logo

అక్రమ అంతస్తులు

నంద్యాల జిల్లా కేంద్రంలో ‘అధికార’ మద్దతుతో అక్రమ అంతస్తులు వెలుస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు రంగంలోకి దిగారు.

Updated : 29 Jan 2023 05:27 IST

అధికార మద్దతుతో పునాదులు
అనిశా అధికారుల తనిఖీలు

భవనాలకు కొలతలు వేస్తున్న సిబ్బంది

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నంద్యాల జిల్లా కేంద్రంలో ‘అధికార’ మద్దతుతో అక్రమ అంతస్తులు వెలుస్తున్నాయి. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులు రంగంలోకి దిగారు. పక్కా సమాచారంతో హాజరైన వారు మొదటి రోజు కార్యాలయంలో దస్త్రాలు క్షుణంగా పరిశీలించారు. రెండో రోజు శనివారం క్షేత్రస్థాయికి వెళ్లి భవనాల కొలతలు తీసుకోవడం గమనార్హం. పట్టణంలో 20 భవనాల వరకు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనిశా అధికారుల రెండురోజుల తనిఖీలు ప్రజాప్రతినిధులు, అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.


కుళాయిల్లో అక్రమధారలు

* పట్టణంలో బొగ్గులైన్‌, ఇస్లాంపేట, సాయిబాబానగర్‌, వైఎస్సార్‌ నగర్‌, గాంధీనగర్‌, ఎన్జీవో కాలనీ, ఎస్బీఐ కాలనీ, బాలాజీ కాంప్లెక్‌ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనెక్షన్లు ఉన్నా పుర దస్త్రాల్లో లేవు. అధికారులు, సిబ్బంది నేరుగా యజమానులతో మాట్లాడుకుని కనెక్షన్లు ఇస్తున్నారు. ఒక్కొక్కదానికి రూ.3 వేల వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
* సలీం నగర్‌, శ్రీనివాసనగర్‌, డేనియల్‌పురం తదితర ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుల లాడ్జీలు, అపార్ట్‌మెంట్లకు యథేచ్ఛగా నీరు అడుకుంటున్నా ఇంత వరకు వాణిజ్య కనెక్షన్లు లేకపోవడం గమనార్హం.


పెద్దల ప్రణాళిక అధికారుల వత్తాసు

* నంద్యాల పుర కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగంగా అక్రమాలకు వేదికగా మారింది. రాజకీయ అండదండతో ఏళ్ల తరబడి తిష్టవేసిన ముగ్గురు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంపై ప్రస్తుత ప్రజాప్రతినిధితో పాటు మరో మాజీ ప్రజాప్రతినిధి తమదైన ముద్ర వేస్తున్నారు. వీరిని ‘ప్రసన్నం’ చేసుకోకపోతే అనుమతులు రాని పరిస్థితి.
* నౌమాన్‌నగర్‌లో ఇటీవల 30 అడుగుల రోడ్డు చూపి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వాస్తవంగా ఐదు అడుగుల రహదారి ఉందని ఫిర్యాదు వచ్చినా కాసుల కక్కుర్తితో వదిలేశారు. రోడ్డుకు దక్షిణం వైపు అనుమతులు తీసుకుని ఉత్తరం వైపు నిర్మాణాలు చేస్తున్నా కన్నెత్తి చూడ లేదు.
* పార్కుజోన్‌, రెడ్‌జోన్‌, పారిశ్రామిక జోన్లలో నిర్మాణాలు జరుగుతున్నా కనీస స్థాయి తనిఖీలు కరవయ్యాయి. నౌమాన్‌ నగర్‌, ఆటోనగర్‌, జగజ్జనని నగర్‌, గూడ్స్‌షెడ్డు, బొమ్మలసత్రం పారిశ్రామిక ప్రాంతాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు సాగుతున్నాయి.


పది శాతం ముడుపులు

* భవనాల నిర్మాణం సమయంలో ఐదు నుంచి 10 శాతం వరకు కార్యాలయం అధికారులు, సిబ్బందికి మామూళ్లు సమర్పించుకోవాల్సిందే. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ప్రైవేటు సర్వేయర్లు నిర్మాణాలకు అధికారిక గుర్తింపు ఇస్తున్నా చర్యలు లేవు. వార్డు సచివాలయాల్లో ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేసుకుని మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి డబ్బులు చెల్లిస్తేనే అనుమతులు ఇచ్చేస్తున్నారు. లేకపోతే ఏదో ఓ కారణం చెప్పి పక్కన పెడుతున్నారు.
* పుర కార్యాలయం పక్కనే మూడు అంతస్తుల భవనానికి అనుమతులు లేకున్నా పట్టించుకునే వారు లేరు. బాలాజీ కాంప్లెక్స్‌, జగజ్జననీ నగర్‌, రైతునగర్‌, వెంకటేశ్వరపురం, పొన్నాపురం కాలనీ, చాబోలు రహదారి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నాన్‌ లేఅవుట్లు వెలుస్తున్నా ముందస్తుగా చేసుకున్న ఒప్పందాలతో వదిలేస్తున్నారు.
* టీడీఎస్‌ బాండ్ల జారీలో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగింది. స్థలాలు లేని వారికి అధికారులు బాండ్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారు.


ఇంజినీరింగ్‌ విభాగంలో గుత్తాధిపత్యం

* ఇంజినీరింగ్‌ విభాగంలో ఓ నాయకుని బంధువైన గుత్తేదారు ఒక్కరే 80 శాతం పనులు చేస్తున్నారు. ఇటీవల సెంట్రల్‌ లైటింగ్‌కు రూ.5.50 లక్షలు కేటాయించి పనులు చేశారు. వీటికి ర్యాటిఫికేషన్‌ పేరుతో మరో రూ.9.50 లక్షలకు బిల్లు పెట్టారు. పనులను సొంతం చేసుకోవడంతో పాటు అదనపు నిధులు కేటాయింపజేసుకుని జేబులు నింపుకోవడం సాధారణంగా మారింది.

* ఓ ఇంజినీరు కనుసన్నల్లోనే పనులన్నీ సాగుతున్నాయి. అంచనా వ్యయంలో 10 శాతం వరకు అధికారులు, సిబ్బందికి సర్దుబాటు చేస్తుండగా.. గుత్తేదారుని పేరుతో మరికొందరు 20 శాతం వరకు నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్‌ కార్యాలయం మరమ్మతులు, ఆధునికీకరణ పేరుతో గతేడాది రెండుసార్లు నిధులు మంజూరు చేయించుకున్నారు. మున్సిపాల్టీ పరిధిలో ఎవరు సివిల్‌ పనులు చేసినా కార్యాలయ సిబ్బందికి 10 శాతం నిధులు అప్పగించాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని