logo

కళారంగంలో ఎంపీ చరణాలు

డోన్‌ పట్టణంలోని కొత్తపేటకు చెందిన యువకుడు ఎంపీ చరణ్‌ పీజీ, టీటీసీ పూర్తి చేసి నృత్యకారునిగా, కొరియోగ్రాఫర్‌గా, చిత్రలేఖన ఉపాధ్యాయునిగా, లఘు చిత్రాలతోపాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు... ఇలా పలు రంగాల్లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా నిలుస్తూ పలువురి మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నారు.

Published : 04 Feb 2023 03:52 IST

లఘు చిత్రాలు, సినిమాల్లో రాణిస్తున్న యువకుడు
- న్యూస్‌టుడే, డోన్‌ పట్టణం

రణస్థలంలో హీరోగా ఫైట్స్‌ సన్నివేశంలో ఎంపీ చరణ్‌

డోన్‌ పట్టణంలోని కొత్తపేటకు చెందిన యువకుడు ఎంపీ చరణ్‌ పీజీ, టీటీసీ పూర్తి చేసి నృత్యకారునిగా, కొరియోగ్రాఫర్‌గా, చిత్రలేఖన ఉపాధ్యాయునిగా, లఘు చిత్రాలతోపాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు... ఇలా పలు రంగాల్లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా నిలుస్తూ పలువురి మన్ననలు, ప్రశంసలు అందుకుంటున్నారు.

చరణ్‌ సొంత గ్రామం డోన్‌ మండలం బి.రామదుర్గం. తల్లిదండ్రులు హరిజన గిడ్డయ్య, పెద్దక్క. వీరు కూలీ పని చేస్తుంటారు. చరణ్‌ డోన్‌లో డిగ్రీ వరకు చదివారు. ఆ తర్వాత 2018లో టీటీసీ (సాంఘిక శాస్త్రం), 2019లో టీటీసీ (ఆర్ట్స్‌) శిక్షణ పూర్తి చేశారు. కర్నూలులో 2021లో ఎంకాం అభ్యసించారు. ప్రస్తుతం అనంతపురంలోని సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయునిగా పని చేస్తూనే లఘుచిత్రాలు, సినిమాల్లో నటించడమే కాకుండా కొరియోగ్రాఫర్‌గా ప్రతిభ కనబరుస్తున్నారు.  

డిగ్రీలోనే కొరియోగ్రాఫర్‌గా చేసి..

డోన్‌లో బీకాం కంప్యూటర్‌ అభ్యసిస్తుండగానే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. డోన్‌కు చెందిన కొరియోగ్రాఫర్‌ రవితేజను కలిసి అతని సహకారంతో కవర్‌ సాంగ్స్‌కు సంబంధించి మూడు పాటల్లో డ్యాన్సర్‌గా చేసి మెప్పు పొందారు. అతని ప్రతిభను ‘బడుగు జీవులు’ చిత్రంలో నటించిన కథానాయకుడు పూజారి సురేశ్‌బాబు గుర్తించి నృత్యదర్శకునిగా ప్రయత్నించాలని చరణ్‌ను ప్రోత్సహించారు. దాంతో కవర్‌ సాంగ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసి పలువురి మెప్పు పొందారు. బుట్టబొమ్మ, 90 ఎంఎల్‌ సినిమాలోని సింగిల్‌ సింగిల్‌ సింగారానివే పాటకు, లై చిత్రంలోని బంబేలా ఉందిరా పోరీ, కలర్‌ ఫొటో చిత్రంలోని అరెరె ఆకాశంలోని పాటకు కొరియోగ్రాఫర్‌గా చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో లక్షల వీక్షణలు వచ్చాయి.

* మహిళలకు రక్షణ కల్పించాలనే సందేశాన్నిచ్చే ఓ లఘుచిత్రాన్ని తీశారు. కమర్షియల్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన రణస్థలం డెమో ఫిల్మ్‌ను చిత్రీకరిస్తుండటం విశేషం.

* 2019లో హైదరాబాద్‌లో డ్యాన్స్‌ పోటీల్లో రామ్‌చరణ్‌ నటించిన వినయ విధేయ రామ చిత్రంలోని పాటకు చరణ్‌ నృత్యం వేసి ద్వితీయ స్థానంలో నిలిచి సిని కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందుకున్నారు. బిగ్‌బాస్‌ విజేత సోహెల్‌ జన్మదినం సందర్భంగా బర్త్‌డే సాంగ్‌కు నృత్య దర్శకునిగా చేశారు.

1.15 లక్షల వీక్షణలతో గుర్తింపు

వారం రోజుల క్రితం జానపద పాటకు (ఆల్బమ్‌ సాంగ్‌) సంబంధించి ‘గలగల గలమని నీ కాలి గజ్జెల’తో పాటకు చరణ్‌ కొరియోగ్రాఫర్‌గా, హీరోగా, దర్శకత్వం చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆ పాట వారంలోనే 1.15 లక్షల వీక్షణలతో దూసుకుపోయింది.

సైరా సినిమాలో గుర్రంపై వెళ్తున్న ఎం.పి. చరణ్‌

సినీ రంగంలోకి ప్రవేశం

చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఆడిషన్స్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో తన మిత్రుడు, తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన కాశీ ద్వారా వెళ్లారు. ఆడిషన్స్‌లో ఎంపికై సినిమా అవకాశం దక్కించుకున్నారు. ఆ చిత్రంలో నటుడు జగపతిబాబు వెంట హార్స్‌ రైడర్‌గా సన్నివేశంలో నటించారు. అజయ్‌ పాసయ్యాడు అనే చిత్రంలో డ్యాన్సర్‌గా, మూడు పాటలకు గుంటూరుకు చెందిన మహేష్‌ మాస్టర్‌కు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. బడుగు జీవులు (బీజే) చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌కు డ్యాన్సర్‌గా, లవర్‌ ఆఫ్‌ ఆనంద్‌ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌కు డ్యాన్సర్‌గా చేసి శెభాష్‌ అనిపించుకున్నారు. హైదరాబాద్‌ వారు తీస్తున్న స్వయంవరం చిత్రంలో ఒక పాటకు మహేష్‌ మాస్టర్‌కు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేశారు. రక్తచరిత్ర-3 సినిమాలో కొరియోగ్రాఫర్‌ అవకాశం దక్కించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని