logo

గుమ్మం దాటని బిల్లు

సొంత ఇంట్లోకి వెళ్దామన్న లబ్ధిదారుల ఆశ నెరవేరడం లేదు. నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు మంజూరు కావడం లేదు.

Published : 29 Jan 2023 04:25 IST

అసంపూర్తిగా టిడ్కో గృహాలు

నిలిచిన నిర్మాణాలు

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: సొంత ఇంట్లోకి వెళ్దామన్న లబ్ధిదారుల ఆశ నెరవేరడం లేదు. నిర్మాణ పనులు చేపట్టిన గుత్తేదారులకు బిల్లులు మంజూరు కావడం లేదు. పనులు కదలక రూ.కోటికి పైగా విలువైన సామగ్రి తుప్పు పడుతోంది. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలక సంఘాల్లో టిడ్కో నివాసాల గుత్తేదారులకు పూర్తిస్థాయిలో బిల్లులు రాక పడిగాపులు కాస్తున్నారు. నాలుగు పురపాలక సంఘాల్లో 300, 365, 430 చ.అ మూడు విభాగాల్లో కలిపి 30 వేల వరకు నివాసాల నిర్మాణాలు చేపట్టారు. ఇందుకు దాదాపు రూ.1600-1800 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందులో లబ్ధిదారుల వాటా రూ.150-200 కోట్లు ఉంటుంది... ప్రస్తుతం 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. చివరి దశకు వచ్చే సరికి ప్రభుత్వాలు మారిపోవడంతో నిర్మాణాల్లో జాప్యం ఏర్పడుతూ వచ్చింది.


గుత్తేదారులకు నిర్వహణ భారం

నిర్మాణ వ్యయంలో గుత్తేదారులకు 30 శాతానికి పైగా బిల్లులు రావాల్సి ఉంది.  ఇళ్లు పూర్తికాకపోవడం, బిల్లులు అందని వింత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఒక్కో నివాస ప్రాంగణాల్లో సుమారు రూ.కోటికి పైగా విలువైన నిర్మాణ సామగ్రి తెచ్చి పెట్టారు. వీటిని తరలించలేని పరిస్థితి. ఉద్యోగుల కోసం నివాసాలు, రక్షణ సిబ్బంది ఏర్పాట్లు, వాహనాలు, ఇంధన ఖర్చులు, విద్యుత్తు బిల్లులు, రోజు వారీ నిర్వహణ ఖర్చులు, సిబ్బంది వేతనాలు కలిపి సుమారు నెలకు ఒక్కో గుత్తేదారు రూ.4-5 లక్షలకు భరిస్తున్నారు. కేవలం విద్యుత్తు బిల్లులకే నెలకు రూ.లక్ష వెచ్చిస్తుండటం గమనార్హం.


రంగులు వేసేందుకు రూ.10 కోట్లు

ఇళ్ల పంపిణీ పేరుతో ఇటీవల పాత రంగులు తొలగించి.. కొత్తవి వేసేందుకని రూ.కోట్లు వెచ్చించారు. ఒక్కో పురపాలికలో సుమారు రూ.10-15 కోట్లు రంగుల మార్పు కోసం అదనంగా ఖర్చు చేశారు. వీటి బిల్లుల పరిస్థితి ఏంటోనని గుత్తేదారులు అయోమయం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు పూర్తికాక, బిల్లుల  మంజూరు కాక పేదల సొంతింటి కల నెరవేరడం లేదు. ప్రభుత్వ ధోరణితో అందరూ ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని