logo

సీతమ్మ పద్దులో సిరుల పంట

ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్‌ 2023-24ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.

Updated : 02 Feb 2023 09:55 IST

చిరుధాన్యాల సాగుకు శ్రీఅన్న పథకం

ఈనాడు-కర్నూలు, కర్నూలు సచివాలయం-న్యూస్‌టుడే: ఎన్నో ఆశలు, అంచనాల మధ్య కేంద్ర బడ్జెట్‌ 2023-24ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. సమ్మిళత అభివృద్ధి, చిట్టచివరి వ్యక్తికి సత్ఫలితాలు అందడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి, హరిత వృద్ధి, ప్రజల శక్తి సామర్థ్యాలు వినియోగించుకోవడం, యువశక్తిని ప్రోత్సహించడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం వంటి ఏడు అంశాలు ప్రాధామ్యాలుగా బడ్జెట్‌ను పెట్టినట్లు ఆమె తెలిపారు. సేంద్రియ సాగు, చిరుధాన్యాలు, ఉద్యాన సాగుకు ప్రోత్సాహకాలు రైతులను ఆకట్టుకునేలా ప్రకటించారు. ఆదాయ పన్ను విధానంలోనూ పరిమితి పెంచి మధ్య తరగతికి ఊరటనిచ్చారు.


మహిళా పొదుపు పథకం

‘మహిళా సమ్మాన్‌ బచత్‌ పత్ర’ పొదుపు పథకాన్ని బడ్జెట్‌లో ప్రకటించారు. ఇది వన్‌ టైమ్‌ చిన్న మొత్తాల పొదుపు పథకం. రెండేళ్ల కాలపరిమితి అందుబాటులో ఉంటుంది. 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అవసరమైనప్పుడు పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 16.50 లక్షలకుపైగా మహిళలు, యువతులు ఉన్నారు. ప్రస్తుతం పొదుపు సంఘాల్లో ఆరు లక్షల మంది మహిళలకుపైగా ఉన్నారు. వీరందరికీ ఈ పథకం ఆసరాగా నిలవనుంది.


గిరి పుత్రుల మిషన్‌

గిరిజన మిషన్‌ కోసం రూ.10 వేల కోట్లు, గిరిజన గ్రామాల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయించారు. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 171 చెంచు గూడేల్లో 7 వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. గిరిజనులకు ఏటా బడ్జెట్‌ రూ.1-2 కోట్లు మాత్రమే విడుదల చేసేవారు. గిరిజన మిషన్‌ ఏర్పాటుతో ప్రతిపాదనలకు తగ్గట్లు ఏటా రూ.6 కోట్ల వరకు కేటాయించే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే ఫుడ్‌ బాస్కెట్‌లకు నిధులు సమకూరే అవకాశముంది. ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఐటీడీఏ పరిధిలో ఒక్క దోర్నాలలోనే ఏకలవ్య పాఠశాల ఉంది.


రాగులు.. కొర్రలు.. జొన్నలు

* జొన్న, రాగులు, సజ్జలు, కొర్రలు, ఊదలు వంటి పంటల విస్తీర్ణం పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఆయా పంటలను ప్రోత్సహించేందుకు ‘శ్రీఅన్న’ పథకానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. గత కొన్ని రోజుల ముందే మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాణ్యంకు చెందిన మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ చేస్తున్న రైతు రామసుబ్బారెడ్డిని అభినందించిన విషయం విదితమే.

* ఖరీఫ్‌, రబీలో కలిపి నంద్యాల జిల్లాలో జొన్న (23,368 హెక్టార్లు), సజ్జ (2630 హెక్టార్లు), కొర్రలు (732.17హెక్టార్లు) సాగు చేశారు. కర్నూలులో జొన్న (14,678 హెక్టార్లు), కొర్రలు (676 హెక్టార్లు), సజ్జలు (2,323 హెక్టార్లు) సాగవుతున్నాయి. అక్కడక్కడా రాగులు, సామలు, అరికెలు వంటి చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. కేంద్ర ప్రోత్సాహంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.


వేతన జీవులు.. మధ్యతరగతికి ఊరట

* వ్యక్తిగత ఆదాయ పన్ను విధానంలో పరిమితి పెంపుతో కీలక మార్పులు చేశారు. గతంలో రూ.5 లక్షల వరకు రిబేట్‌ ఇస్తుండగా, దాన్ని రూ.7 లక్షలకు పెంచుతూ బడ్జెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.7 లక్షలు దాటితే 5 శ్లాబుల్లో పన్ను విధించనున్నారు. పాత పన్ను విధానంలో ఉన్నవారు ఎప్పటిలాగే అందులో పొందుతున్న రాయితీలను కొనసాగించవచ్చు లేదా కొత్త పన్ను పరిధిలోకి రావొచ్చని కేంద్ర బడ్జెట్‌లో స్పష్టం చేయడంతో వేతన జీవులు, మధ్య తరగతి, వ్యాపార వర్గాలకు ఊరట కల్గించింది.


వ్యవసాయం

* కర్షకులకు రుణ సదుపాయం, మార్కెటింగ్‌, వ్యవసాయ స్టార్టప్స్‌కు చేయూత, ప్రత్యేక నిధి కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఏటా రూ.6 వేల కోట్ల రుణాలు అన్నదాతలకు అందిస్తున్నారు. పీఎం కిసాన్‌ కింద 5.47 లక్షల మందికి పెట్టుబడి సాయమందుతోంది.

* పత్తి సాగుకు పెరిగేలా మార్కెటింగ్‌ సదుపాయాలు ప్రత్యేకంగా కల్పించేలా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3.03 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. ప్రోత్సాహకాలు, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పిస్తే మరో 30 వేల హెక్టార్లు పెరిగే అవకాశాలున్నాయి.


పీఎం ఆవాస్‌ యోజనకు నిధులు

* పీఎం ఆవాస్‌ యోజన కింద గృహ నిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.79 వేల కోట్లు కేటాయించారు. కర్నూలు జిల్లా పరిధిలో 11 వేల మంది లబ్ధిదారులు సొంత స్థలాల్లో పీఎం ఆవాస్‌ యోజన కింద ఇంటి నిర్మాణాలు చేపట్టారు. ఇందులో కేంద్రం నేరుగా లబ్ధిదారుడికి రూ.1.50 లక్షలు ఇస్తుండగా, ఉపాధి హామీ పథకం కింద రూ.30 వేలు కేటాయిస్తున్నారు. నంద్యాల జిల్లా పరిధిలో 11,854 ఇళ్లు పీఎం ఆవాస్‌ యోజన కింద ప్రతిపాదించగా, ఇప్పటికే 8 వేల ఇళ్లు మంజూరు చేశారు.

* ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 19 వేల ఇళ్లకు బడ్జెట్‌ కేటాయింపులతో బిల్లులు త్వరతిగతిన అందనున్నాయి. శ్రీశైలం ఐటీడీఏ పరిధిలో 4,500 ఇళ్లు మంజూరుకానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని