logo

వెలుగునివ్వని ఆస్పత్రి

పేరొందిన కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాలలో సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ఒకప్పుడు వేలాది మందికి వెలుగు పంచిన ఆస్పత్రి నేడు మసకబారుతోంది.

Published : 29 Jan 2023 04:25 IST

విలువైన యంత్రాలు ఇలా..

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : పేరొందిన కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాలలో సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ఒకప్పుడు వేలాది మందికి వెలుగు పంచిన ఆస్పత్రి నేడు మసకబారుతోంది. సీనియర్‌ వైద్యులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.


పర్యవేక్షణ కరవు..

కంటి ఆస్పత్రిలో నలుగురు ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా ఇటీవల వరకు ఎవరూ లేరు.. 15 రోజుల క్రితం ఒకరు వచ్చారు.. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుమారు 8 మంది అసిస్టెంట్లు ఉన్నారు. కర్నూలు సర్వజన ఆస్పత్రి పర్యవేక్షకుడే దీనికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సిబ్బందిపై పర్యవేక్షణ కరవైంది. ఎవరు విధులు నిర్వహిస్తున్నారు.. ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలియని పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆధునిక యంత్రాలు తీసుకొచ్చినా వాటిని మూలన పెట్టేయడం గమనార్హం.


తగ్గిన శస్త్రచికిత్సలు

గతంలో ఏటా సుమారు 10 వేల కంటి శస్త్రచికిత్సలు చేసేవారు.  గతేడాది సుమారు 6 వేల వరకు ఆపరేషన్లు జరిగాయి. వైద్యుల కొరత వేధిస్తుండటంతోపాటు కంటి శస్త్రచికిత్సలు పూర్తిస్థాయిలో చేయకపోవడంతో చాలామంది ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో వైద్యం చేయించుకొనేందుకు వెళితే అవి లేవని.. ఇవి లేవని తిప్పుతుండటంతో..  తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. సీనియర్‌ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో కార్నియా శస్త్రచికిత్సలు చేయడం లేదు. పీజీ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారే కరవయ్యారు.


గత ప్రభుత్వ హయాంలో రూ.5 కోట్లు

* కర్నూలు ప్రాంతీయ కంటి వైద్యశాలల.. వైద్య కళాశాలకు అనుబంధంగా ఆరు దశాబ్దాలుగా వేలాది మందికి సేవలందిస్తోంది. ఏటా సుమారు 10 వేల కంటి శస్త్రచికిత్సలు, 60 వేల ఓపీ, పది వేల ఐపీతో నిత్యం రద్దీగా ఉంటుంది.

* తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ విభాగానికి రూ.5 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. వైకాపా ప్రభుత్వం రావడంతో అది పూర్తిగా అటకెక్కింది.


ఏళ్లుగా ఇన్‌ఛార్జి పాలన..

ప్రాంతీయ కంటి ఆసుపత్రికి పర్యవేక్షకులుగా అర్హులైన సీనియర్‌ వైద్యులు భరణీకుమార్‌రెడ్డి, రేవతి ఉన్నప్పటికీ వారు ఆ పదవి వద్దని చెప్పడంతో డాక్టర్‌ నరేంద్రనాథ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ప్రాంతీయ కంటి ఆసుపత్రి పర్యవేక్షకుడిగా డాక్టర్‌ సుధాకర్‌ పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన నాటి నుంచి ఈయనే ఉన్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ పోస్టులో ఉన్నారు. ఈయనే సర్వజన ఆస్పత్రి పర్యవేక్షకుడిగానూ.. కంట్రి ఆస్పత్రి ఇన్‌ఛార్జిగానూ కొనసాగుతున్నారు.

* హెచ్‌డీఎస్‌, ఆరోగ్యశ్రీ నిధుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్లు వెచ్చించి తీసుకొచ్చిన విలువైన పరికరాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రోగులకు సేవలందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా వీటికి పట్టలు కప్పేసి మూలన పడేశారు.

* ఆసుపత్రి అభివృద్ధికి ఏటా నిధులు వస్తున్నా.. కనీసం సమావేశం నిర్వహించి పలు తీర్మానాలు చేయడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. గత కొన్నేళ్లుగా  ఆడిటింగ్‌ లేకపోవడంతో నిధుల ఖర్చుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని