logo

ఫుట్‌బాల్‌.. గోల్‌మార్‌

మైదానంలో దిగితే.. ఫుట్‌బాల్‌తో గోల్‌ చేయాల్సిందే. వారి క్రీడా నైపుణ్యంతో జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు సై అంటున్నారు ఆదోని పట్టణానికి చెందిన యువ క్రీడాకారులు.

Updated : 27 Jan 2023 06:35 IST

ప్రతిభ చాటుతున్న ఆదోని క్రీడాకారులు
రాష్ట్ర స్థాయి పోటీలకు సై

ఆదోని సాంస్కృతికం, న్యూస్‌టుడే: మైదానంలో దిగితే.. ఫుట్‌బాల్‌తో గోల్‌ చేయాల్సిందే. వారి క్రీడా నైపుణ్యంతో జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు సై అంటున్నారు ఆదోని పట్టణానికి చెందిన యువ క్రీడాకారులు. అండర్‌-17 ఫుట్‌బాల్‌ పోటీల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విజయగాథ తెలుసుకుందామా..


అఖిలేశ్వర్‌.. మైదానం హడల్‌

ఆదోని పట్టణానికి చెందిన రంగారెడ్డి, జయమ్మ దంపతుల కుమారుడు పి.అఖిలేశ్వరరెడ్డి  ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పాఠశాల స్థాయి నుంచే ఫుట్‌బాల్‌ క్రీడపై మక్కువతో కోచ్‌ మస్తాన్‌వలి, జగన్నాథ్‌ వద్ద ప్రత్యేక శిక్షణ పొందుతూ వచ్చాడు. లెఫ్ట్‌ ఫార్వర్డ్‌ క్రీడాకారుడిగా బరిలో దిగితే ప్రత్యర్థుల గోల్‌పోస్టులోకి బంతిని పంపేదాకా దూకుడుగా ఆపడు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో కడపలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అఖిలేశ్వరరెడ్డి.


ఆసిఫ్‌.. అడ్డుగోడలా

ఆదోని మండలం బసాపురం గ్రామానికి చెందిన షేక్‌షేక్షావలి, షేక్‌ఖాజాబీ రైతు దంపతుల కుమారుడు ఆసిఫ్‌. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫుట్‌బాల్‌ క్రీడలో గోల్‌కీపర్‌గా రాణిస్తున్నాడు. బరిలో దిగితే ప్రత్యర్థులు గోల్‌ చేయాలంటే హడలెత్తిస్తాడు. గోల్‌పోస్టు వద్ద గోడలా నిలబడతాడు. ఈ క్రీడాకారుడి ప్రతిభను గుర్తించిన జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయిలో జరగనున్న ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్టులో స్థానం కల్పించారు. క్రీడలో రాణించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు రోజూ సాధన చేస్తున్నానని పేర్కొంటున్నాడు క్రీడాకారుడు ఆసిఫ్‌.


గణేశ్‌.. వ్యూహాలకు చెక్‌

ఆదోనికి చెందిన సి.మల్లయ్య, సి.సావిత్రమ్మ దంపతుల కుమారుడు సి.గణేశ్‌ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చదువుతూనే మరో వైపు ఫుట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్నాడు. బరిలో డిఫెన్స్‌ ఆడటం ఈ క్రీడాకారుడి ప్రత్యేకత. ప్రత్యర్థుల వ్యూవహాలను తిప్పికొట్టడంలో దిట్ట. వారి ప్రయత్నాలు ముందుకు సాగకుండా చెక్‌ పెడుతుంటాడు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఈ క్రీడాకారుడి ప్రతిభను గుర్తించిన జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఎంపిక చేశారు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు గణేశ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు