logo

నిత్యం రూ.8 లక్షలు.. నెలకు రూ.2.40 కోట్లు

ఉమ్మడి జిల్లాలో 70కిపైగా గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి నెలా 6.90 లక్షల సిలిండర్ల (వాయుబండల) వినియోగం జరుగుతోంది.

Updated : 01 Feb 2023 05:39 IST

ఆగని గ్యాస్‌ ఏజెన్సీల సిబ్బంది వసూళ్లు
నిరాకరిస్తే సిలిండర్లు ఇవ్వని వైనం
న్యూస్‌టుడే - కర్నూలు సచివాలయం

ఉమ్మడి జిల్లాలో 70కిపైగా గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి నెలా 6.90 లక్షల సిలిండర్ల (వాయుబండల) వినియోగం జరుగుతోంది. 14.2 కిలోల సిలిండరు ధర రూ.1,055.24. కేంద్ర పన్ను రూ.26.38, రాష్ట్ర పన్ను రూ.26.38 కలిపి మొత్తం రూ.1,108.00 తీసుకోవాల్సి ఉంది.

ఏజెన్సీల పరిధిలో పని చేస్తున్న సిబ్బంది ఇంటింటికి చేరవేస్తున్నారు. ఒక్కో వ్యక్తి 30-40 సిలిండర్ల వరకు సరఫరా చేస్తున్నారు. ఒక్కోదానికి రూ.30 మొదలు రూ.40, రూ.50 వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.100 వరకు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నెలకు 6.90 లక్షల సిలిండర్ల వినియోగం ఉండగా రోజుకు 23,000 వరకు సరఫరా చేస్తున్నారు. 80 శాతం పైబడి సిలిండర్లకు రూ.40 చొప్పున రూ.8 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. ప్రతి నెలా రూ.2.40 కోట్లు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.

11.95 లక్షల కుటుంబాలు.. 11.56 లక్షల కనెక్షన్లు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 11.95 లక్షల కుటుంబాలున్నాయి. ఇందులో 11.56 లక్షల కుటుంబాలు వంట గ్యాస్‌ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లు 52,089 వరకు ఉన్నాయి. దీపం కనెక్షన్లు 3,93,820 ఉండగా, సాధారణ కోటాలో 7,00,495 కుటుంబాలు సిలిండర్లు తీసుకున్నాయి. వినియోగదారులకు సిలిండర్లు సరఫరా చేసేందుకు గ్యాస్‌ అధీకృత డీలర్లు సిబ్బందిని నియమించుకున్నారు. వీరికి ఎలాంటి వేతనాలు ఇవ్వకపోవడంతో వినియోగదారుల వద్ద వసూలు చేస్తున్నారు.

మితిమీరిన సిబ్బంది ఆగడాలు

* సిలిండర్‌ తీసుకొచ్చినందుకు రూ.50 ఇవ్వాలని నగరంలోని ఓ ఏజెన్సీకి చెందిన సిబ్బంది డిమాండ్‌ చేశారు. వినియోగదారుడు రూ.30 ఇస్తామంటే.. అయితే గోదాముకు వెళ్లి తెచ్చుకోండని.. లేకుంటే ఏజెన్సీని మార్చుకోమని వినియోగదారుడితో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. అదనపు డబ్బు ఎందుకు ఇవ్వాలని వినియోగదారుడు ప్రశ్నిస్తే ఆ తర్వాతి నెలలో జాప్యం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆన్‌లైన్‌లో రుసుము ముందస్తుగానే చెల్లించినప్పటికీ. అదనంగా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు.
* నగరంలో, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు వెలిశాయి. పైకి వెళ్లి చేర్చేందుకు తప్పనిసరిగా అదనపు రుసుము వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే అపార్ట్‌మెంట్‌ కింద పెట్టేసి వెళ్తున్నారు. డోర్‌ లాక్‌ ఉన్న ఇళ్లకు డెలివరీ చేసే వాయుబండలను రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా తీసుకుని ఇతరులకు విక్రయిస్తున్నారు. హోటళ్లు, వ్యాపార వాణిజ్య దుకాణాలకు ఈ రాయితీ సిలిండర్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ట్రాలీ ఆటోను కూడా డెలివరీ బాయ్‌లే పెట్టుకొని ఈ దందా సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నేతల కనుసన్నల్లో ఏజెన్సీలు

రాజకీయ నేతల కనుసన్నల్లోనే గ్యాస్‌ ఏజెన్సీలు ఉన్నాయి. అంతా వారు చెప్పినట్లే నడుస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు గ్యాస్‌ ఏజెన్సీలను తనిఖీలు చేసిన దాఖలాలే లేవు. వారి వద్దకు వెళ్లేందుకు అధికారులు వెనకాడుతున్నారు. నగరంలో ఏ శుభకార్యం జరిగినా మా గ్యాస్‌ ఏజెన్సీకి చెందిన సిలిండర్లే తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్న సంఘటనలు లేకపోలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు గ్యాస్‌ ఏజెన్సీల డీలర్ల ఆగడాలు మితిమీరిపోయాయి. అదనపు రుసుము వసూలు చేస్తున్నారని వినియోగదారులు డీలర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. 

ఫోన్లో ఫిర్యాదు చేయొచ్చు

ఎల్‌పీజీ సిలిండర్‌ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని, అదనంగా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటనలు చేస్తున్నా ఎక్కడా అమలుకావడం లేదు. నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే కాల్‌ సెంటర్‌ 1967, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోని టోల్‌ఫ్రీ నంబరు 1800 2333555కు ఫిర్యాదు చేయొచ్చు. ‘‘ ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. డెలివరీ బాయ్‌లు అదనపు రుసుము వసూలు చేయకుండా చూడాలని పలుమార్లు ఏజెన్సీల నిర్వాహకులకు సూచించాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని’’ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజా రఘువీర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని