logo

అక్రమాలు.. బట్టించుకోరా..!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటుక బట్టీల పేరుతో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పెద్దఎత్తున వీటిని నిర్వహిస్తున్నారు.

Updated : 06 Feb 2023 05:39 IST

యథేచ్ఛగా ప్రకృతి వనరుల దోపిడీ  
అధికారం అండతో అనుమతుల్లేకుండా నిర్వహణ

ఆళ్లగడ్డకు వెళ్లే ప్రధాన రహదారిని కమ్మేసిన పొగ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇటుక బట్టీల పేరుతో అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పెద్దఎత్తున వీటిని నిర్వహిస్తున్నారు. నిర్వాహకుల వెనుక అధికార పార్టీ నాయకులు ఉండటంతో అధికారులు అటువైపు చూడటం లేదు. జనావాసాల సమీపంలో.. రహదారుల పక్కనే ఇటుకలు కాలుస్తూ ప్రజారోగ్యానికి పొగబెడుతున్నారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమార్కులు రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు.

ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి  కూలీలను రప్పిస్తున్నారు. వీరి భద్రత, సంక్షేమం గాలిలో దీపంలా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం బట్టీలు అక్రమంగా నడుస్తున్నాయి. ఆత్మకూరులో నాలుగింటికి మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి. నంద్యాల పట్టణ శివార్లలోని పొన్నాపురం, అయ్యలూరు మెట్ట సమీపం, ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్‌లో ఉన్న ఇటుక బట్టీల్లో ఒక్కదానికీ అనుమతి లేకపోవడం గమనార్హం.

ఫిర్యాదులొస్తే తనిఖీ చేస్తాం : బషీరున్నిసా బేగం, కార్మికశాఖ సహాయ కమిషనర్‌, నంద్యాల

ఇటుక బట్టీలపై దాడులు చేసే అధికారం మాకు లేదు. ఫిర్యాదులు వస్తే తనిఖీలు నిర్వహిస్తాం. లైసెన్సులు కూడా నేరుగా ఆన్‌లైన్‌ విధానంలో తీసుకుని అక్కడే పన్నులు చెల్లించాలి. ఇతర ప్రాంతాల కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నా ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు సంబంధిత శాఖలే చూస్తాయి. గత కొన్నేళ్లుగా నిబంధనలు మారాయి.


అనధికారికంగా ఏర్పాటు

సిద్ధమవుతున్న ఇటుకలు

ఆత్మకూరు, వెలుగోడు, బండిఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి తదితర ప్రాంతాల్లో నల్ల మట్టి, రుద్రవరం, మహానంది, శిరివెళ్ల, చాగలమర్రి,  బేతంచెర్ల, డోన్‌, తమ్మరాజుపల్లె తదితర ప్రాంతాల్లో ఎర్ర మట్టి లభిస్తోంది.  నల్లమల, ఎర్రమల కొండ ప్రాంతాలతోపాటు అడవుల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.  పలు మండలాల్లో కొందరు నాయకులు భూములను కౌలుకు తీసుకుని మట్టి తవ్వి బట్టీలకు సరఫరా చేస్తున్నారు. మహానంది మండలం గాజులపల్లె, రుద్రవరం మండలం యల్లావత్తుల, సర్వనరసింహస్వామి క్షేత్రాల సమీపం నుంచి అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే మట్టి అక్రమంగా తరలుతోంది. నంద్యాల జిల్లా పరిధిలో 200 వరకు ఇటుక బట్టీలు నడుస్తున్నాయి. 95 శాతం వాటికి అనుమతులే లేకపోవడం గమనార్హం.

కాలుష్యం కోరల్లో ప్రజలు

బట్టీలకు కాలుష్య నియంత్రణ మండలి ధ్రువీకరణ అసలు లేదు. రహదారులు, జనావాసాల సమీపంలోనే ఇష్టానుసారం నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా వెలువడుతున్న కాలుష్యంతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయ్యలూరు, అయ్యలూరు మెట్ట, పొన్నాపురం, పొన్నాపురం కాలనీ, మిల్క్‌ డెయిరీ ప్రాంతాల ప్రజలతోపాటు ప్రధాన రహదారులపై రాకపోకలు సాగించే ప్రయాణికులు పొగకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి గండి

నిబంధనల ప్రకారం ఇటుక బట్టీల నిర్వహణ వాణిజ్య విభాగంలోకి వస్తుంది. నంద్యాల పట్టణ శివార్లలోని పొన్నాపురం, అయ్యలూరు మెట్ట సమీపం, అయ్యలూరు-పెద్దకొట్టాల మార్గంలో వందలాది బట్టీలు ఉన్నాయి. వీటిని వ్యవసాయ భూముల్లోనే ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. భూమి విలువలో 5 శాతం రుసుం చెల్లించాలి. ప్రస్తుతం బట్టీలు ఉన్న ప్రాంతంలో అధికారిక లెక్కల ప్రకారమే భూమి విలువ ఎకరం రూ.కోటికి పైగా ధర పలుకుతోంది. ఈ లెక్కన ఎకరాకు రూ.5 లక్షల వరకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. ప్రస్తుతం 200 ఎకరాలకుపైగా బట్టీలు అక్రమంగా నడుస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి రూ.10 కోట్ల వరకు గండి పడింది. ఓర్వకల్లు, తమ్మరాజుపల్లె, ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్‌, బేతంచెర్ల తదితర ప్రాంతాల్లో బట్టీల కోసం వెయ్యి ఎకరాలకు పైగానే వ్యవసాయ భూములను వినియోగిస్తున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు తీసుకోని కారణంగా ప్రభుత్వం రూ.50 కోట్ల వరకు ఆదాయం కోల్పోయింది.

* గనుల శాఖకు ఏడాదికి ఇటుక బట్టీల నుంచి రూ.8 వేలు రాయల్టీగా చెల్లించాలి. 20 బట్టీల నుంచి మాత్రమే రాయల్టీ వచ్చింది. ఈ విధంగా ఆ శాఖ రూ.10 లక్షల వరకు ఆదాయం కోల్పోతోంది. కుటీర పరిశ్రమల పేరుతో అక్రమ మార్గంలో విద్యుత్తు కనెక్షన్లు పొందడం ద్వారా ఆ శాఖ రూ.లక్షల్లో నష్టపోతోంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని