logo

ఉద్యోగమంటూ ఎర... మోసానికి తెర

ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలుకు చెందిన ఇద్దరు డోన్‌ పట్టణంలోని పాతపేట, కొత్తపేట, కొండపేటకు చెందిన ఆరుగురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు.

Published : 04 Feb 2023 03:52 IST

న్యూస్‌టుడే, డోన్‌, బేతంచెర్ల, ఆళ్లగడ్డ

నిరుద్యోగులకు ఇచ్చిన లేఖ

* ఉద్యోగాలు ఇప్పిస్తామని కర్నూలుకు చెందిన ఇద్దరు డోన్‌ పట్టణంలోని పాతపేట, కొత్తపేట, కొండపేటకు చెందిన ఆరుగురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు నుంచి రూ.4 లక్షల వరకు ముట్టజెప్పారు. రోజులు గడిచినా వారికి ఎలాంటి ఉద్యోగం కల్పించకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు.

* బేతంచెర్ల పట్టణం కొత్త బస్టాండుకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 15 మంది యువకుల నుంచి సుమారు రూ.8 లక్షలు వసూలు చేశారు. వారికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. బాధితులు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా ఓ అధికార పార్టీ నాయకుడు కలుగజేసుకుని బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తి తండ్రి నుంచి నగదును చెల్లించేలా బాండు పేపర్లు రాసిచ్చారు.

* ఓర్వకల్లు విమానాశ్రయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని బేతంచెర్ల పట్టణంతోపాటు రంగాపురం, ఓర్వకల్లుతోపాటు పలు గ్రామాలకు చెందిన 40 మంది వద్ద బేతంచెర్లకు చెందిన ఓ యువకుడు భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఒక్కో వ్యక్తి దగ్గర రూ.20 వేల నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేసి మొత్తం రూ.30 లక్షలకుపైగా తీసుకొన్నారు. కొందరికి నకిలీ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చారు. వారంతా పోలీసులను ఆశ్రయించారు.

ఉన్నత చదువు అభ్యసించిన యువకులు ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడొచ్చని ఆశిస్తారు. వారి ఆశను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసాలకు తెర తీస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి తీరా వారికి ఉద్యోగాలు ఇవ్వకపోగా చెల్లించిన సొమ్మును ఇవ్వకుండా మోసాలకు పాల్పడుతున్నారు. తీరా తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీస్‌స్టేషన్లను ఆశ్రయిస్తున్నా.. అక్కడా వారికి న్యాయం దక్కడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు.

అంతా అంతర్జాలంలోనే

ఫలానా శాఖలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మొదట సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయిస్తున్నారు. వాట్సప్‌ గ్రూప్‌లో పంపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకూ సమాచారం చేరవేస్తున్నారు. ఎవరైనా ఫోన్‌ చేస్తే మాటల్లో దింపి ఆశ పెడుతున్నారు. రూ.లక్షల వేతనం వస్తుందని ఊరిస్తున్నారు. కొలువు పొందాలంటే కొంత మొత్తం డిపాజిట్‌ చేయాలని సూచిస్తున్నారు. ఆ డబ్బులూ ఆన్‌లైన్‌లోనే తీసుకుంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇదిగో ఉద్యోగం అంటూ లేఖలు పంపిస్తున్నారు. అవి నకిలీవని తెలిసి యువత గగ్గోలు పెడుతోంది. పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే డబ్బులు రావని చెప్పి చాలా మంది సమాచారం ఇవ్వడం లేదు. ‘‘ ఇలాంటి అంశాలు మా దృష్టికి వచ్చాయి. గుర్తు తెలియని వారికి డబ్బులు చెల్లించకూడదు. ఎవరికంటే వారికి డబ్బులు చెల్లిస్తే మోసాలకు గురయ్యే అవకాశముంది. బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని’’ బేతంచెర్ల సీఐ ప్రియతంరెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని