logo

వేధింపులే పాఠాలు

బొట్టు.. గోరింటాకు పెట్టుకుంటే జరిమానా.. వ్యక్తిగత సేవకు రాకుంటే ఫెయిల్‌ చేస్తామని శిక్షణకు వచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపల్‌ వేధించడంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది.

Published : 02 Feb 2023 03:35 IST

ప్రాంతీయ శిక్షణ కేంద్రం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే : బొట్టు.. గోరింటాకు పెట్టుకుంటే జరిమానా.. వ్యక్తిగత సేవకు రాకుంటే ఫెయిల్‌ చేస్తామని శిక్షణకు వచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపల్‌ వేధించడంతో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌గా శిక్షణ ఇస్తున్నారు. కోర్సుకు ప్రిన్సిపల్‌, వార్డెన్‌గా వ్యవహరిస్తున్న విజయ సుశీల ఆగడాలు పెరగడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆమెకు ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్‌ డాక్టర్‌ లక్ష్మీనర్సయ్య తాఖీదులు జారీ చేశారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ రామగిడ్డయ్య విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించి ప్రిన్సిపల్‌తో పరిస్థితులపై ఆరా తీశారు.

సిబ్బంది ఎక్కువ.. పని తక్కువ

ప్రాంతీయ శిక్షణ కేంద్రం( మేల్‌, ఫిమేల్‌) 1973లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎంపీహెచ్‌డబ్ల్యూవో రెండు సంవత్సరాల శిక్షణ కోర్సు ఇస్తున్నారు. సుమారు 30 మంది విద్యార్థులున్నారు. ఐపీపీ స్కీమ్‌ కింద 17 మంది, ఎల్‌హెచ్‌వీ స్కీమ్‌ కింద 17 మంది, ఎంపీహెచ్‌డబ్ల్యూ స్కీమ్‌ కింద 20 మంది అంటే మొత్తం 54 మంది పనిచేస్తున్నారు. వీరి వేతనాలు నెలకు రూ.40 లక్షల చొప్పున ఏడాదికి రూ.4.8 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

జరుగుతున్న తీరు ఇది..

ఫిమేల్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూవో శిక్షణ కొనసాగుతోంది. మిగతా శిక్షణ కార్యక్రమాలు జరగడం లేదు. మేల్‌లో హెల్త్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ 1994లో నిలుపుదల చేశారు. సిబ్బంది ఉదయం వచ్చి సంతకాలు చేసి సాయంత్రానికి వెళ్లిపోతున్నారు. ప్రిన్సిపాళ్లు వారానికి రెండు, మూడు రోజులే వచ్చి సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం వీరిని ఇతర విభాగాలకు వినియోగించకుండా కూర్చుని వేతనాలు ఇస్తున్నారు. మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌గా శిక్షణ కోర్సుకు ప్రిన్సిపల్‌, వార్డెన్‌గా విజయ సుశీల వ్యవహరిస్తున్నారు.  ఇద్దరు యువతులు ఉరేసుకునేందుకు యత్నించారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అధికారులు సెలవులిచ్చి విద్యార్థినులందరినీ ఇంటికి పంపేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని