logo

మూడు రాజధానుల పేరుతో చిచ్చు

మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర పన్నుతున్నారని మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌ అన్నారు.

Published : 02 Feb 2023 03:16 IST

మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్ర పన్నుతున్నారని మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌ అన్నారు. బుధవారం కర్నూలు నగరం సంకల్‌బాగ్‌లోని వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు పరిధిలో రాజధాని అంశం ఉండగానే, విశాఖను రాజధానిగా ప్రకటించారన్నారు. కర్నూలులో హైకోర్టు విషయంపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం రాయలసీమవాసుల్ని మోసం చేయడమే అన్నారు. రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు రాలేదు, బెంచీ ఇవ్వలేదు. సీమ ప్రజలకు అమరావతే దూరమంటే, విశాఖ మరింత ప్రయాణభారమవుతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం రాయలసీమ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేశామని, రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కర్నూలు హైకోర్టు బెంచీ ఇస్తామని చెప్పారన్నారు. అది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టులో మాత్రం కర్నూలులో హైకోర్టు ప్రతిపాదన విరమించుకున్నట్లు ప్రకటించి, సీమవాసుల్ని మళ్లీ మోసం చేశారన్నారు. అభివృద్ధి లేక రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో నష్టపోయిందన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం విద్యార్ధి దశలో తామూ పోరాటం చేశామన్నారు. కర్నూలులో వింటర్‌ కేపిటల్‌ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు. పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయాల్సింది పోయి, ఒక ప్రాంతానికే పరిమితం కావడం అన్యాయమన్నారు. రాయలసీమ ప్రాంత వాసుల్ని పిల్లిలా చూస్తే, అవే పిల్లులు సింహాలుగా మారి ఉద్యమం చేస్తాయని హెచ్చరించారు. మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని