logo

పట్టాలెక్కని ప్రజా వినతులు

రైల్వే పద్దులో ఉమ్మడి జిల్లాకు కేంద్రం అత్తెసరు నిధులు కేటాయించింది. కర్నూలు- మంత్రాలయం 80 కి.మీ కొత్త లైను ఏర్పాటు చేయాలన్న ఏళ్ల నాటి ప్రతిపాదనను ఈసారీ పట్టించుకోలేదు.

Published : 04 Feb 2023 03:52 IST

రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరే
కొత్త లైన్లకు కలగని మోక్షం

ఈనాడు - కర్నూలు : రైల్వే పద్దులో ఉమ్మడి జిల్లాకు కేంద్రం అత్తెసరు నిధులు కేటాయించింది. కర్నూలు- మంత్రాలయం 80 కి.మీ కొత్త లైను ఏర్పాటు చేయాలన్న ఏళ్ల నాటి ప్రతిపాదనను ఈసారీ పట్టించుకోలేదు. నంద్యాల- శ్రీశైలం కొత్తలైను ఏర్పాటు చేయాలన్న వినతులకు మోక్షం లభించలేదు. కర్నూలు- నంద్యాల రెండు జిల్లాలను కలుపుతూ కొత్త లైనుకు ప్రతిపాదన పట్టాలెక్కలేదు. ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్‌గా గుర్తించిన సమయంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. కర్నూలు దూపాడు వయా నన్నూరు, ఓర్వకల్లు, కాల్వబుగ్గ, కృష్ణమ్మకోన వద్ద పాణ్యంకు కొత్త లైను కలపాలని పార్లమెంట్‌లో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రస్తావించారు. పాణ్యం వద్ద కొత్త రైల్వేస్టేషన్‌కు ప్రతిపాదన చేసినా బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు చేయలేదు. నంద్యాలలో పిట్‌లైన్‌ ఏర్పాటు, పాల డెయిరీ వద్ద ఉపరితల వంతెన, ఇతర ప్రజావినతలేవీ పరిగణనలోకి తీసుకోలేదు.

మరమ్మతులు మరిచారు

కర్నూలు పంచలింగాల వద్ద నిర్మిస్తున్న కోచ్‌ మిడ్‌లైఫ్‌ వ్యాగన్‌ రిహాబిలిటేషన్‌ వర్క్‌షాపు- (సీఎంఎల్‌ఆర్‌)కు రూ.125 కోట్లు నిధులు కేటాయించారు. 2013-14లో మంజూరైన వ్యాగన్‌ మరమ్మతుల కేంద్రం అంచనాలు పెరుగుతూ రూ.540 కోట్లకు చేరింది. తాజా బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది రూ.83 కోట్లు, 2022లో రూ.143 కోట్లు కేటాయింపులు చేశారు. కేంద్రం పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మందికి ఉపాధి అవకాశాలు కల్గుతాయి.  పూర్తి అయితే సరకు రవాణా వేగవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

డబ్లింగ్‌ పనులకు రూ.980 కోట్లు

* నంద్యాల- యర్రగుంట్ల కొత్త లైను పనులకు సంబంధించి రూ. 1.70 కోట్లు కేటాయించారు. గుంటూరు- గుంతకల్లు డబ్లింగ్‌ పనులు మూడు డివిజన్ల పరిధిలో జరుగుతున్నాయి. ఆయా పనులకు రూ.980 కోట్లు కేటాయించారు. తాజాగా నిధులు విడుదల చేయడంతో తర్లుపాడు- నంద్యాల, ఎస్‌.రంగాపురం- బేతంచెర్ల- నంద్యాల వరకు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. నల్లమల ఘాట్‌లో పనులు చేపట్టేందుకు అనుమతులు రావాల్సి ఉంది.

* కర్నూలు దూపాడు రోడ్‌లోని ఓవర్‌ బ్రిడ్జికి రూ.10 లక్షలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.22.94 కోట్లు డిపాజిట్‌ చేయకపోవడంతో కేంద్రం బడ్జెట్‌లో స్వల్ప నిధులు సమకూర్చింది.

* నల్లపాడు-నంద్యాల వరకు 21.1 కిమీ మేర రైల్వే ట్రాక్‌ (పట్టాల కింద) ఫిట్టింగ్‌ మొత్తం మార్పు చేయడానికి నిధులు కేటాయించారు. రాష్ట్రీయ రైల్‌ సురక్ష కోట్‌ నుంచి రూ.3 కోట్లు, మరో పద్దు నుంచి రూ.1.41 కోట్లు ఇవ్వనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని