logo

మేయర్‌ వినరు.. అధికారులు పట్టించుకోరు

భారీగా డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాం. ఇంతవరకు వార్డుల్లో పనులు కావడం లేదు. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం.

Published : 05 Feb 2023 02:24 IST

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: భారీగా డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచాం. ఇంతవరకు వార్డుల్లో పనులు కావడం లేదు. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికారులు.. మాపై సానుకూలంగా లేరు. పనులు చేయాలని చెప్పినా మేయర్‌, నగరపాలక కమిషనర్‌ పట్టించుకోరు. మరి డబ్బులు ఎలా సంపాదించుకోవాలి. పారిశుద్ధ్య కార్మికుల పోస్టులకు సంబంధించి ఒక్కో కార్పొరేటర్‌కు రెండు పోస్టులు సరిపోవు. మూడు పోస్టులు కేటాయించాలని పలువురు కార్పొరేటర్లు మేయర్‌ వద్ద డిమాండ్‌ చేశారు.

కమిషనర్‌ తీరుపై అసంతృప్తి

కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ భవనంలో అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఎలాంటి ఆదాయం లేదు.. ఆదాయ మార్గాలు మనమే వెతుక్కోవాలి. పనులు చేసుకోకపోతే ఇబ్బందులు పడతామంటూ బాధలు పంచుకున్నారు. వార్డుల్లో పనులు జరుగుతున్నా వాటాలు రావడం లేదు. పట్టణ ప్రణాళిక అధికారులు కనీసం ఫోన్‌ ఎత్తరు. భవన అనుమతుల కోసం వారే డబ్బులు దండుకుంటున్నారు. మేయర్‌, కమిషనర్‌ మనల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇంతలో ఓ వ్యక్తి మాట్లాడుతూ మా వర్గంలో (ఓ మాజీ ఎమ్మెల్యే) చేరండి పనులన్నీ అవుతాయి.. డబ్బులు సంపాదించుకోవచ్చని చెప్పారు. దీనికి కర్నూలుకు చెందిన కొందరు కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏం మాట్లాడుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. ఓ ప్రజాప్రతినిధి ఫోన్‌ చేయడంతో అక్కడి నుంచి కొందరు కార్పొరేటర్లు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మేయర్‌ తన ఛాంబరులోకి రావాలని కోరినా పలువురు పట్టించుకోలేదు.

కనీస సమాచారం ఇవ్వరు

అనంతరం పలువురు మేయర్‌ ఛాంబర్‌లో మేయర్‌ బీవై రామయ్యతో మాట్లాడారు. మీ వార్డులో జరిగిన పనులు.. తమ వార్డుల్లో జరగడం లేదు.. మా వార్డుల్లో చిన్న పని చేయించుకోవాలన్నా మిమ్మల్ని, కమిషనర్‌ను అడగాలని కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం గెలిస్తేనే మీరు మేయర్‌ అయ్యారు అని అన్నారు. అధికారులు వార్డులను సందర్శించేందుకు వచ్చినప్పుడు కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని.. ఇలాగైతే ఎలా అని ప్రశ్నించారు.

మూడు పోస్టులు ఇస్తే రూ.6 లక్షల లాభం

నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను భర్తీ చేస్తున్నారు.. ఒక్కో కార్పొరేటర్‌కు రెండేసి చొప్పున పోస్టులు పంచారు. రెండు పోస్టులు వద్దు.. మూడు పోస్టులు ఇవ్వాలని మేయర్‌ను డిమాండ్‌ చేశారు. జూనియర్‌, సీనియర్‌ కార్పొరేటర్లను ఒకేలా చూస్తే ఎలా అని మేయర్‌ వద్ద పలువురు కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో పోస్టును రూ.2 లక్షలకు అమ్ముకున్నా మూడు పోస్టులు ఇస్తే రూ.6 లక్షలన్నా సంపాదించుకున్న వారమతున్నామని చెప్పినట్లు తెలిసింది. రూ.లక్షలు పోసి కార్పొరేటర్లుగా గెలిచాం.. అన్నా మమ్మల్ని కాస్త పట్టించుకోండి అంటూ మేయర్‌ను కోరినట్లు సమాచారం.

* మేయర్‌ వద్ద సమావేశమైన కార్పొరేటర్లలో ఓ మహిళ కార్పొరేటర్‌ కన్నీంటి పర్యంతమైనట్లు తెలిసింది. తమ బాధలు చాలా ఉన్నాయని, ఒక్క పని చేసుకోలేకపోతే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని