logo

కుట్రతో ఎస్టీ జాబితా నుంచి తొలగించారు

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బోయ.. వాల్మీకులు అధికంగా ఉన్నారు.. రాజకీయ కుట్రతో బీసీగా చూపడం అన్యాయం.. విద్య, ఉద్యోగావకాశాలు లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని బోయ, వాల్మీకి సంఘాలకు చెందిన ప్రతినిధులు ఏకసభ్య కమిషన్‌ ఎదుట వాపోయారు.

Updated : 31 Jan 2023 05:58 IST

రాజకీయ ప్రాధాన్యం లేకపోవడం విచారకరం
ఏకసభ్య కమిషన్‌ ఎదుట బోయ, వాల్మీకి సంఘాల నేతల ఆవేదన

మాట్లాడుతున్న విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌,

పక్కన కలెక్టర్‌ కోటేశ్వరరావు తదితరులు

కర్నూలు నగరం , న్యూస్‌టుడే :  కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బోయ.. వాల్మీకులు అధికంగా ఉన్నారు.. రాజకీయ కుట్రతో బీసీగా చూపడం అన్యాయం.. విద్య, ఉద్యోగావకాశాలు లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని బోయ, వాల్మీకి సంఘాలకు చెందిన ప్రతినిధులు ఏకసభ్య కమిషన్‌ ఎదుట వాపోయారు. ఎస్టీ హోదా కల్పిస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని విన్నవించారు. బోయ, వాల్మీకి వర్గాలకు చెందినవారి ఆర్థిక, జీవన స్థితులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వ నియమించిన ఏకసభ్య కమిషన్‌.. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ సోమవారం సాయంత్రం కర్నూలులోని జడ్పీ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ చేపట్టారు. సంఘం ప్రతినిధులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. తమకు రాజకీయంగా ప్రాధాన్యం లేకపోవడం విచారకరమని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా పరంగా ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో సరిపెట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. గతంలో జరిగిన రాజకీయ కుట్రతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, దీనివల్ల ఇతర కులస్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. పొరుగు రాష్ట్రంలో వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తున్నారు.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని డా.భవానీ ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో పేదరికం, ఆర్థిక సమస్యలతో పలువురు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గిరిజన సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆనంద్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బోయ వాల్మీకి వర్గాల స్థితిగతులను క్షుణ్నంగా పరిశీలించేందుకు తాను పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కోటేశ్వరరావు, అనంతపురం ఎంపీ రంగయ్య, కర్నూలు ఆర్డీవో హరిప్రసాద్‌, బీసీ సంక్షేమ అధికారిణి వెంకట లక్ష్మమ్మ, వాల్మీకి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మధుసూదన్‌, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని