logo

అవినాష్‌రెడ్డిని కాపాడేందుకు సీఎం ప్రయత్నం

ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారణ నుంచి తప్పించడానికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారని తెదేపా కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు.

Published : 02 Feb 2023 03:35 IST

మాట్లాడుతున్న సోమిశెట్టి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారణ నుంచి తప్పించడానికి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి విశ్వప్రయత్నం చేస్తున్నారని తెదేపా కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తెస్తుండటంతో, ముఖ్యమంత్రి విశాఖ వ్యవహారం తెరపైకి తెచ్చారన్నారు. జగన్‌ అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. బాబాయి కేసులో నిందితులను కాపాడేందుకు దిల్లీలో జగన్‌ పైరవీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీకి మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా రాష్ట్ర రాజధానిని విశాఖపట్నానికి మారుస్తానని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌ తన సొంత ప్రయోజనాల కోసం, అవినాష్‌రెడ్డిని హత్య కేసు నుంచి తప్పించడానికి, తనను తాను కాపాడుకోవడానికే దిల్లీ వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హత్య కేసును త్వరగా తేల్చాలని జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల   సీబీఐను కోరారన్నారు. ఈ కేసుకు న్యాయం చేయాలని, ఇందులో ఎవరు ఉన్నారో సీబీఐ వారు బయటకు తీసి శిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. నిందితులు ఎంత పెద్దవారైనా లోపల వేయాలని, లేకపోతే ప్రజలు సీబీఐని నమ్మే పరిస్థితి ఉండదన్నారు.  ఎలాంటి ఇబ్బంది లేదని వైకాపా నాయకులు చెప్తుంటే, భాజపా నాయకులు ఎందుకు స్పందించడం లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని