logo

ఆలయ భూముల్లో అధికార దందా

‘అధికారం’ అండతో వైకాపా నేతలు ఆలయ భూముల్లో మట్టిని తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. గ్రామస్థులు ఆందోళన చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.

Published : 04 Feb 2023 03:52 IST

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
అడ్డుకుంటే కేసుల నమోదు

మట్టిని తరలించిన పొలాలను చూపుతున్న గ్రామస్థులు

ఓర్వకల్లు, కల్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘అధికారం’ అండతో వైకాపా నేతలు ఆలయ భూముల్లో మట్టిని తరలిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. గ్రామస్థులు ఆందోళన చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఓర్వకల్లు మండల పరిధిలోని శకునాలలో 155, 163 సర్వే నంబర్లలో కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయానికి 18 ఎకరాల మాన్యం భూమి ఉంది. పూజారులు ఆయా భూములు అనుభవిస్తూ ఆలయ నిర్వహణ చేపట్టాల్సి ఉంది. గ్రామానికి చెందిన రైతులకు కౌలుకు ఇచ్చి వచ్చిన సొమ్ముతో ఆలయ కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికార పార్టీ నేతలు ఆయా భూముల్లో అక్రమంగా మట్టిని తవ్వేసి ఎందుకూ పనికిరాకుండా చేస్తున్నారు.


నిత్యం 70 వాహనాల్లో తరలింపు

మట్టిని తీసుకెళ్తున్న వాహనాలు

మండలంలో సౌర పరిశ్రమ ఏర్పాటు చేశారు.శకునాల గ్రామంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను సదరు సంస్థ నిధులు మంజూరు చేసింది. సంబంధిత పనులకు కావాల్సిన మట్టిని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయానికి చెందిన 18 ఎకరాల్లో పొక్లెయిన్లు, టిప్పర్లు, ట్రాక్టర్లు పెట్టి తవ్వుతున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు దందా మొదలు పెట్టారు. టిప్పర్‌కు రూ.6,000, ట్రాక్టర్‌కు రూ.2,000 నుంచి రూ.2,500 వరకు అమ్ముకుంటున్నారు. టిప్పర్‌, ట్రాక్టర్లు కలిపి 70 వరకు వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. పెద్దఎత్తున మట్టిని తరలించడంతో ఎందుకూ పనికిరాకుండా పోయిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఐదారు అడుగులకుపైగా లోతున తవ్వి మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కల్లూరు మండల పరిధిలోని తడకనపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లోనూ మట్టిని పెద్దఎత్తున తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


అధికారులు పట్టించుకోవడం లేదు
- చంద్రబాబు, శకునాల

ఆలయానికి చెందిన భూముల్లో అక్రమంగా మట్టిని తరలించి వ్యవసాయానికి పనికి రాకుండా చేశారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యమే.  సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుని వారి ద్వారానే మట్టిని ఈ భూమిలోకి తరలించి వ్యవసాయానికి పనికి వచ్చేలా చేయాలి. గతంలో గ్రామానికి చెందిన రైతులు ఆలయ భూములను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం ఇవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి.


అడుగడుగునా గుంతలే
- ధర్మారెడ్డి, శకునాల

ఎంతో విలువైన భూమిని పనికిరాకుండా చేశారు. ఆలయ భూముల్లో అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి. మట్టి తరలించటంతో ఈ భూములను ఎవరూ కౌలుకు తీసుకోవటం లేదు. ఆలయ బాగోగులను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని