logo

ఆటల్లో మేటి.. వంటల్లో ఘనాపాటి

ఇంట్లోని పరిస్థితులు అతడిని స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా చేశాయి. ఒకవైపు చదువుకోవడం.. ఇష్టమైన క్రికెట్‌లో రాణించడంతోపాటు కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు చెఫ్‌గా మారారు.

Published : 26 Jan 2023 01:49 IST

కుటుంబం కోసం చెఫ్‌గా మారిన అబ్దుల్‌ రహీం
- న్యూస్‌టుడే, కర్నూలు విద్య

ఇంట్లోని పరిస్థితులు అతడిని స్వయం ఉపాధి వైపు అడుగులు వేసేలా చేశాయి. ఒకవైపు చదువుకోవడం.. ఇష్టమైన క్రికెట్‌లో రాణించడంతోపాటు కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు చెఫ్‌గా మారారు. సాయంత్రం వేళల్లో పనిచేస్తూ ఆర్థికంగా అండగా ఉంటున్నారు. అతనే కర్నూలు జొహరాపురానికి చెందిన అబ్దుల్‌ రహీం. ఇతని తండ్రి అబ్దుల్‌ రెహమాన్‌ ఓ హోటల్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి అస్రఫున్నీసా గృహిణిగా ఉన్నారు. అబ్దుల్‌ రహీం నగరంలోని టౌన్‌ మోడల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది చదువుతున్నారు. కళాశాలకు వెళ్లి వచ్చిన తర్వాత ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తున్నారు. మరోవైపు తనకు ఇష్టమైన క్రికెట్‌లోనూ రాణిస్తుండటం విశేషం.


రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం

గురువు చరణ్‌ సింగ్‌తో అబ్దుల్‌ రహీం

జనవరి మొదటి వారంలో జరిగిన జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీల్లో రహీం పాల్గొని ప్రతిభ చాటారు. ఇదే స్ఫూర్తితో మచిలీపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి మొదటి వరుసలో స్థానం దక్కించుకున్నారు. క్రికెట్‌పై ఆసక్తి ఉండడంతో నగరంలోని ఎ.క్యాంపులో ఉన్న క్రికెట్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. శివచరణ్‌ సింగ్‌ వద్ద క్రికెట్‌లో మెలకువలు నేర్చుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.


పలు రకాల వంటల్లో దిట్ట

చెఫ్‌గా పనిచేస్తూ..

అబ్దుల్‌ రహీం పార్ట్‌టైమ్‌ కింద ఓ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నారు. దీనికిగాను ఆరు నెలలపాటు శిక్షణ తీసుకున్నారు. వివిధ రకాల వంటకాలు చేయగల సిద్ధహస్తుడిగా మారారు. అతను ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి 9.30 గంటల వరకు క్రికెట్‌లో శిక్షణ తీసుకుంటారు. 10 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు కళాశాలకు వెళతారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10.30 వరకు చెఫ్‌గా విధుల్లో ఉంటున్నారు. తన సంపాదనలో కొంత మొత్తాన్ని కుటుంబ అవసరాలు తీర్చడంతోపాటు క్రికెట్‌ ఆడేందుకు అవసరమయ్యే వస్తువులు, పుస్తకాల కోసం ఖర్చు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ సైన్యంలో ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని