logo

పుర దస్త్రాల్లో అవినీతి పుటలు

నంద్యాల పురపాలక పట్టణ ప్రణాళిక విభాగంలో చోటుచేసుకున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించింది. రెండ్రోజుల పాటు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు.

Published : 31 Jan 2023 02:12 IST

స్వాధీనం చేసుకున్న అనిశా అధికారులు
నంద్యాల మున్సిపల్‌ సిబ్బంది గుండెల్లో గుబులు
న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్న అనిశా అధికారులు

నంద్యాల పురపాలక పట్టణ ప్రణాళిక విభాగంలో చోటుచేసుకున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ దృష్టి సారించింది. రెండ్రోజుల పాటు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. పద్మావతి నగర్‌, ఆర్‌ఎస్‌.రోడ్డు, టీటీడీ రోడ్డు, ఎస్బీఐ కాలనీ, జ్ఞానాపురం తదితర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన వివరాలు సేకరించి పది దస్త్రాలు తమ వెంట తీసుకెళ్లారు. వాటిలో ప్రత్యేకించి గతంలో విజిలెన్సు దాడుల్లో వెలుగులోకి వచ్చిన అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు తెలిసింది.

క్రమశిక్షణ చర్యల దిశగా అడుగులు

నంద్యాల పురపాలక సంఘంలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకుల అండతో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిపై చర్యలకు అనిశా అధికారులు మున్సిపల్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. పట్టణంపై గట్టి పట్టున్న సదరు ఉద్యోగి అక్రమ నిర్మాణాలకు అడ్డుచెప్పకుండా మరింత ఊతమిచ్చే విధంగా ప్రవర్తించారన్నది ప్రధాన ఆరోపణ.

అక్రమ పునాదులకు అధికారం అండ

అక్రమ నిర్మాణాల వెనుక పుర కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఇద్దరు నాయకుల అండ ఉంది. అనుమతులు ఒకరంగా పొంది మరోరకంగా నిర్మాణాలు జరిగాయి. పద్మావతినగర్‌లో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి ఆసుపత్రి నిర్మాణం ఇలానే జరిగింది. అనిశా అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ‘‘ ఈ ప్రాంతంలో స్థలం ఖరీదు ఎక్కువగా ఉంది.. నిబంధనల ప్రకారం నిర్మిస్తే రూ.కోట్లలో నష్టపోయే పరిస్థితి ఉంది.. అందుకే ఆకృతి మార్చి నిర్మాణం చేపట్టినట్లు’’ యజమాని అధికారులకు స్పష్టం చేయడం గమనార్హం. అదేవిధంగా పద్మావతినగర్‌ ప్రధాన రహదారిలో ఉన్న మరో రెండు ఆసుపత్రుల భవనాలు అక్రమంగా నిర్మించినట్లు తేల్చారు. వీటికి ఇప్పటి వరకు పుర అధికారులు తాఖీదులు జారీ చేయకపోవడం కొసమెరుపు.


పైసలివ్వలేదని పక్కన పెట్టేశారు

సర్వే విభాగంలో సుమారు 30కి పైగా దస్త్రాలు అపరిష్కృతంగా పేరుకుపోయాయి. యజమానులు ఎలాంటి ముడుపులు ఇవ్వకపోవడంతో కొలతలు వేయకుండా పుర సిబ్బంది పక్కన పెట్టినట్లు అనిశా అధికారులు గుర్తించారు.

నిర్ణీత గడువు దాటినా 90కి పైగా దస్త్రాలు పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్‌లో పెట్టారు. ఉద్దేశపూర్వకంగానే అధికారులు వీటిని పక్కన పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై అనిశా అధికారులు నివేదిక తయారు చేసుకున్నారు.

నివాసగృహాల కింద అనుమతులు తీసుకుని 27 చోట్ల దుకాణ సముదాయాలు నిర్మించారు. వీటి వివరాలు పరిశీలించారు. టెక్కె, సలీంనగర్‌, చాంద్‌బాడా, ఎస్బీఐ కాలనీ, ఎన్జీవో కాలనీ, పశువుల ఆసుపత్రి సమీపంలో, ఆర్‌ఎస్‌.రోడ్డు, ఎన్జీవో కాలనీలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. ఇవన్నీ అక్రమమే అయినా అధికారులు నోటీసులు ఇవ్వకపోవడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు