logo

పెద్దాస్పత్రిలో సిస్టో గ్యాస్‌ ఆస్ట్రమీ చికిత్స

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇమ్మానియల్‌ (52) క్లోమ గ్రంధి వ్యాధితో బాఢపడుతూ ఆస్పత్రికి రాగా.. సిస్టో గ్యాస్‌ ఆస్ట్రమీ చికిత్సతో సమస్యను పరిష్కరించినట్లు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ వెంకట రంగారెడ్డి తెలిపారు.

Published : 26 Jan 2023 01:49 IST

వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ వెంకటరంగారెడ్డి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇమ్మానియల్‌ (52) క్లోమ గ్రంధి వ్యాధితో బాఢపడుతూ ఆస్పత్రికి రాగా.. సిస్టో గ్యాస్‌ ఆస్ట్రమీ చికిత్సతో సమస్యను పరిష్కరించినట్లు గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ వెంకట రంగారెడ్డి తెలిపారు. కర్నూలు సర్వజన ఆస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఆ విభాగం వైద్యులు మోహన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులతో కలిసి బుధవారం వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఇమ్మానియేలు గతంలో ఫ్రాంకియాస్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ పెద్దాస్పత్రిలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో చేరాడని.. చికిత్స అందించడం ద్వారా నయమైందని చెప్పారు. ఆ సమయంలో క్లోమగ్రంధి వద్ద సిస్టు ఏర్పడిందని.. ఇది పెరిగితే రమ్మని చెప్పామని పేర్కొన్నారు. అతను ఏడాది వరకు రాలేదని పేర్కొన్నారు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ డిసెంబరు 24న రాగా.. వైద్య పరీక్షలు చేశామని చెప్పారు. ఫ్రాంకియాస్‌ పక్కన సిస్టు పెరిగి జీర్ణాశయం మీద ఒత్తిడి ఎక్కువై సైజు తగ్గిందని గుర్తించామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ చేయాలంటే చాలా సమయం పడుతుందన్నారు. సిస్టు సైజు తగ్గించాలంటే స్టంట్‌ వేయాలని.. దీనికి సుమారు రూ 80 వేలు ఖర్చవుతుందని తెలిపారు. సదరు కంపెరీతో మాట్లాడి రాయితీ ఇప్పించామన్నారు. మంగళవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు, పీజీలు కలిసి ఎండోస్కోపి ద్వారా స్టంట్‌ను తిత్తికి అమర్చి దానిలోని నీరంతా జీర్ణాశయంలోకి వెళ్లేలా చేయడం ద్వారా పీడనం తగ్గించామన్నారు. సర్వజన వైద్యశాలలో మొదటిసారి సిస్టో గ్యాస్‌ ఆస్ట్రమీ చికిత్స చేశామని.. ప్రైవేటుగా చేయించుకోవాలంటే రూ.2.5 లక్షల వరకు ఖర్చవుతుందని వివరించారు. ఈ సమావేశంలో పీజీలు రాకేష్‌, బిలాల్‌, తేజేశ్వరరెడ్డి, కిరణ్‌, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని