logo

గణతంత్ర పుటలు చదివిద్దాం

జలియన్‌వాలాబాగ్‌ దుర్ఘటనలో ప్రాణాలు పోతున్నా భారత్‌మాతాకీ జై అని నినదించిన భారతీయులను అడుగు దేశభక్తి అంటే చెబుతుంది.!!

Published : 26 Jan 2023 01:49 IST

నేడు వసంత పంచమి
నేడు రిపబ్లిక్‌ డే ఉత్సవాలు

జలియన్‌వాలాబాగ్‌ దుర్ఘటనలో ప్రాణాలు పోతున్నా భారత్‌మాతాకీ జై అని నినదించిన భారతీయులను అడుగు దేశభక్తి అంటే చెబుతుంది.!!

అహింస మార్గంలోనే స్వాతంత్య్రం తేవాలని తెల్లదొరల లాఠీదెబ్బలకు వెరవని మహాత్ముడి ఆత్మవిశ్వాసాన్ని అడుగు దేశభక్తి అంటే వివరిస్తుంది.!!

భరతమాత స్వేచ్ఛ కోరి ఉరికంభం ఎక్కిన భగత్‌సింగ్‌ ఆఖరి శ్వాసను అడుగు దేశభక్తి అంటే తెలుపుతుంది.!!

మనందరిని విముక్తులను చేయడానికి తుపాకి గుండుకే గుండె చూపిన అల్లూరి, ఆంధ్రకేసరి ధైర్యాన్ని అడుగు దేశభక్తి అంటే చూపుతుంది.!!

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

సిపాయిల తిరుగుబాటుకు ముందే బ్రిటిష్‌వారిపై జిల్లా వాసులు పోరాడారు. ప్రజలు స్వేచ్ఛా వాయువును పీల్చుకునేందుకు, బానిస బతుకుల నుంచి విముక్తి కల్పించడానికి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఆంగ్లేయులకు ఎదురొడ్డారు. గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, వనం శంకర శర్మ, నివర్తి వెంకట సుబ్బయ్య.. ఇలా చాలా మంది నాయకత్వం వహించి ప్రజలను ఏకం చేయ సాగారు. ఇలాంటి చరిత్రను నేటి విద్యార్థులు చెప్పలేకపోతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియడం లేదు.. ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు కనీసం రెండు దేశభక్తి గీతాలూ పాడలేకపోతున్నట్లు ‘న్యూస్‌టుడే’ సర్వేలో తేలింది. సమరయోధుల చరిత్రను నేటి తరం తెలుసుకొనేలా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాల్సినవసరం ఉంది. నేడు వసంత పంచమి... చదువులతల్లి సరస్వతీ పుట్టినరోజు. ఈ రోజు విద్యాభ్యాసం మొదలుపెడితే విద్యార్థులు ఉన్నత విద్యావంతులు అవుతారనేది చాలా మంది నమ్మకం. తల్లిదండ్రులు వసంత పంచమి రోజును సరస్వతీ దేవి చెంత అక్షరాలు దిద్దించి, అన్నప్రాసనలు చేయిస్తారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలకు దేశ స్వాతంత్య్ర సంగ్రామ ఘట్టాలు, మహనీయుల చరిత్రలు నేర్పించడానికి శ్రీకారం చుట్టాల్సినవసరం ఉంది.


దేశభక్తి.. క్రమశిక్షణ

1 విద్యార్థి దశ నుంచే దేశభక్తి, క్రమశిక్షణ నేర్పడంతోపాటు సామాజిక అంశాల్లో తర్ఫీదు ఇచ్చి వారి ఉజ్వల భవిష్యత్తు బాటలు వేయడమే ఎన్‌సీసీ లక్ష్యం. 2011లో కర్నూలు గ్రూప్‌ ఆఫీసు ఏర్పాటైంది. ఈ గ్రూపులో కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన ఎన్‌సీసీ విద్యార్థులు ఉంటారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8, 9 తరగతులు చదివే విద్యార్థులు ఎన్‌సీసీలో చేరే అవకాశం ఉంటుంది.

2 కర్నూలులో 21 ప్రభుత్వ, 20 ప్రైవేటు పాఠశాలల్లో 2,403 మంది, నంద్యాల జిల్లా పరిధిలో 6 ప్రభుత్వ, 5 ప్రైవేటు బడుల్లో చదివే 600, ఆదోని పరిధిలో 6 ప్రభుత్వ, 1 ప్రైవేటు పాఠశాలలో చదివే 522 మంది బాలబాలికలు ఎన్‌సీసీలో ఉన్నారు. వీరికి రెండేళ్లపాటు సాగే శిక్షణలో పలు అంశాల్లో తర్ఫీదు ఇస్తారు. భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎన్‌సీసీ క్యాంపులు నిర్వహిస్తారు.

3 రెండేళ్ల కోర్సు పూర్తి చేసిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఎ.సర్టిఫికెట్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి ఏబీసీ గ్రేడ్‌ కేటాయిస్తారు. రైఫిల్‌ షూటింగ్‌, కవాతులో ప్రతిభ చూపిన వారిని దిలీలో జరిగే శిబిరానికి పంపుతారు. వీరికి ఉన్నత చదువులు, రక్షణ రంగంలో 2 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. ఎ.సర్టిఫికెట్‌ పొంది చాలా మంది యువకులు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు పెద్దఎత్తున సాధించారు.


ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం : విజయ్‌కుమార్‌, చీఫ్‌ ఆఫీసర్‌.. ఏఎన్‌వో

ఎన్‌సీసీలో చేరే వ్యక్తి ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇచ్చేలా తీర్చిదిద్దుతాం. వారి చేతులపై పచ్చ బొట్లు ఉండకూడదు. మోకాళ్లు ఆనుకోకుండా ఉండాలి. వారినే ఎన్‌సీసీలో చేర్చుకుంటాం. జవాన్ల సమక్షంలో ఏడాదికి 40 తరగతుల చొప్పన శిక్షణ ఇప్పిస్తాం. దేశభక్తి పెంపొందించేలా శిక్షణ ఉంటుంది.


ఆరులో సైనిక్‌ పాఠాలు

సైనిక్‌ పాఠశాలలు.. సాయుధ దళాల్లో చేరేలా ఆరో తరగతి నుంచే విద్యార్థులను శారీరకంగా, మానసికంగా సన్నద్ధం చేసే పాఠశాలలు. వీటిల్లో ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా ఏటా వేలాది మంది పోటీ పడుతుంటారు. సీట్లు పరిమితిగా ఉండటంతో కొందరికే అవకాశం దక్కుతోంది. ఇక్కడ సీటు సంపాదిస్తే భవిష్యత్తులో త్రివిధ దళాల్లో ప్రవేశం దాదాపు ఖరారైనట్లే. యాభై ఏళ్ల క్రితం దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా సైనిక స్కూల్‌ సొసైటీ నెలకొల్పారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు రెసిడెన్షియల్‌ విధానంలో సీబీఎస్‌ఈ విద్యా బోధన అందిస్తారు. చదువుతోపాటు విద్యార్థుల్లో ధైర్య సాహసాలు నూరిపోస్తూ.. త్రివిధ దళాల్లో చేరేలా స్కూల్‌ స్థాయి నుంచే క్రమశిక్షణ నేర్పడం వీటి ప్రధాన ఉద్దేశం. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న సైనిక్‌ పాఠశాలలకు సంబంధించి సంస్కరణల దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం దేశంలో 33 సైనిక్‌ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో ఏటా మూడు వేల మంది ఆరో తరగతిలో ప్రవేశం పొందుతున్నారు.  ప్రస్తుతం   పది శాతం సీట్లు బాలికలకే కేటాయించారు.


నేవీ రంగంలో అడుగుపెడతా : హేమంత్‌, కల్లూరు

సైనిక్‌ పాఠశాలల్లో ప్రవేశాల నిమిత్తం 2016లో నిర్వహించిన ప్రవేశ పరీక్షలో 37వ ర్యాంకు సాధించా. కలికిరి సైనిక్‌ స్కూల్‌ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశం పొందా. సీటు ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించడంతో సీటు వచ్చింది. ప్రస్తుతం 12వ తరగతి (ఎంపీసీ) చదువుతున్నా. పాఠశాలలో అన్ని రాష్ట్రాల విద్యార్థులు ఒకేచోట ఉండటంతో హిందీ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడటం. సాధారణ విద్యార్థుల కంటే దృఢంగా.. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నా. నేవీ, ఎయిర్‌పోర్సు, మిలిటరీలో అర్హత సాధించేందుకు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్ష  రాస్తున్నా. అందులో ఉత్తీర్ణత సాధిస్తే నేవీ రంగం వైపు వెళ్లాలని ఉంది.

 కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే


  రైఫిల్‌ షూటింగ్‌పై దృష్టి పెట్టా
-సాయికుమార్‌ స్వామి, ఎన్‌సీసీ విద్యార్థి

కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఎన్‌సీసీలో చేరేదాకా లక్ష్యం అంటూ ఏమీ లేదు.. ఇందులో చేరాక రైఫిల్‌ షూటింగ్‌ మీద ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఎన్‌సీసీ నిర్వహించిన పలు శిబిరాల్లో రైఫిల్‌ షూటింగ్‌లో పాల్గొని మొదటి స్థానం సాధించి దిల్లీకి సైతం వెళ్లి వచ్చా. ఇక్కడితో నా ప్రయాణం ఆగలేదు.  అసోసియేషన్‌ నిర్వహించే పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఎన్‌సీసీలో చేరకపోయి ఉంటే.. లక్ష్యమంటూ ఉండేది కాదు.


దేశ రక్షణతోపాటు..
- కల్నల్‌ ఎన్‌.రమేష్‌, కర్నూలు గ్రూప్‌ కమాండర్‌

ఎన్‌సీసీలో చేరితే విద్యార్థి దశ నుంచే దేశభక్తి పెంపొందించడంతోపాటు సామాజిక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వెపన్‌తో తర్ఫీదు.. విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం.. తదితర అంశాల్లో జవాన్లు శిక్షణ ఇస్తారు. పాఠశాల స్థాయిలో 8వ తరగతిలో ప్రవేశం ఉంటుంది. రెండేళ్లపాటు కోర్సు పూర్తి చేసిన వారికి పరీక్ష నిర్వహించి ఎ.సర్టిఫికెట్‌ జారీ చేస్తాం. పరీక్ష రాసేవారు తప్పనిసరిగా 15 రోజులపాటు సాగే ఎన్‌సీసీ క్యాంపులో పాల్గొనాల్సి ఉంటుంది. సర్టిఫికెట్‌ పొందిన ఎన్‌సీసీ విద్యార్థికి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో 2 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. దిల్లీ వెళ్లి వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని