logo

సంగమేశ్వరుని దర్శనం.. సకల పాపహరణం

ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపదారు లింగం బుధవారం భక్తులకు దర్శనమిచ్చింది. ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే సంగమేశ్వరుని దర్శన భాగ్యం లభిస్తుండటంతో ఈ ఆలయ సందర్శనకు భక్తులు ఎదురు చూస్తుంటారు.

Published : 02 Feb 2023 03:35 IST

వెనుక జలాల నుంచి పూర్తిగా బయటపడ్డ  కోవెల
ఆరు నెలల తర్వాత తొలిపూజ అందుకున్న  స్వామివారు
న్యూస్‌టుడే, నందికొట్కూరు గ్రామీణ, కొత్తపల్లి

తొలిపూజ అందుకున్న సంగమేశ్వరుడు... ఆలయంలో బురదను శుభ్రం చేస్తున్న భక్తులు

ర్మరాజు ప్రతిష్ఠించిన వేపదారు లింగం బుధవారం భక్తులకు దర్శనమిచ్చింది. ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే సంగమేశ్వరుని దర్శన భాగ్యం లభిస్తుండటంతో ఈ ఆలయ సందర్శనకు భక్తులు ఎదురు చూస్తుంటారు. బుధవారం భీష్మ ఏకాదశి సందర్భంగా లలితాదేవి సమేత సంగమేశ్వరస్వామి, వినాయకుడు, తదితర దేవతామూర్తులు తొలిపూజ అందుకున్నారు.


సప్తనదీ సంగమ ప్రాంతంలోని సంగమేశ్వర ఆలయం శ్రీశైల జలాశయం వెనుక జలాల నుంచి పూర్తిగా బయటపడింది. జులై మూడో వారంలో వరద పోటెత్తడంతో ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. సుమారు 6 నెలల తర్వాత పూర్తిగా దర్శనమిస్తోంది. నీరు తగ్గుముఖం పట్టడంతో బుధవారం పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో భక్తులు ఆలయాన్ని శుభ్రం చేశారు. పూజలు పునః ప్రారంభించారు.

నాడు వైభవం.. నేడు శిథిలం

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శిథిలం కావడంతో.. ప్రస్తుతం కనిపిస్తున్న గుడిని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. పూర్వం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గుడితో పాటు చుట్టూ ప్రకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే వెల్లడవుతుంది. ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలు అందుకుంటున్నారు. శివుడి వెనుకవైపున ఎడమ భాగంలో లలితాదేవి, కుడివైపు వినాయకుడు దర్శనమిస్తారు. శ్రీశైలం జలాశయం నిండితే ఈ ఆలయం పూర్తిగా జలాధివాసంలోకి వెళ్లిపోతుంది. అందుకే ఇక్కడ నిత్యం పూజలు జరగవు. ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే స్వామివారు పూజలు అందుకుంటారు. ఈ ఏడాది శ్రీశైల జలాశయం నీటిమట్టం త్వరగా తగ్గడంతో సంగమేశ్వరుడి దర్శన భాగ్యం త్వరగా లభించిందని భక్తులు చెబుతున్నారు. ఈ ఏడాది 6 నెలల పాటు ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని