logo

కుట్టు వేయరు.. రూకలివ్వరు

కౌతాళం మండలం బదినేహాల్‌కు చెందిన సరోజ గతేడాది నవంబరులో ఆదోని ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స (కు.ని) చేయించుకున్నారు.

Published : 04 Feb 2023 03:52 IST

- న్యూస్‌టుడే, ఆదోని వైద్యం, నంద్యాల పాతపట్టణం

ఆదోని ప్రభుత్వ మహిళా ఆస్పత్రిలో సేవలు

కౌతాళం మండలం బదినేహాల్‌కు చెందిన సరోజ గతేడాది నవంబరులో ఆదోని ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స (కు.ని) చేయించుకున్నారు. ఇంత వరకు ఆమెకు నగదు ప్రోత్సాహకం అందలేదు. ఆపరేషన్‌ చేయించుకోవడానికి ఆమె 35 కి.మీ. ప్రయాణం చేసి సొంత డబ్బులు వెచ్చించారు.

ఆదోని మండలం బలేకొల్లుకు చెందిన లక్ష్మి గతేడాది అక్టోబరులో కు.ని. చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం బ్యాంకు ఖాతా సంఖ్య, ఆధార్‌ పత్రాలు తీసుకున్నారు. నిధులు విడుదలయ్యాకా డబ్బులు జమ చేస్తామని చెప్పడంతో ఒట్టి చేతులతో వెనుదిరిగారు.

ఉమ్మడి జిల్లాలో కుటుంబ నియంత్రణ (కు.ని.) శస్త్రచికిత్సలు తగ్గాయి. కొవిడ్‌ అనంతరం చాలా చోట్ల ఆ చర్యలే లేవు. శస్త్రచికిత్స చేసే వైద్యులు తక్కువగా ఉండటం, వైద్యులకు సరైన శిక్షణ లేకపోవడం, వీటికి తోడు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందకపోవడం వెరసి శస్త్ర చికిత్సలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 2021-22 ఏడాదిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14,058 కు.ని. చికిత్సలు లక్ష్యం కాగా, 7,575 మందికి చేశారు. జిల్లా విభజనంతరం కర్నూలు జిల్లా 13,563 మంది లక్ష్యం కాగా.. డిసెంబరు నాటికి 7,166 మందికి సేవలందించారు. నంద్యాలలో సుమారు వెయ్యి మందికి సేవలందించినట్లు సమాచారం. సేవల్లో నంద్యాల పూర్తిగా వెనుకబడింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందని సేవలు

* నంద్యాల జిల్లాలో బనగానపల్లి, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్‌ మినహా ఎక్కడా శస్త్రచికిత్సలు చేయడం లేదు. కర్నూలు జిల్లాలో జిల్లా ఆస్పత్రితో పాటు ఆదోని మాతా శిశు ఆస్పత్రిలో తప్ప మరెక్కడా సేవలు అందడం లేదు. ఆదోని డివిజన్‌ కేంద్రంలోని 17 మండలాల వారు ఆదోని ఆస్పత్రికి వచ్చి సేవలు పొందుతున్నారు. ఎటు చూసినా 30-50 కి.మీ. దూరం ప్రయాణం చేసి రావాల్సిందే.

* గతంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసేవారు. వచ్చేవారికి మౌలికవసతులు కల్పించి సేవలందించేవారు. ఇందుకు ప్రత్యేక బడ్జెట్‌తో పాటు ప్రత్యేక వైద్య బృందాలు, పడకలు, వైద్య పరికరాలు సమకూర్చుకునేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.

దక్కని ఆర్థిక ప్రోత్సాహకం  

కు.ని. చికిత్సలు చేయించుకున్న మహిళలకు రూ.1100, పురుషులకు రూ.600 ప్రభుత్వం ఇచ్చేది. నాలుగైదు నెలలుగా సేవలు పొందిన మహిళలకు నగదు ప్రోత్సాహకం అందాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో సుమారు 400-500 మందికి అందాలని అధికారులు పేర్కొంటున్నారు. నంద్యాల జిల్లాలో సరాసరి వెయ్యి మంది వరకు నగదు ప్రోత్సాహకాలు విడుదల కావాల్సి ఉంది. శస్త్రచికిత్స చేయించుకున్న వారిపేర్లు, బ్యాంకు ఖాతా, ఆధార్‌ నకలు పత్రాలు తీసుకుంటున్నారు.. నిధులు విడుదలైతే బ్యాంకు ఖాతాకు జమచేస్తామని సర్దిచెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ కాన్పు అనంతరం 5 లేదా 7 రోజుల తర్వాత కు.ని. చికిత్సలు చేస్తారు. కాన్పు అనంతరం మళ్లీ వచ్చి చేయించుకోవాలంటే ఇబ్బందులు పడతారని, ప్రసవం అనంతరం చేయించుకుంటుంటారు. రూ.వేలకు వేలు వసూలు చేస్తూ.. పేదలపై మరింత భారం మోపుతున్నారు.

తాళం వేసిన నంద్యాల పీపీ కేంద్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని