logo

యువ క్రీడాకారులు.. ఫుట్‌బాల్‌ మాంత్రికులు

ఆ ఇద్దరూ ఫుట్‌బాల్‌ మైదానంలో దిగారంటే.. గెలుపు వారి జాబితాలోకి వచ్చి చేరుతుంది. ప్రత్యర్థి గోల్‌పోస్టులపై దాడులు చేసి.. గోల్‌ సాధిస్తారు.

Published : 04 Feb 2023 03:52 IST

రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా
- న్యూస్‌టుడే, ఆదోని సాంస్కృతికం

సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ కోచ్‌లతో ఫుట్‌బాల్‌ క్రీడాకారులు

ఆ ఇద్దరూ ఫుట్‌బాల్‌ మైదానంలో దిగారంటే.. గెలుపు వారి జాబితాలోకి వచ్చి చేరుతుంది. ప్రత్యర్థి గోల్‌పోస్టులపై దాడులు చేసి.. గోల్‌ సాధిస్తారు. ప్రత్యర్థుల దృష్టిని మరల్చి.. తమ కాళ్లతో బంతిని మాయచేస్తూ విజయం వైపు దూసుకెళ్తున్నారు. మైదానంలో తమ ప్రతిభ చూపుతూ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో రాణించి శెభాష్‌ అనిపించుకున్నారు. ఆదోని పట్టణానికి చెందిన సిటీ¨ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున ఆదోని పట్టణానికి చెందిన పి.మహిమా స్వరూప్‌, డి.కౌశిక్‌ రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రీడాకారుల విజయగాథ తెలుసుకుందామా..

సాధనే గెలుపు మహిమ

ఆదోని పట్టణం అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పి.వీరేశ్‌, ఎస్తేరమ్మ దంపతుల కుమారుడు పి.మహిమా స్వరూప్‌ ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రత్యేకతను చాటుతున్నాడు. కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అండర్‌-19 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. మైదానంలో రైట్‌ ఫార్వర్డ్‌గా బరిలో దిగుతాడు. బంతిని డ్రిప్లింగ్‌ చేస్తూ ప్రత్యర్థుల గోల్‌ పోస్టులోకి బంతితో గోల్‌ చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఆరేళ్లుగా ఫుట్‌బాల్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఆదోని సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ తరఫున కోచ్‌ మస్తాన్‌వలి, జగన్నాథ్‌ శిక్షణలో స్వరూప్‌ రాణిస్తున్నాడు. తన ప్రతిభతో కర్నూలు జిల్లా జట్టు అండర్‌--19లో స్థానం సంపాదించారు. గత నెల 28, 29వ తేదీల్లో తిరుపతిలో స్కూల్‌ ఫెడరేషన్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చాటారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ఫైనల్‌లో కడప, కర్నూలు జట్లు తలపడగా.. కర్నూలు జట్టు ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకుంది. జాతీయ స్థాయిలో జరిగే సంతోష్‌ ట్రోఫీలో తాను ప్రాతినిధ్యం వహించాలని.. పీఈటీగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటున్నాడు ఈ యువ క్రీడాకారుడు స్వరూప్‌.

శెభాష్‌.. కౌశిక్‌

ఆదోని పట్టణం డి.రాజశేఖర్‌, ఇందుమతి దంపతుల కుమారుడు డి.కౌశిక్‌ ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. చదువుతూనే ఫుట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్నాడు. మైదానంలో డిఫెన్స్‌ క్రీడాకారుడిగా రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. ప్రత్యర్థులు గోల్‌ కొట్టేందుకు దూసుకొచ్చినా.. వారిని అడ్డుగోడలా నిలుస్తూ గోల్‌ కొట్టకుండా నివారించడంలో ఆరితేరాడు. తన ప్రతిభతో కర్నూలు జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. తిరుపతిలో గత నెలలో జరిగిన అండర్‌-19 రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి రెండో స్థానంలో నిలిచారు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు ఫుట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో రాణించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నాడు కౌశిక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని