logo

చేదోడు గడువు గడబిడ

వైఎస్సార్‌ చేదోడు పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కేవలం మూడ్రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 28 Jan 2023 01:48 IST

వెల్దుర్తి-2 సచివాలయానికి చేదోడు పథకం దరఖాస్తు చేసేందుకు వచ్చిన జనం

కర్నూలు సంక్షేమం, వెల్దుర్తి, న్యూస్‌టుడే : వైఎస్సార్‌ చేదోడు పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కేవలం మూడ్రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవసరమైన పత్రాలు అందుబాటులో లేకపోవడం.. సమయం తక్కువగా ఉండటం.. దీనికితోడు సర్వర్‌ సమస్య వేధిస్తుండటంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 26,411 మంది రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కర్నూలు జిల్లా నుంచి 12,856 మంది, నంద్యాల జిల్లా నుంచి 13,556 మంది ఉన్నారు. కొత్తగా 3,743 మంది దరఖాస్తులు ఇచ్చారు.

మూడు రోజుల సమయం

* వైఎస్సార్‌ చేదోడు పథకం కింద రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, వివిధ కులవృత్తి పనులు చేసుకుంటూ 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు ఉన్న తెల్లరేషన్‌ కార్డుదారులు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులకు ఏటా రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.

* దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 23న ఆదేశాలు ఇచ్చింది. ఆరోజు చాలామందికి విషయం తెలియని పరిస్థితి. 26వ తేదీ సెలవు కావడం.. కేవలం 24, 25, 27 తేదీల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు.

కొర్రీలు పెట్టి కోతలు

ఇల్లు మారినా.. దుకాణాన్ని మార్చినా ఆ ప్రాంతంలోని సచివాలయం నుంచే దరఖాస్తు చేసుకోవాల్సి రావడంతో సమస్యలు ఎదురయ్యాయి. గతంలో రెండుసార్లు లబ్ధి పొందినవారు కొత్త సచివాలయం నుంచి దరఖాస్తు చేసుకుంటే కొత్త దరఖాస్తు కింద నమోదు చేయాల్సి వచ్చింది. పాత సచివాలయం నుంచి రెన్యువల్‌ చేసుకొనేందుకు వీలుకాని పరిస్థితి. ప్రధానంగా సచివాలయాల నుంచి ఎంపీడీవో కార్యాలయాలకు.. అక్కడినుంచి బీసీ కార్పొరేషన్‌కు పంపేందుకు సర్వర్‌ సమస్యలు లేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో వెయ్యి మందికిపైగా అర్హులైనవారు, రెన్యువల్‌ చేసుకునేవారు దరఖాస్తు చేసుకోలేకపోయినట్లు సమాచారం.

సర్వర్‌ సతాయింపు

వైఎస్సార్‌ చేదోడు పథకం లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రజలకు సర్వర్‌ మొరాయింపుతో నిరాశ చెందారు. చేదోడు పథకం పొందేందుకు కేవలం మూడు రోజుల గడువు ఇవ్వడంతో చాలామంది ఆందోళనలో మునిగిపోయారు. పథకం పొందాలంటే కొత్తగా లేబర్‌, కుల, ఆదాయ ధ్రువపత్రాలు అవసరమని చెప్పడంతో వాటి కోసం సచివాలయాలు, తహసీˆల్దార్‌ కార్యాలయాలకు పరుగులు తీశారు. సర్వర్‌ సమస్యకుతోడు ధ్రువపత్రాలు అందక  పలువురు అర్హత కోల్పోవాల్సి వచ్చింది.

అదనంగా వసూళ్లు

కర్నూలు జిల్లాలో పరిశీలిస్తే శుక్రవారం సాయంత్రం 4.30 సమయంలో 695 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వెల్దుర్తిలోని మూడు సచివాలయాల్లో దాదాపు 15 వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లబ్ధిదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వెల్దుర్తి-3 సచివాలయంలో లేబర్‌ ధ్రువపత్రానికి రూ.140 తీసుకోవాల్సి ఉండగా రూ.200 వసూలు చేసినట్లు పలువురు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రంలోగా దరఖాస్తులు అప్‌లోడ్‌ చేయాలని ఆదేశాలు ఉండటంతో ధ్రువపత్రాలు అందక చాలా మంది తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఈ విషయమై బీసీ కార్పొరేషన్‌ ఈడీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో అర్హులైవారందరికీ మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.


మూడు రోజుల కిందట సమాచారం : హుసేన్‌బాషా, గురుమూర్తి, బుక్కాపురం

జగనన్న చేదోడు పథకం పొందేందుకు మూడు రోజుల కిందట సమాచారం అందించారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం కావడంతో కార్యాలయం పనిచేయలేదు. ఈనెల 27 మధ్యాహ్నానికి ధ్రువపత్రాలు అందించాలని చెప్పారు. గతంలో తీసుకున్న కుల ధ్రువపత్రం చెల్లదన్నారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు తహసీˆల్దార్‌ కార్యాలయానికి వచ్చాం. సర్వర్‌ సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు