logo

20 టన్నులకు మించి వెళ్లొద్దు

జిల్లా కేంద్రం నుంచి వయా తిమ్మనదొడ్డి మీదుగా మంత్రాలయం వెళ్లే రహదారిపై 20 టన్నుల బరువు మించిన లారీలను అనుమతించొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

Published : 27 Jan 2023 05:35 IST

కర్నూలు-తిమ్మనదొడ్డి-మంత్రాలయం రహదారిపై హైకోర్టు ఆదేశం
హైకోర్టులో న్యాయవాది వ్యాజ్యం.. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం

ఈనాడు, అమరావతి: జిల్లా కేంద్రం నుంచి వయా తిమ్మనదొడ్డి మీదుగా మంత్రాలయం వెళ్లే రహదారిపై 20 టన్నుల బరువు మించిన లారీలను అనుమతించొద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది. కర్నూలు నుంచి వయా తిమ్మనదొడ్డి మీదుగా మంత్రాయలయం వెళ్లే 50 ఏళ్ల ఆర్‌అండ్‌బబీ దారి ప్రయాణానికి వెళ్లేవీలులేకుండా మారిందని, దానిని పునరుద్ధరించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కర్నూలుకు చెందిన పి.హనుమంతరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి వాదనలు వినిపిస్తూ తుంగభద్ర నుంచి ఇసుక మాఫియా భారీ వాహనాలు నడపడంతో గూడూరు, సి.బెళగల్‌, కోడుమూరు మండలాల్లోని సుమారు 20 గ్రామాల పరిధిలో రహదారులు తీవ్రంగా పాడైపోయాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సులు నడపలేమని ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులకు ఆర్టీసీ అధికారులు లేఖలు రాశారన్నారు. బస్సులు మరమ్మతులకు గురువుతున్నట్లు తెలిపారన్నారు. రహదారులను పునరుద్ధరించాలని కోరుతూ అధికారులకు, సీఎంకు వినతి సమర్పించినా చర్యలు లేవన్నారు. భారీ వాహనాలపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని ఆర్‌అండ్‌బీ అధికారులు చేతులెత్తేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆ రహదారిపై భారీ ట్రక్కులను తిరగకుండా తగిన ఆదేశాలివ్వాలని కోరారు. అందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని