logo

కుడా చెప్పిందే దిక్కు

ఏళ్లుగా చేస్తున్న కసరత్తులో భాగంగా కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ (కుడా) తన పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కలిపి జిల్లా కేంద్రం నంద్యాల మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది.

Published : 02 Feb 2023 03:35 IST

మున్సిపాల్టీలో అతికించిన ముసాయిదా మ్యాపులు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఏళ్లుగా చేస్తున్న కసరత్తులో భాగంగా కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ (కుడా) తన పరిధిలోకి వచ్చే ప్రాంతాలను కలిపి జిల్లా కేంద్రం నంద్యాల మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది. దీనిపై గత నెల 15 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఎక్కడా లేని విధంగా 300కు పైగా అభ్యంతరాలొచ్చాయి. నెల క్రితం మున్సిపాల్టీ వద్ద ముసాయిదా మ్యాపులు అతికించి జనవరి నుంచి అమలు చేస్తామన్నారు. ఇప్పటి వరకు ప్రకటన ఇవ్వలేదు. కనీసం సర్వే నంబర్ల వివరాలతో కూడిన సాఫ్ట్‌ కాపీ మున్సిపాల్టీకి ఇవ్వలేదు. ప్రజల అభ్యంతరాలపై ఇప్పటి వరకు పట్టించుకోలేదు.

పుర అధికారులకే తెలియదు

మాస్టర్‌ ప్లాన్‌ అంటే పట్టణ స్వరూపం, విస్తరణ, భవిష్యత్తు అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి. నివాసిత, వాణిజ్య, పరిశ్రమలు, చిన్న, కుటీర పరిశ్రమలు, చెరువులు, కాలువలు, నీటి వనరులు ఉన్న ప్రాంతాలతో పాటు పచ్చదనం ఉండేలా గ్రీన్‌ జోన్లు గుర్తిస్తారు. సర్వే నంబర్ల వారీగా అందరికీ తెలిసేలా ఉంచాలి. కొత్తగా రూపొందించిన ముసాయిదా మాస్టర్‌ ప్లాన్‌ మ్యాప్‌ గురించిన వివరాలు నంద్యాల మున్సిపాల్టీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోని అధికారులు, సిబ్బందికి తెలియడం లేదు. కేవలం మున్సిపాల్టీలో అతికించిన మ్యాపు ఆధారంగానే అంచనాలు వేయడం గమనార్హం.


ఇష్టానుసారంగా తయారీ

* మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించడంలో స్థానిక భాగస్వామ్యం కచ్చితంగా ఉండాలి. కుడా కన్సల్టెంట్లు ఇస్టానుసారంగా తయారు చేశారు. ఎక్కడపడితే అక్కడ రహదారులను చూపించడం విమర్శలకు తావిస్తోంది. ఇళ్లు ఉన్న ప్రాంతాలను పరిశ్రమలు, ట్రాన్స్‌పోర్టు జోన్లుగా, పచ్చదనం ప్రాంతాలుగా చూపారు. వీటిని మార్చకపోతే ప్రజలకు ఇబ్బందులు తప్పవు.

* 1990లో నంద్యాల మాస్టర్‌ ప్లాన్‌ రూపుదిద్దుకుంది. అప్పటి నిబంధనల ప్రకారం 20 ఏళ్ల తర్వాత కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపుదిద్దుకోవాల్సి ఉండగా.. గత 13 ఏళ్లుగా కన్సల్టెన్సీ ఎంపికలో ఆలస్యం కావడం, ఒప్పందం కుదుర్చుకున్న కన్సల్టెన్సీ సంస్థ వెనక్కి పోవడం, నిర్లక్ష్యం తదితర కారణాలతో 13 ఏళ్ల తర్వాత కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా బయటకు వచ్చింది.

* ప్లాన్‌ రూపుదిద్దుకోవడంలో కొంత మంది పరోక్షంగా ప్రభావం చూపారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక బృందంగా కూర్చుని రూపుదిద్దుకోవాల్సిన ప్లాన్‌పై కొంత మంది నాయకుల ప్రభావం ఉందనే విమర్శలు   వినిపిస్తున్నాయి.


ఇలా ఉంది తీరు

* నంద్యాల పట్టణ శివారులో ఆటోనగర్‌ ప్రాంతం సమీపంలోని కొంత ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా చూపారు. ఇక్కడ భారీగా వెంచర్లతో పాటు కొన్ని చోట్ల ఇళ్లు ఉన్నాయి.

* పట్టణంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో కాలనీలు వెలుస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని ట్రాన్స్‌పోర్టు ఏరియాగా పేర్కొన్నారు. ఇక్కడ భవిష్యత్తులో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు రావు. స్థలాలు ఉన్నవారు వాహనాలను పెట్టుకోవడానికి, సర్వీసింగ్‌ సెంటర్లు పెట్టుకోవడానికి ఇవ్వాల్సి ఉంటుంది.

* నంద్యాల పట్టణ శివార్లలోని చాబోలు-రైతునగరం గ్రామ సమీపంలోని ప్రాంతాన్ని పారిశ్రామిక జోన్‌గా చూపారు. ఇక్కడ వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. పెద్ద భవంతుల నిర్మాణాలు జరుగుతున్నా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికవాడగా చూపడంతో విమర్శలు ఎక్కువగా వచ్చాయి.  

* పబ్లిక్‌ యుటిలిటిస్‌ యూజ్‌ జోన్‌గా చెరువుకట్ట ప్రాంతాన్ని మ్యాప్‌లో చేర్చారు. ఇప్పటికే ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. జగజ్జననీ నగర్‌ ఆనుకుని పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగిపోయాయి. చెరువు కట్ట సమీపంలో నూతనంగా ఇళ్ల నిర్మాణంతో పాటు లేఅవుట్‌లకు భారీగా అనుమతులు ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని మరో ప్రాంతంగా ప్రస్తుతం చూపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని