logo

జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఉద్యోగావకాశాలు కరవు

జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో చదువుకున్న యువకులకు ప్రభుత్వ కొలువులు లేక, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే దుస్థితి నెలకొందని తెదేపా కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బాధ్యులు టి.జి.భరత్‌ అన్నారు.

Published : 26 Jan 2023 01:49 IST

కొబ్బరికాయలు కొడుతున్న సోమిశెట్టి, టి.జి.భరత్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో చదువుకున్న యువకులకు ప్రభుత్వ కొలువులు లేక, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే దుస్థితి నెలకొందని తెదేపా కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ బాధ్యులు టి.జి.భరత్‌ అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్‌ ఈనెల 27 నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతం కావాలని కోరుతూ తెదేపా కర్నూలు పార్లమెంట్‌ అనుబంధ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకేశ్‌ సంపూర్ణ ఆరోగ్యంతో పాదయాత్ర నిరాటంకంగా, నిర్విఘ్నంగా సాగాలని కోరారు. బుధవారం కర్నూలు నగరంలోని వినాయక ఆలయంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షులు నర్సింహులు ఆధ్వర్యంలో వినాయకుడికి, సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణ ఆలయంలో కర్నూలు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు ఆధ్వర్యంలో సోమిశెట్టి, భరత్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ధైర్యాన్నిచ్చి, రానున్న రోజులలో వారికి ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో నారా లోకేశ్‌ యువగళం పేరుతో పాదయాత్రకు పూనుకున్నారని అన్నారు. 400 రోజులు, 4 వేల కిలోమీటర్ల మేర నిరాటంకంగా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసిన సందర్భంలో తెదేపా ప్రభుత్వం వారికి అన్ని అనుమతులు ఇచ్చామని, నేడు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో పోలీసు అధికారులు డీజీపీ లోకేశ్‌ పాదయాత్రకు అనుమతులివ్వడంలో లేనిపోని నిబంధనలు విధిస్తున్నారని వాపోయారు. పోలీసు అధికారులూ ఏకపక్షంగా వ్యవహరించకుండా చూడాలని, లక్షలాది మంది కార్యకర్తలు, యువకులు పాల్గొననున్న కార్యక్రమానికి నిబంధనల మేరకు తగిన రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు అధికారులదేనన్నారు. లోకేశ్‌ పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సోమిశెట్టి నవీన్‌, నందిమధు, శివరాజప్ప, పరమేష్‌, గున్నామార్క్‌, హనుమంతరావు చౌదరి, టీఎన్‌టీయుసీ నాయకులు అశోక్‌కుమార్‌, నగేష్‌, సుంకన్న, బి.వి రమణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


అడ్డంకులు సృష్టించినా..  లోకేశ్‌ పాదయాత్ర ఆగదు

ఆదోనిలో విలేకరులతో మాట్లాడుతున్న ఆదోని తెదేపా బాధ్యుడు మీనాక్షినాయుడు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 27వ తేదీన చేపడుతున్న పాదయ్రాత ఆగదని ఆదోని నియోజకవర్గ బాధ్యుడు మీనాక్షినాయుడు అన్నారు. ఆదోనిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో చాలా మంది నాయకులు పాదయాత్రలు చేశారని, చేస్తున్నారు. ఎవరికీ లేని అడ్డంకులు లోకేశ్‌కే ఎందుకు అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేయడం సాధారణం అన్నారు. 400 రోజులు పాదయాత్ర సాగుతుందని, ఇందు కోసం తెదేపా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆదోని నియోజవర్గంలో ఈ నెల 27వ తేదీన  పాదయాత్రకు సంఘీభావంగా ఎన్టీఆర్‌కు నివాళి అర్పించి, రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. అనంతరం సంఘీభావ ర్యాలీ ఉంటుందన్నారు. కార్యక్రమానికి తెదేపా కార్యకర్తలు, నాయకులు, నందమూరి అభిమానులు హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నియంతలా వ్యవరిస్తున్నారన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు గోపాల్‌, బుద్దారెడ్డి, తిమ్మప్ప, లక్ష్మీనారాయణ, జయరాం, మల్లికార్జున, వెంకటేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఆంక్షలు విధించడం సరికాదు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గుండెల్లో లోకేశ్‌ పాదయాత్ర వణుకు పుట్టిస్తుందని ఆదోని తెదేపా సీనియర్‌ నాయకులు భాస్కర్‌రెడ్డి, దేవేంద్రప్ప, ఫకృద్దీన్‌, రామస్వామి, తెదేపా మాజీ ఇన్‌ఛార్జి గుడిసె కృష్ణమ్మ అన్నారు. యువగళానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరి కాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు