logo

కేసీ నీటి వాటాలో కోత

రెండు పంటలకు నీరు అందేలా కర్నూలు- కడప (వైయస్‌ఆర్‌) కాల్వను నిర్మించారు. సుంకేసుల జలాశయం నుంచి మొదలై కర్నూలు, నంద్యాల జిల్లాలో 234.64 కి.మీ, వైయస్‌ఆర్‌ జిల్లాలో 71.01 కి.మీ మేర ప్రధాన కాల్వ విస్తరించి ఉంది. 2.65 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది.

Published : 29 Jan 2023 04:25 IST

ప్రజాప్రతినిధులపై మండిపడుతున్న కర్షకులు

ఈనాడు - కర్నూలు: రెండు పంటలకు నీరు అందేలా కర్నూలు- కడప (వైయస్‌ఆర్‌) కాల్వను నిర్మించారు. సుంకేసుల జలాశయం నుంచి మొదలై కర్నూలు, నంద్యాల జిల్లాలో 234.64 కి.మీ, వైయస్‌ఆర్‌ జిల్లాలో 71.01 కి.మీ మేర ప్రధాన కాల్వ విస్తరించి ఉంది. 2.65 లక్షల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. కేసీ కెనాల్‌కు 31.90 టీఎంసీల నీటి వాటాను కృష్ణా జల వివాదాల పరిష్కార సంస్థ (కేడబ్ల్యూడీటీ) కేటాయించింది. ఈ వాటాను తుంగభద్ర జలాశయం నుంచి 10 టీఎంసీలు, మిగిలినవి నది ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది.

జలవనరులశాఖ ఈఎన్‌సీ నుంచి తుంగభద్ర బోర్డు కార్యాలయానికి అందిన లేఖ

కేసీ ఆయకట్టు రైతుల్లో గుబులు మొదలైంది. ప్రస్తుతం అరకొరగా నీరు అందిస్తుండగా ఇంతలోనే మరో 2 టీఎంసీల నీటి వాటాకు కోత పెడుతున్నారన్న సమాచారం వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్‌ వరకు నీరు అందితేనే పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. లేదంటే లక్షలు నష్టపోవాల్సి వస్తోందని అన్నదాతలు పేర్కొంటున్నారు.కర్నూలు - కడప కాల్వ నీటి వాటాలో కోత పెట్టి తుంగభద్ర జలాశయం నుంచి అనంతపురానికి తరలిస్తున్నా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు.


అనంతపురం ఎస్‌ఈ లేఖ

* తుంగభద్ర నీటి వాటాలో కేసీ కొంత వాడుకోగా.. 8.868 టీఎంసీలలో అనంతపురానికి (హెచ్‌ఎల్సీ) 2 టీఎంసీలు గతేడాది విడుదల చేశారు. తుంగభద్ర హైలెవల్‌ కెనాల్‌కు మొదటి విడతగా సెప్టెంబరులో 1.613 టీఎంసీలు, రెండో విడత నవంబరులో 0.387 టీఎంసీలు తరలించారు.
* తాజాగా మరో ప్రతిపాదన అనంతపురం ఎస్‌ఈ నుంచి వచ్చింది. కేసీ కాల్వకు ఇవ్వాల్సిన 6.868 టీఎంసీల కోటాలో మరో 2 టీఎంసీలు హెచ్‌ఎల్సీ కుడి కాల్వకు విడుదల చేయాలని అందులో ప్రస్తావించారు. ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తుంగభద్ర బోర్డుకు ఈ నెల 27న లేఖ రాశారు.


1.37 లక్షల ఎకరాల పంటలపై ప్రభావం

* కేసీ కాల్వ పరిధిలో కర్నూలు, కల్లూరు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, పాములపాడు, వెలుగోడు, గడివేముల, బండిఆత్మకూరు, మహానంది, నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, రుద్రవరం, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దొర్నిపాడు మండలాలున్నాయి.  ఆయా మండలాల పరిధిలోని 259 గ్రామాల్లో రైతులు రబీలో 1.37 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఏప్రిల్‌ వరకు నీరు అందితేనే వరి చేతికొస్తుంది.

* శ్రీశైలం వెనుక జలాల నుంచి కేసీ కాల్వకు ప్రస్తుతం నీరు అరకొరగానే అందుతోంది. ముచ్చుమర్రి, మల్యాల నుంచి నీటిని ఎత్తిపోయాలంటే శ్రీశైలం జలాశయంలో 810 అడుగుల మేర నీటి మట్టం ఉండాలి. ప్రస్తుతం 840 అడుగుల్లో నీటి నిల్వ ఉంది. 30 అడుగులు తగ్గితే తుంగభద్ర కోటాలో మిగిలిన 4.868 టీఎంసీలపై ఆధారపడాలి. ఇందులో కర్నూలు నగర తాగునీటి అవసరాలకు పోనూ, మిగిలిన నీటిని పంటలకు ఏప్రిల్‌ వరకు ఇవ్వడం గగనమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని